శతకములు ధూర్తమానవా శతకము
 1 11 21 31
మరణపు శయ్యమీఁద నొక-మారయినన్‌ నను దప్పకుండ సం
స్మరణము చేసినంతటనె-స్వర్గము వచ్చునటందు, వేగతిన్‌
బొరయును? నిట్లె నీ వెపుడు-బొంకుచునుందువు దీనికై నినున్‌
గఱకఱ గొంతు కోసెదను-కానివి చెప్పకు ధూర్తమానవా!
21
ఏ నొకజాతికూడు భుజి-యించుచు మిక్కిలి తక్కుజాతులన్‌
హీనముగాగఁ జూతునని-యెవ్వరు సెప్పిరి నీకు వంచకా!
మానవు లందఱున్‌ సరిస-మానులు గారొకొనాకు? మాయురే!
మానక నీవ యిట్టి యవ-మానముఁ జేతువె ధూర్తమానవా!
22
త్వరపడకుండ సంజపడు-దాఁకను తప్పుపనుల్‌ పొనర్చి పై
బొరుగున నున్న తోఁటలను-బూవులు మ్రుచ్చిలి కోసి తెచ్చి నా
శిరమునఁ బోసినంతటనె-చేసిన పాపము లొక్కసారిగా
మఱచెడునట్టి వెంగలినె-మానక యిట్టివి ధూర్తమానవా!
23
పసులను, జెట్టుచేమలను,-బక్షితతిన్‌, గ్రిమికీటకాదులన్‌
బుసుకున దాకినంతఁ దల-పోయవు స్నానముమాట; కాని మా
నిసి నినుఁ దాకినంతఁ దల-నిండుగ స్నానము ధర్మమార్గమే!
ముసిముసినవ్వు నవ్వెదవు-మోరెగబట్టుక ధూర్తమానవా!
24
బొచ్చు నొసంగి యెట్లు పరి-పూర్ణమనోరథసిద్ధిఁ బొందగా
వచ్చును? బిచ్చివాఁడనని-భావమునం దలపోయుచుంటివా?
పుచ్చును నీదు పాపములు-పోరచి మానుము యిట్టి వానినిన్‌;
బొచ్చెము లిట్లుచెప్పి ప్రజ-మోసము చేయకు ధూర్తమానవా!
25
ఒక దేవాలయమందు స్త్రీలకు రహ-స్యోత్సాహివై బోధముల్‌
నికరాదాయముతోడ జోడుచెవులున్‌-నిండించుచున్నావఁటే!
అకటా కొంపల నెన్ని దీసితివొ య-త్యాచారముల్‌ సల్పి, నీ
మొకమున్‌ రాసెద మానకున్న యెడలన్‌-ముమ్మాటికిన్‌ ధూర్తమానవా!
26
బిడ్డలకోసరమ్ము విల-పించెడి యా జవరాండ్రతోడుతన్‌
బిడ్డలు తప్పకుండఁ బ్రభ-వించెదరంచు సమాదరంబునన్‌
గడ్డముపట్టి "గర్భగుడి"-గర్భముఁ జేర్చుదువట్టెరేల నో
వెడ్డరి! నాకు మంచి పని-వెట్టితి వింతకు ధూర్తమానవా!
27
వాజను మానకున్న నప-వాదులు; తప్పవు శృంగభంగముల్‌;
రోజులు నీకుఁ జాల విసి-రో! జులుమింతకు మానకున్నచోఁ
బాజివియౌదు వీవు నగు-బాటు ఘటిల్లును; నింక మీఁద నీ
పోజును జూచి మోసపడి-పోవుట గల్గదు ధూర్తమానవా!
28
తిరిపెము నెత్తియెత్తి యతి-దీనతఁ దిర్గుచు జోలి బట్టుచున్‌
తిరుపతికొండ మీఁది కెగ-దేకుచు నచ్చట చెప్పుదెబ్బ లీ
వొరువుగఁ దిన్న లేశము ప్ర-యోజన ముండదు ధర్మమార్గమున్‌
బిఱిఁదికిఁ ద్రోసిపుచ్చి పర-పీడకుఁ బూనిన ధూర్తమానవా!
29
తిరుపతిఁ బుట్టి; రంగపురి-తెన్నుల వర్ధిలి; కాశిలోపలన్‌
మరణము పొందినప్పటికి-మారదు కర్మఫలానుభూతి; నీ
వెరిగియు దీని స్వార్థరతి-నెల్లవిధంబుల నెంతమందినో
పురపుర నెల్లవేళలను-మోసముఁ జేతువే ధూర్తమానవా!
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dhUrtamAnavA shatakamu - kavirAju tripuranEni rAmasvAmi ( telugu andhra )