బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి బొమ్మలపెండ్లి

బొమ్మలపెండ్లి

(బాలికలు చందనపు బొమ్మలకు పెండ్లితంతు నడిపింతురు. అప్పు డీ పదము పాడుదురు.)


చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెననగా,
శృంగారవాకిళ్లు సిరితోరణాలు;
గాజుపాలికలతో, గాజుకుండలతో,
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.

చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు,
పెద్దన్నపెట్టెనే పెట్టెల్లసొమ్ము,
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము,
పోతునే బొమ్మ నీకు పొన్నేఱునీళ్లు.

        కట్టుదునె బొమ్మ, నీకు కరకంచుచీర,
        తొడుగుదునె బొమ్మ, నీకు తోపంచురవిక,
        ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు,
        అత్తవారింటికీ పోయి రమ్మందు.

అత్తచెప్పినమాట వినవె ఓ బొమ్మ!
మామచెప్పినపనీ మానకే బొమ్మ!
రావాకుచిలకమ్మ ఆడవే పాప!
రాజుల్లు నీచెయ్ది చూడవచ్చేరు.

ప్రధానపుంగరం పమిడివత్తుల్లు
గణగణగ వాయిస్తు గంటవాయిస్తు,
గజంబరాయడూ తల్లి రాగాను,
తల్లి ముందరనిలచి యిట్లన్ని పలికె.

        అన్న అందలమెక్కి, తాగుఱ్ఱమెక్కి,
        గుఱ్ఱమ్ముమీదను పల్లమున్నాది,
        పల్లమ్ముమీదను బాలుడున్నాడు,
        బాలుడి ముందరికి కూతుర్నిదేరె,
        కూతురిసిగలోకి కురువేరు దేరె,
        నాకొక్క ముత్యాలబొట్టు దేరమ్మ!
        బొట్టుకు బొమ్మంచు చీర దేరమ్మ!
        చీరకు చిలకల్ల రవికె దేరమ్మ!
        రవికకు రత్నాలపేరు దేరమ్మ!
        పేరుకు పెట్టెల్ల సొమ్ము దేరమ్మ!

చిన్నన్న దెచ్చాడు చింతాకుచీర,
పెద్దన్న తెచ్చాడు పెట్టెల్ల సొమ్ము,
రావాకు చిలకతో ఆడబోకమ్మ,
రాజుల్లు నీచెయిది చూడవచ్చేరు.

వీధిలో ముడివిప్పి ముడువబోకమ్మ,
పల్లెత్తి గట్టిగా పలుకబోకమ్మ,
పొరుగిళ్లకెప్పుడూ పోవకేబొమ్మ,
నలుగురీ నోళ్లల్లో నానకేబొమ్మ!

(ఈ బొమ్మల పెండ్లిళ్లలో వియ్యాల వారి విందులు, అలకలు,
మొదలుగాగల పెండ్లి మర్యాదలన్నీ నడుపుదురు.
ఇది భావికాలమందు వాస్తవముగా జరుగ బోయే
విషయములకు అభ్యాసకృత్య మనవచ్చును;
యాజ్ఞికుల శుష్కేష్టుల వంటిది. దీనిచే పసితనముననే
బాలికలకు, కులాచార సంప్రదాయములందు ప్రవేశ
మేర్పడును. ఈ యలవాటుచే నటు తర్వాత వానిని చక్కగా
జరుపుకో గల్గుదురు.)

ఎండావానా పెళ్లాడే,
ఎడవల్లప్పయ్య యాజ్ఞీకుడు!

(ఎండ కాస్తుండగానే, వాన కురుస్తున్నప్పుడు పాడే పాట)

AndhraBharati AMdhra bhArati - bommalapeMDli - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )