శతకములు చెన్నమల్లు సీసములు
1 14 19 22 26 31 36
ఐక్య స్థలము
ధర 'నవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ' - యనుకర్మయోగంబు నపహసించి
యేదియు లేక 'జ్ఞానాదేవ మోక్ష' మను - జ్ఞానయోగంబు హాస్యంబుచేసి
వదలక 'యాత్మనా మిద మగ్రజే' త్తను - ధ్యానయోగంబును నాశ్రయించి
తగవెంచఁ 'బూజ్యా యథామవాయం' బను - భక్తి యోగంబుచే బాగుగాను
 
జేవ పొదలు పరమశివయోగసుఖసుధా - శరధి మరచి తన్ను జగము మఱచి
లింగగతి చరించు లింగలింగైక్యులఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
31
కరువున బోసినకరణి సమస్తాంగ - ములు నిండి నీలోన మూర్తి గొనఁగ
గండరించిన భాతిఁ గలయు ప్రాణంబున - నెలకొని నీరూపు నిగ్గుదేఱ
నచ్చు నొత్తినయట్టు లంతరంగంబున - నెలకొని శృంగార మెలమి మిగులఁ
జిత్తరించినభాతి చేష్టలు దవిలిన - నాకారరేఖ సమంచితముగ
 
మ్రానుచేవబలియు మాడ్కి సందడిఁ దన్ను - నెఱుఁగఁ దెలివి వీఁక కఱకుపడక
నీవ యై చరించు నీమహాభక్తులఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
32
శ్రీగురు నకట వాసిగఁ గాలదన్నిన - మేరు వానందంబుఁ జేరుపూజ
నిలుపవే భజియించు నెపమున లింగని - నీరూపు నతులితనిరవగుణము
సర్వేశుఁ గడునర్థిఁ బర్విన చూడ్కిని - సంకీర్ణ జైమినిసాటికాయ
తఱితఱి సన్మనోనిరతి కాయమునందుఁ - గనువిచ్చుడును సర్వగత మనంగఁ
 
జెలఁగి నలి ప్రాణలింగంబుఁ జేసి యనుప - నీవ కర్తవు తను వెల్ల నిర్మలముగ
నేదెసను జూచి కనుమూయ మోద మొసఁగ - ధర నవశ్యంబు కరవున వెఱపులేక.
33
భక్తస్థలమునఁ బదుమూఁడు మాహేశ - పదమున నైదు నేర్పడఁ బ్రసాది
పదమున మూఁడు దత్ప్రాణలింగికి నాల్గు - శరణస్థలంబున నరయ నైదు
నైక్యస్థలంబున కలవడ రెండును - షట్స్థలవిజ్ఞానసరణి నొప్పి
క్షితిని ముప్పదిరెండు సీసపద్యంబులు - సరసోక్తిగాఁ బాలకురికి సోమ
 
నాథుఁ డన నొప్పు నారాధ్యనవ్యమూర్తి - యఖిలవేదపురాణశాస్త్రార్థవిదుఁడు
వీరశైవసభాయోగ్యవిదితముగను - జెన్నమల్లేశు ప్రీతిగాఁ జెప్పె నిట్లు.
34
పదుమూఁడునైదుమూఁడును
పదపడి నాల్గైదు రెండుపద్దెంబులు గా
నిది భక్తాదికషట్స్థల
మది వెలయఁగ వెలయుఁ జెన్నమలు సీసంబుల్‌.
35
AndhraBharati AMdhra bhArati - shatakamulu - chennamallu sIsamulu shatakamu - pAlakuriki sOmanAtha ( telugu andhra )