శతకములు ధూర్తమానవా శతకము
 1 11 21 31
తనువెల్లన్‌ గులపెట్టి జీర్ణసుఖ రు-గ్దద్రువ్యధాపీడచే
త నహోరాత్రులు కామతృప్తి కొరకై-దారాడు స్వర్లోక నా
థుని పక్షంబయి దానశీలుని మహ-త్పూజ్యున్‌ బలిన్‌ సత్యవా
క్యనిరూఢున్‌ బొరియించినా ననుచుఁ బ-ల్కన్‌ జూతువే మానవా!
11
ఒక్కఁడు తండ్రిఁ జంపెనని-యోరిమిలేకయె గండ్రగొడ్డటన్‌
జక్కడగింప ధర్మువగు-నా కులమంతయు? దీనిజేయ నే
నొక్కఁడనే కనంబడితి-నో! యిటువంటివి పూర్వమందు నే
దిక్కులనేని విన్పడెనె?-తిక్కవదల్చెద ధూర్తమానవా!
12
ఉడుగక తొల్లి పెండ్లమును-నొక్కతె నామెడ కంటఁగట్టి యా
బిడ నెవఁడో హరించె నని-వెంగలిమాటలు చెప్పి యామెకై
యెడతెగకుండ బావురని-యేడ్చితినంచును నెన్నిరోజులో
బడబడ పెద్దగ్రంథములు-వ్రాసితివేమిర? ధూర్తమానవా!
13
మిడిమేలంబుగఁ దెచ్చిపెట్టితివిగా-మేనత్తతోఁ గూటమిన్‌
బడి మువ్వంకల ముండతోడ మధురా-పట్నంబులోఁ గూటమిన్‌
మెడకుంగట్టితి వెంతవాఁడవుర! నీ-మిట్టాటలన్‌ మానవా!
కడికండల్‌ తెగఁగోసివైచెదను గా-కశ్రేణికిన్‌ మానవా!
14
అవతారంబులనెత్తి చేయగల న-న్యాయంబు లన్నింటి నే
నవతారంబుల నెత్తకుండ మఱి చే-యన్‌ శక్తిలే దంచు న
న్నవమానించితి వింతకాల మిటు? ని-న్నాపాదమస్తంబుగా
నివురుంజేసెద నెవ్వరడ్డపడగా-నీ కుండిరో మానవా!
15
స్మృతులన్‌ వ్రాసితి నందు; వాస్మృతులలోఁ-జిత్రించి శ్రుత్యర్థముల్‌
ప్రతిపాదించితినందు; వయ్యది నిజం-బా? యెంతకాలంబు దు
ష్కృతి సాగింతువు, లోకవంచనములన్‌-జేయింతువో, చేతువో
పతితాత్మా, యిఁకనైన యీ వెడఁగు త్రో-వల్‌ మానవా? మానవా!
16
కలలోఁ గన్పడుచుండు బట్టబయలన్‌-గన్పట్ట రాకుండు గ
ఱ్దలు గ్రంథంబులు జెప్పుఁ గట్టెదుటఁ బ్ర-త్యక్షంబుఁ జెప్పండు లో
కులు కల్లోలపడంగ నీగతిని ట-క్కుల్‌ చెప్పు మాయావికిన్‌
తలతిక్కన్‌ వదలింతు నీపయిని చి-త్తభ్రాంతిపో మానవా!
17
ఈ టకటొంకు లేమిటికి?-నిల్లును వాకిలిఁ గట్టిపెట్టి యే
టేటను బెండ్లి సేయుమని-యే నెపుడైనను గోరియుంటినే!
చీటికి మాటికిన్‌ బరుల-జేబులు గొట్టుట ధర్మమార్గమే?
ఏటికి నీయబద్ధ మర-రే! యిఁక సాగునె? ధూర్తమానవా!
18
బొక్కెడుకూడు పట్టుమని-పొట్టకు తింటినె యొక్కపూటయేన్‌?
జక్కగ నొంటినిండ నొక-జానెడు గుడ్డను గప్పుకొంటినే!
ఒక్కటియేని మ్రుచ్చిలిక-యుంచితివే? యిఁక నీదుపాటు లే
నక్కయుఁ గుక్కయున్‌ బడదు;-నా పలుకుల్‌ విను ధూర్తమానవా!
19
పొక్కిలిగడ్డలేక, తన-పొయ్యికిఁ గట్టెలు లేక, మంటకున్‌
బిక్కినఁ గుండలోనికిని-బియ్యపునూకలు లేక, గంజిలో
లెక్కకు నుప్పుగల్లయిన-లేక, కృశించెడి పేదవానికిన్‌
ఱెక్కలు డుచ్చి సిల్గుల హ-రింతువె చెప్పర, ధూర్తమానవా!
20
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dhUrtamAnavA shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )