శతకములు ధూర్తమానవా శతకము
 1 11 21 31
ఏఁ బదునాల్గులోకముల-సృష్టియొనర్చుచుఁ బెంచి పిమ్మటన్‌
దూబవలెన్‌ హరింతు నని-దొంగనుడుల్‌ వచియించు చుంటివే!
యేఁబదిమాట లేమిటికి?-ఇట్టి ప్రచారము మానకున్నచో
గూబలు సాఁగఁదీసెదను-గూయకు మిట్టివి ధూర్తమానవా!
1
ఎవ్వరు చూచినారు సృజి-యింపఁగ నీ పదునాల్గులోకముల్‌
సువ్వన సువ్వి సువ్వి యను-చొప్పెకదా! యొకఁడైనఁ జూచెనే
దవ్వులనుండియైన నొక-దానినినైన? వృథా ప్రగల్భముల్‌!
నవ్వుల పాలుఁజేసెదవె-నన్నిటులాడుచు ధూర్తమానవా!
2
ప్రతివర్షంబును నా వివాహ మను పే-రన్‌ బెక్కుచందాల దు
ర్మతి చందాలు వసూలుచేసి ప్రతియూ-రన్‌ గజ్జకట్టింతువే!
గతి యీమాత్రములేదె నాకరయ? నేఁ-గావించుకోలేనె? యీ
గతి నన్నీవు పరాభవించుటకు సం-కల్పింతువే మానవా!
3
కాపురముండ నిల్లు, నడ-కత్తెరలోఁ బడియుండఁ బెండ్లమున్‌,
మాపులు కున్కఁగాఁ బడక-మంచము, నెక్కగ నెక్కిరింతలున్‌,
సాపడఁ బైడికంచమును-జక్కగఁగూర్చి యుపన్యసింతువే?
నీపనిఁ బట్టెదన్‌ వినుము-నీవిది మానవ ధూర్తమానవా!
4
కొస కేమౌనొ యెఱుంగకుండ నుసితోఁ-గోణంగివై నీవు నీ
పుసికన్నుల్‌ మసిముక్కు దేబెమొగమున్‌-బువ్వాడు పెన్‌బోరెమున్‌
తొసినోరున్‌ గలిగించి వంచకుఁడవై-దుర్జాతి, నన్నొక్క మా
నిసినిం జేసెదవే! మనుష్యునివలెన్‌-నేనుంటినే మానవా!
5
కాలుంజేతులు ముక్కు మోములును చం-కల్‌ చన్నులున్‌ బేర్లు నీ
కేలా యున్నవొ; నాకు నట్లెకలవా?-యీరీతిగా నన్ను నీ
వేలా వర్ణనచేసినాడ వకటా!-యెందాక సైరింతు? నిన్‌
పాలార్తున్‌ మునుమున్న చెప్పితిని నీ-పాట్లన్నియున్‌ మానవా!
6
గుడులున్‌ గోపురముల్‌ కుశీలవుఁడవై-కూర్పించి చందాలతో
మడిమాన్యంబులు నాదు పేరుననె ని-ర్మాణంబు గావించుచున్‌
వడపప్పున్‌ బెరవారి కిచ్చెదవె? నీ-భావంబునం దేమి గీ
ల్పడఁగా నేర్చెడి? చెప్పు మింతటి దివా-లాఖోరువే మానవా!
7
వేదము లెట్లు బ్రహ్మముఖ-వీథులనుండి హరింపఁగాఁ బడున్‌;
పాదలి సోమకాసురుఁడు-వచ్చి త్రయిన్‌ హరియించె నంచు నే
చీదరఁ బొందకుండ చొఱ-చేఁపను జేసితివే ననున్‌ - సరే!
నీదయమీద నా బ్రదుకు-నిల్చెనె చెప్పుమ ధూర్తమానవా!
8
బలి యేపాపముఁ జేసినాఁ డతనిపై-వైరంబు నాకేల? త
ద్బలి రాజ్యంబు హరింప వంచకుండనై-ధర్మంబుఁ బోద్రోసి దో
ర్బలహీనుండగు నింద్రుఁ బ్రోవ నవతా-రం బెత్తినా నంచు లో
కులు నమ్మన్‌ వచియింతు వింకయిన బొం-కుల్‌ మానవా? మానవా!
9
పరులను, ధర్మదూరులను,-బంధురపాపనిమగ్నచిత్తులన్‌
గరుణను గాచి ప్రోచుటకు-గా మఱితో బలిచక్రవర్తినిన్‌
దిరిపెము నెత్తినాఁడ నని-దేబిరిగొట్టుమొగంబ, యెల్లెడన్‌
నిరతము చాటుచుండెదవె!-నీపనిఁ బట్టెద ధూర్తమానవా!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dhUrtamAnavA shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )