కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
కిటికీలో దీపం
కిటికీలో దీపం
(ప్రతిభ - జనవరి/ఏప్రిల్‌ 1939)
జితేంద్రియుని
బుద్ధిలాగు
జేగంటలాగు
కిటికీలో
దీపం!
గోడివతల
గదిలోపల
పేరుకున్న కాంతి
గోడవతల
చీకటి!
హృదయంలో
ఒకటి రెండు
వెలుతురు గాయాలు.
స్వర్గం
నరకం
చావు
బ్రతుకు
గొప్ప
బీద
వ్యత్యాసం
తెలివితక్కువ
చదువెక్కువ
తారతమ్యం
జీవహింస
చేయనని
చూడనని
నా శపధం!
గోడమీద
గదిలోపల
వెలుతురు కాసించి
చేరిన జీవుల
ఆకలితో
భక్షించే
బల్లి!
పక్కలో పాలుత్రాగు
పసిపిల్లడు
ఉక్కిరి బిక్కిరి యైనట్టు
గొప్పగాలి రేగింది
గోడవతల
చీకటి నవ్వింది
కిటికీలో దీపం
కంపించి
ఊపెత్తిన
వెర్రిపీరులా
ఊగి ఊగి
సాగి సాగి
తెగిపోయిన
రబ్బరుముక్కై
తెగటారెను!
ఇప్పుడో
కిటికీలో
గోడివతల
గదిలోపల
ఒకటే చీకటి!
జీవరహస్యం!!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - kiTikIlO dIpaM - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )