శతకములు చెన్నమల్లు సీసములు
1 14 19 22 26 31 36
భక్త స్థలము
శ్రీ గురులింగ సంచిత కృపోన్నతిఁ జేసి - కంటి జంగమ పాదకమలసేవ
జంగమలింగ ప్రసన్నత్వమునఁ జేసి - కంటిఁ బ్రసాదసుఖంబు నొందఁ
దత్ప్రసాద ప్రబోధస్థైర్యమునఁ జేసి - కంటి సర్వాంగప్రకాశభక్తి
భక్తిసౌభాగ్యానుభవ పూర్తిమైఁ జేసి - కంటి జీవన్ముక్తి కడమలేక
 
యింక నేమికొఱఁత యేల నీకాశింపఁ - బాడి యాడి దైన్యపడి భజించి
మెచ్చి పొగడిరేని మీఁద నొందెడిఫలం - బెన్న నున్న దెట్లు చెన్నమల్లు
1
అకట ప్రమథుల రాయం డనియే గాక - నీ వున్న చోటు మున్నెవ్వఁ డెఱుఁగుఁ
బాటిగా నన్నేలు చోటు భక్తరక్షకుఁ డని - కాక యెవ్వండు నీఘనత నెఱుఁగుఁ
దెలుపుమా శ్రీగురుదేవుఁడా యనికాక - యిచట నీపేరు దా నెవ్వఁ డెఱుఁగు
లెస్సపోనా చరలింగమా యనికాక - యిట్టివాఁ డనుచు ని న్నెవ్వఁ డెఱుఁగు
 
వారినగరి లెంకవాఁడ నేఁ గలిగితిఁ - గాన నీకుఁ బ్రాపు గలిగెఁ గాక
యితరు లెవ్వ లెఱుఁగ రి ట్లెఱింగియుఁ బెద్దఁ - జేయ వేల నన్నుఁ జెన్నమల్లు.
2
కాలఁ దన్నిన నోర్తు కడగి యేనడుగులఁ - బడిన నెత్తవు పక్షపాతి దగునె
ఱాలపూజలు గొందు మేలిపుష్పంబులఁ - బూజింప నన్నవబోధ తగునె
కోరి ప్రసాదంబు గొందు నే ముట్ట క - ర్పించినఁ గొనవిట్టి కించ తగునె
మేలపుఁగబ్బముల్‌ మెత్తునా సంస్తుతుల్‌ - వినియును విన వవివేకి తగునె
 
వారు నడిచినట్లు వచ్చునే నడువ నీ - వునిచినట్లు తప్పకుండఁ జూచి
కొందుగాని నాదు గుణవిశేషత కల్మి - యెన్నఁగలదె నీకుఁ జెన్నమల్లు.
3
మేరువు సోఁకుచో భేరుండ మని వాయ - సము పూనియే తనుచ్ఛాయ చేయు
రసము సంధిల్లుచో రజతాదిలోహ ప్ర - భావంబు లరసియే పసిఁడి చేయు
సూర్యుండు వ్యాపించుచో నగ్రజాంత్యజా - తుల నేరుపఱచియే వెలుఁగుఁ జేయుఁ
సురపతి వర్షంబు గురియుచో సస్యతృ - ణాంతరం బరసియే యలరఁజేయుఁ
 
బ్రాణనాథ నాదుభక్తి విశేషంబు - పట్టిచూడ నీకుఁ బాడియగునె
యిన్ని యేల నీమహేశ్వరత్వము వెల్తి - చేసికొనఁగ నేల చెన్నమల్లు.
4
ఆనంద మలర లింగార్చన చేయక - గుడుచుట పాపంబు గుడుచునట్లు
అర్చకుండయ్యు లింగానర్పితము గోరి - ముట్టుట యవ్యంబు ముట్టినట్లు
లింగ ప్రసాదంబు జంగమవిముఖుఁడై - కొనుట యేమేనియుఁ గొనినయట్లు
జంగమహితుఁడయ్యు సరిపాకభేదంబు - సేయుట ద్రోహంబు సేసినట్లు
 
అనుపురాతనోక్తి కావంతయును దొట్రు - పడనిశుద్ధభక్తి, పదము ప్రాణ
పదముగాఁ జరించు భక్తలింగంబులఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
5
పూజింప నలయింపఁ బుణ్యపాపంబులు - వివరించిచూడ నీయవియె కావె
తలఁపింప మఱపింపఁ దద్గుణ దోషంబు - లరసిచూడంగ నీయవియె కావె
యాడింప నోడింప నా హెచ్చుకుందులు - ఠవణించిచూడ నీయవియె కావె
వలపింప సొలపింప నిలసుఖదుఃఖంబు - లవి యెన్నిచూడ నీయవియె కావె
 
నామనోవిభుండ నాస్వామి సకలచై - తన్యకర్త సూత్రధారిచేతి
బొమ్మ కున్నదయ్య యిమ్మహి నీయిచ్చ - చెప్ప వేల వేయి చెన్నమల్లు.
6
నిలుపవే ప్రాణంబు నీయందుఁ బెరసి సం - పూర్ణమై దేహంబు పొందు విడువ
సలుపవే మది నిచ్చ నిరతంబు నీభక్త - చిద్గోష్ఠి దవిలి దుశ్చింత లుడుగఁ
గొలుపవే సర్వాంగ గుణములు నీభక్త - పదమందు లీనమై భ్రాంతి దక్క
మెలుపవే యింద్రియంబులుగూడ నీ ప్రసా - దంబును దవిలి తత్పరత నిలువఁ
 
బ్రాణనాథ భక్త పరతంత్ర మత్కాయ - సన్నిహితమహాప్రసాదమూర్తి
యిండు లేల నీకు నుండ నాయం దిమ్ము - చేసికొనవె చాలుఁ జెన్నమల్లు.
7
భజియించు కేవలభక్తి ముక్తికిఁ దాన - యునికియు మనికినై తనరెనేని
చను శీలసంబంధసంపన్నతకుఁ దాన - గతియును మతియునై క్రాలెనేని
సంగతంబుగఁ బ్రాణలింగంబునకుఁ దాన - యొడలు ప్రాణంబునై యుండెనేని
సంతతబాహ్య ప్రసాదంబునకుఁ దాన - రూపును రుచియునై చూపునేని
 
వేయి యేల యతని విమలానుభవసౌఖ్య - మున్నఁ జాల దెట్టు లెన్న ఫలము
నట్లుగాన నీ మహాభక్తి యుక్తులఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
8
నెపమునఁ బ్రాణంబు నీయందుఁ బ్రిదిలిన - యప్పుడె మృతినొందఁ డయ్యెడేని
కలనైన నిలిచిన నిలుకడ చలియింప - నప్పుడ రూపకుం డయ్యెనేని
యించుకంతయు మతి నితరభావము సోఁక - నప్పుడు కని వ్రాలఁ డయ్యెనేని
అణుమాత్ర మైన లింగానర్పితము సోఁక - నచ్చోటఁ దెగఁజూడఁ డయ్యెనేని
 
భక్తిమాట లాడ ఫలమేమి వెండియు - మజ్జనంబు చేయ లజ్జగాదె
యట్లుగాన నీ మహాప్రసాదానూన - సిద్ధి కేవలంబె చెన్నమల్లు.
9
లింగ నీభక్తులలీల వీక్షింపుచో - నొడలెల్ల కన్నులై యుండెనేని
దేవ నీభక్తులఁ దివిరి కీర్తించుచో - నొడలెల్ల జిహ్వలై యుండెనేని
జియ్య నీభక్తాంఘ్రిసేవ యొనర్చుచో - నొడలెల్ల చేతులై యుండెనేని
అయ్య నీభక్తమహాత్మ్య మాలించుచో - నొడలెల్ల వీనులై యుండెనేని
 
స్వామి భవదీయభక్తి ప్రసాదముక్తి - యుక్తి కొడలెల్ల నోళ్లునై యుండెనేని
అట్టిభక్తుల మహిత దివ్యాంఘ్రి యుగళ - శేఖరులఁ జేర్చి రక్షించు చెన్నమల్లు.
10
నీరూపు నీరేఖ నీయన్ను నీచెన్ను - నీపెంపు నీసొంపు నీచలంబు
నీమూర్తి నీస్ఫూర్తి నీశాంతి నీకాంతి - నీలాగు నీబాగు నీవిధంబు
నీబల్మి నీకల్మి నీయురుల్‌ నీసిరుల్‌ - నీనెఱి నీగుఱి నీమెఱుంగు
నీనల్వు నీచెల్వు నీలలి నీలులి - నీరీతి నీభాతి నీస్థిరంబు
 
తనువునందుఁ గుదురుకొని కనుఁగవ వెళ్లఁ - బారి మదిఁ బెనంగి ప్రాణముగను
నీవయై చరించు నీమహాభక్తులఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
11
అతులిత పరమశివాచార సార స - న్మార్గంబు గతియును మతియునేని
రాజిత గురులింగ పూజనోత్సవ మేళ - నంబు పదము పదార్థంబునేని
సంతత సముచిత సత్కాయజంగమ - భక్తియు శ్రీయు సంపదయునేని
బాహ్యాంతరార్పిత గ్రాహ్యప్రసాదంబు - లాయుష్యమును భవిష్యంబునేని
 
భక్త సద్గోష్ఠిముదిత విస్ఫార సుఖము - భుక్తియును ముక్తియును నేని భక్తుఁ డతఁడు
అట్టి భక్తులమహితదివ్యాంఘ్రియుగళ - శేఖరుం జేర్పవే నన్నుఁ జెన్నమల్లు.
12
అవగుణంబులు తనయందుఁ బరీక్షించుఁ - గావనిపుచ్చు సద్భావకులను
సద్గుణంబులు భక్తజనులం దనుష్ఠించి - శరణని మ్రొక్కెడు సజ్జనులను
దొరకినయట్లు సంతోషించి విగతాంగ - భోగులై చను మహాపురుషులను
సకలసుఖంబులు జంగమార్పణఁ జేసి - వెండియుఁ దనియని పండితులను
 
దన్నువఱచి భక్తతతిఁ గొనియాడు ని - గర్వులను గుణోపకారమతుల
శుద్ధభక్తిరతుల సిద్ధప్రసాదులఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
13
AndhraBharati AMdhra bhArati - shatakamulu - chennamallu sIsamulu shatakamu - pAlakuriki sOmanAtha ( telugu andhra )