శతకములు చెన్నమల్లు సీసములు
1 14 19 22 26 31 36
శరణ స్థలము
చేసిన నుపచారి చేయమి సోమరి - ఫలము గోరక చేయ భక్తిపరుఁడు
పొగడినఁ బ్రౌఢుండు పొగడమి మూఢుండు - నిరవెర్గి పొగడఁ గవీశ్వరుండు
వలెనన్న సంసారి వలదన్న నిర్మోహి - వలదనర్పితమన్న బహుప్రసాది
తలఁచిన సువిధాని తలఁపమి నద్వైతి - తన్ను మరవఁ దలఁపఁ దత్త్వవిదుఁడు
 
అట్లుగాన దద్‌జ్ఞులగు మహాభక్తుల - సరస లింగకవులసత్ప్రసాద
రతులఁ బరమతత్త్వయుతుల మహాత్ములఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
26
నీవె కర్త వటన్న నిక్కంబు భక్తుండు - తా నన్న నుభయకర్మానుగతుఁడు
నీకె యన్నను సదా నియతప్రసాదాంగి - తనకన్న నింద్రియతత్పరుండు
నిన్ను నెఱింగిన నేటైనశరణుండు - తన్ను నెఱింగినఁ దామసుండు
నీవు తా నన్నను నిజము లింగైక్యుండు - తాని నీ వనిన నద్వైతవాది
 
కాన కాయకర్మగతిమతి శబ్దచై - తన్యభావములను దన్ను మఱచి
లింగగతిఁ జరించు లింగలింగైక్యులఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
27
తను వెల్ల నీ ప్రసాదమె గాని పొందదే - పునరాగతము మాన్పు మనఁగ నేల
మనుచు సద్భక్తుల మఱిగాని యొల్లదే - బ్రతికింపు మని దైన్యపడఁగ నేల
ప్రాణముల్‌ నినుగాని భజియింపకుండవే - యపవర్గ మిమ్మని యడుగ నేల
విషయముల్‌ నినుగాని వేధింపకుండవే - యువగుణంబులఁ బాపు మనఁగ నేల
 
యెఱుక నిన్నెగాని యెఱుఁగదే సద్భక్తి - యొసఁగు మొసఁగు మనుచుఁ గొసర నేల
కోర్కి నిన్నెగాని కోరదే మఱియొండు - విన్నపంబు లేల చెన్నమల్లు.
28
ఏదెసఁ జూచున నాదెస లింగంబు - దృక్కుల వెంబడిఁ దేజరిల్లు
నెక్కడఁ జూచిన నక్కడ లింగంబు - మునుఁగుచు నిలుచుచు మూర్తిఁ గొనక
యెచ్చోటఁ జూచిన నచ్చోట లింగంబు - మనమునఁ జిట్టాడుచును బెనంగు
నెమ్మెయిఁ బొందిన నమ్మెయి లింగంబు - దనువునందునఁ డొట్రుకొనుచుఁ దనరుఁ
 
దివిరి పలుకుల లింగంబు తీఁగ సాగఁ - దొడరి పలుకుల లింగంబు ముడివడంగ
నతిశయిల్లెడు పరమలింగానుభవులఁ - జేర్చి రక్షింపవే నన్నుఁ జెన్నమల్లు.
29
కనుమూయుఁ దెఱచు నీకన్నుల వెంబడి - వినుచుండు వినఁడు నీ వీనులందు
స్వాదించు మోదించు నీదు నాలుకయందు - గంధించు సొగయు నీఘ్రాణమందు
స్పర్శించుఁ బాయు నీసర్వాంగములయందుఁ - దలఁపించుఁ దలఁచు నీతలఁపులందు
గమనించు నిలుచు నీగమనాగమములందు - భాషించు మాను నీభాషలందు
 
నీడఁ బోలు తాను నీడ యై బాహ్యాంత - ర ప్రవర్తనముల నీప్రసాద
సౌఖ్యమునను బొదలు ముఖ్యప్రసాదులఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - chennamallu sIsamulu shatakamu - pAlakuriki sOmanAtha ( telugu andhra )