కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
తెనుగురాత్రి
తెనుగురాత్రి
(భారతి - డిసెంబరు 1941)
శూన్యమ్మగు చూపులతో
శుష్కించిన దేహముతో
పేదవాని కడుపుమంట
కాలి పేలిపోవు కోర్కె
గగనమ్మున చుక్క
శక్తి సన్నగిల్లిపోయి
రక్తము విరిగిన గుర్విణి
హస్తమునన్‌ చిటిలిపోవు
శస్త్రమ్మటు బిలుకుమార్ప
మాసిపోని గాజుముక్క
నెలవంక
సంఘం వంక!
నోట మన్నె కొట్టు జగతి
నోరు తెరువ పాలకొరకు
బాలిక
చూలాలి కిదుకుబిడ్డ
తూలిపోవు అసువులే
నీలాలగాలి వీస్తోంది
తలకాలని తల్లిశవం!
తండ్రి పెండ్లికై తహతహ!
కడవడు నీళ్ళకు నేడ్చే
గంపెడు పిల్లల దుఃఖపు
కంటివాన
మిన్నంటి కురియు మంచుసోన!
పసితనమున పెండ్లి
భర్త పరమపదము జేర
విధవ
మసక మసక యౌవనమున
కుసుమించే తల్లితలపు
గుండెల్లో పాలపాట
ఆకాశపు పాలబాట!
ఆంధ్ర యువక జీవనార్చి
కాలిన మేడలనుంచి
ఆరిన వాడలనుంచి
ధూమమ్మెగజిమ్మే
చీకటి
దుమ్ము రేగు
తెనుగురాత్రి!!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - tenugurAtri - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )