కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
నగ్న గీతాలు
నగ్న గీతాలు
(భారతి - సెప్టెంబరు 1941)
-- ౧ --
సరికొత్త
శరీరంలో
నెత్తురు పాడిన
పాటకు
నగ్నశోభ
నందన వనమై
పూచింది
అవలోకిస్తే
అవినీతని
బుద్ధులుచెప్పే
బుద్ధికికాదు;
కన్నులనిండే
అందంకోసం
కళవళపడు
డెందాలకె!
చూపులతో
అందుకోండి!
అదేమిటి?
పండ్లరుచి తెలిసికూడా
పచ్చికాయలు రాల్చుకుంటూ
పారిపోయే
ఉడుత సరదా!
వారెవరు?
ఏదో
కీచకభావం
నా సైరంధ్రీ గీతాన్నే
చెరబడితే
చూస్తూ ఊరుకొనే
నా రక్తం
ధర్మరాజు!
ప్రేమ
స్త్రీ పురుష
కామహోమంలో
పాణింధమము
ప్రేమ!
-- ౨ --
నా హృదయం
అద్దం అయితే
నా భావం
ప్రతిబింబిస్తే
ఉడుకుబోతు
నా రక్తం
'హఁ' అంటే
మసకమసక
మాలిన్యం
నా గీతం!
ఎందుకో
ఎండావానా
మగడు పెళ్లాం
జగడమాడితె
కయ్యానికి కాలుజాచు
కొమ్మలు పూవులు
కిలకిల నవ్వితే
నా మీదెందుకు
ఈ పర్జన్యం
గర్జిస్తుంది
జగమంతా
కన్నయితే
చీకటి కజ్జలమైతే
నా గీతం
చూపు!
నీవు ప్రేమ
ఈ ప్రపంచ వైతరణి
దాటేందుకు
నీ కోసం
నే చేసిన
గోదానం
నా గీతం!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - nagna gItAlu - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )