కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
వీధి పాటకులు
వీధి పాటకులు
(భారతి - ఏప్రిల్‌ 1942)
క్రోటన్‌ కొమ్మ
కుష్ఠురోగి
మచ్చలతో గాయాలతో
బిచ్చగాడు
గ్రుడ్డిది
ప్రేమలాగు
చీకటి మ్రాను
ముష్టిముండ
దరిద్రాన్ని
మరచేందుకు
కాకిలాంటి కాలాన్నే
తరిమేందుకు
కవి!
* * *
చీకటికే
పుడితేనేమి
రోగాలే కంటేనేమి
కడుపుతీపి చెడ్డది!
పుట్టారిద్దరు వత్సలు
ముళ్ళపూలు
మునిగోరింట జంటలు
ఊరవతల
మట్టినేల
మర్రిచెట్టు నీడలోన
బ్రహ్మజ్ఞాని
బ్రహ్మచెముడు
బాలసారె
చేసింది
'పోతిగాడు!'
'అసిరిగాడు!'
ఇరుగు పొరుగు
ఉన్నారా
విన్నారా
పేపరులో పడ్డాదా?
'ప్రతిభ'కు పద్యాలా?
భూమి
కన్న సంతానాన్ని
దీవించింది
* * *
ప్రకృతి పెట్టిన
వేసవి గానపాఠశాల
తుమ్మెద తంబురశ్రుతి
కోయిల ఒజ్జ
శాపంలో కుశలవులు
వాల్మీకం
శంకరాభరణం!
* * *
రోడ్డుదరి
హాలు
గుమిగూడిన ప్రజ
శ్రమనివారణ పాట
ఉదయభాను కరముల
ఉయ్యాల లూగి
మెరసిపడే
చంటిపిల్ల
ధూళిలాగు
ఆకలితో
కాలి పేలిపోవు
కంఠద్వయి
పాట!
* * *
గాన పాఠశాలలో
చదువుకున్న ఎద్దు
సత్తరవులో పద్దు
వచ్చా డొకడు
ప్రజ మధ్యకు
విద్వాంసుని
కచ్చగట్టి
భైరవికి
ఆనంద భైరవికి
వ్యత్యాసం చెపితే
వేలకు వేలిస్తానని!
నవ్వుకుంటు
పిల్లలు
గువ్వజంటలాగు
విద్వాంసులు
'సంధ్యలో
భైరవి
ప్రస్తావిస్తే
వెన్నెల దూరేవేళకు
ఆనందభైరవి
అవుతుంద'ని నుడివారు!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - vIdhi pATakulu - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )