కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
దరిద్ర సంగీతం
దరిద్ర సంగీతం
(ప్రతిభ - అక్టోబరు 1940/41)
వేస్తావా?
నా దరిద్ర సం
గీతానికి
భూమ్యాకాశాలే
తాళం చిప్పలు?
చెప్పనా?
కష్టమైన
సంకీర్ణపు
నరజాతికి
ఆకలి
ధ్రువతాళం!
వెయ్యిమరి
సీలా! (Selah!)
నాయక గోపాల!
నాయక గోపాల!!
ఆకలితో
నా కడుపు
అగ్నివీణ
వాయిస్తే
దీపక రాగం
దిక్కుల కెగబ్రాకి
ఆకాశం
అంటుకుంది
ఆర్పండి!
ఆర్పండి!
నా కెదురుగ
దూరంగా కుశినీ
కనబడని
చేతులతో
నీరుల్లే
తరిగినారు
బాగుంది!
కమ్మగ
తెల్లని రుచి!
నా జ్ఞాన
చక్షువుకు మాత్రం
ఏదో బాధ
మసక మసక
బిగించిన
పిడికిలి
చీకటి!
బియ్యపు గింజలు
చుక్కలు!
మసాలా వేసిన
కూరవాసన!
ఘాటుగ
గాలిరేగితే
నాశ్రవణ
శంఖద్వయంలో
ఆకలి 'ఓం' కారం!
అర్ధించగ
అర్ధించగ
ఆకాశమె నయం!
భిక్షాటనం
కులవృత్తిగ
గలవారు
కలిగినదేదో
పెడితే
విలువెంచుట
అవినీతె!
దుకాణాలు మూశారె!
ఇప్పుడెందుకు?
కరిగేందుకు
కంసాలిని కాను
కవిని!
నా కెందుకు
చెల్లని రూపాయి?
తెల్లని జాబిల్లి
శ్రుతి కటువగు
మచ్చతో
శ్రవణ పేయంగా
రజతరావ
సంగీతం
రోదసి నిండెను!
అదే పదివేలు!!

ప్రతిభ అక్టోబరు 1940 - జనవరి 41 సంయుక్త సంచికలో "దరిద్ర సంగీతం" గీతాన్ని ప్రచురించినప్పుడు ఈ క్రింది వివరణలు నారాయణబాబే వ్రాశాడు.

దీపకరాగం దక్షిణ దేశస్థులకు, అంటే కర్ణాటక సంగీత సంప్రదాయానికి కామవర్ధని జన్యం. ఈ రాగంలో కీర్తనగానీ, పదముగానీ లేదు. 'సంగీత సంప్రదాయ ప్రదర్శని'లో రాగ లక్షణ మీయకుండా అప్రస్తుతమని ఊరుకున్నారు. గ్రంథ పీఠికలో దీపకరాగం గురించి ఇలా వ్రాసి వుంది: "రమారమి 400 సంవత్సరాలకు మునుపుండిన గోపాలనాయకు లనువారు ఉత్తర దేశములో నొక రాజసభలో దీపక రాగమును పాడి దీపముల నంటింప జేసినట్లు (ప్రతీతి)" ఉత్తర హిందూస్థానంలో ఈ నాటికీ దీపకరాగం గొప్ప పలుకుబడి గల రాగం. విద్వాంసులు పాడుతారు.

గోపాల నాయకులు: ఈ సంగీత మహావిద్వాంసుడు తాళార్ణవ, రాగకదంబము లను ప్రబంధములను చేసియున్నట్లు సంగీత రత్నాకరమునకు వ్యాఖ్యానం రచించిన కల్లినాథుడు తాళాధ్యాయమునందును, గోపాలనాయకులే శ్రుతుల నెరింగినవారని వెంకటమఖి తన చతుర్దండి ప్రకాశికలో శ్రుతి ప్రకరణమందు చెప్పియున్నట్లు సంగీతసంప్రదాయ ప్రదర్శనిలోను కలదు.

గోపాలనాయకుల గురించి Atiya Begum Fyzee Rahamini ఆమె రచించిన The Music of India అనే గ్రంథములో ఇలా వ్రాసింది: "గోపాలనాయకులు, అక్బరు చక్రవర్తి కాలంలో సంగీత విద్వాంసుడు. ఒకనాడు చక్రవర్తి గోపాల నాయకుని దీపకరాగం పాడమన, జడిసి చక్రవర్తి కంటబడకుండ ఆరుమాసములు తప్పించుకు తిరిగెను. పిదప నొకపరి అక్బరు గోపాలనాయకుని దీపకరాగం పాడక వీల్లేదని నిర్బంధించెను. చక్రవర్తిని బతిమాలుకున్నాడు, తప్పింది కాదు. యమునా సలిలంలో మండి వేసి గోపాల నాయకులు దీపకరాగం కొంతసేపు ప్రస్తరించే సరికల్లా, యమునా సలిలం క్రాగి పోయింది కాని చక్రవర్తి హృదయం కరుగలేదు. కొంతసేపు కొన్ని స్థానాలలో రాగం ప్రస్తరించేసరికి మంటలు పుట్టాయి. ఆ మంటల కావిద్వాంసుడే ఆహుతి అయిపోయినాడు."

    నాడు సంగీతం
    మంటలు పుట్టిస్తే
    నేడు ఆకలి మంటలే
    సంగీతాన్ని పలికించాయి!

AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - daridra saMgItaM - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )