భాష ఛందస్సు సులక్షణసారము
2. సంజ్ఞా ప్రకరణము
2.1. మాత్రాలక్షణము
క. మాత్రయన నొక్క లఘువగు
మాత్రలు రెండైన గురువు - మఱియెన్నఁ బడున్‌
ధాత్రిని నఱువది నాలుగు
మాత్రలుగా గందమునకు మాత్రలు వెలసెన్‌.
7
2.2. గురు లఘువుల స్వరూపము
క. వివిధముగఁ జాఁపి పలికెడు
నవియును మఱి యూఁదిపలుకు - నవియును గురువుల్‌
భువి నిలిపి పలుకు వర్ణము
లవియెల్లను లఘువులయ్యె - నంబుధి శయనా!
    (అనంతుని ఛందము)
8
క. గురువులు నిడుదలు జడ్డ
క్కరముల బొట్టుల పిఱుంద - కడ నూఁదిన య
క్కరములు, పెఱయవి లఘువులు
గురులఘువులు మూఁడు గూడి - కొన గణములగున్‌.
    (భీమన ఛందము)
9
2.3. గురు లఘువులకు గుఱుతులు
క. గురువులకు సంజ్ఞ యొక్క
ట్ల రయం దలక్రిందు వ్రాయు - నటులం జెలఁగున్‌
ధరపై లఘువులు వెలయున్‌
గరిమన్‌ నిడుగీటు వ్రాయు - కరణి ముకుందా!
10
2.4. గణస్వరూప నిరూపణము
క. గగణంబగు నేక గురువు
లగణంబగు నేక లఘువు - లాలిత్యముగా
వగణమగు లఘువు గురువును
హగణంబగు గురువు లఘు వ - హర్పతి తేజా!
    (భీమన ఛందము)
11
క. లలమునకు రెండు లఘువులు
వలనొప్పఁగ లఘువు గురువు - వఱలును లగమై
గలమయ్యె గురువు లఘువును
జలజాక్షా! గగమనంగఁ - జను గురు యుగమున్‌.
12
క. 'శౌరి' యనిన హగణంబగుఁ
జేరి 'హరీ' యనిన మల్ల - సిల్లును వగణం
బారయఁ 'గృష్ణా' యనినను
ధారుణి గగమండ్రు లలము - దా 'హరి' యన్నన్‌.
    (అనంతుని ఛందము)
13
2.5. సమ (ప్రధాన) గణములు
క. గురువులు మూఁడిడ మగణము
పరఁగంగా నాదిగురువు - భగణం బయ్యెన్‌
ధరమధ్య గురువు జగణము
సరసగుణా! యంత్యగురువు - సగణం బయ్యెన్‌.
    (భీమన ఛందము)
14
క. నగణంబు మూఁడు లఘువులు
యగణంబున కాదిలఘువు - యమతనయ నిభా!
రగణంబు మధ్యలఘువగు
తగణంబున కంత్యలఘువు - దాక్షిణ్యనిధీ!
    (భీమన ఛందము)
15
2.6. ప్రధాన గణముల కుదాహరణములు
క. మగణము 'శ్రీనాథా' యన
భగణము 'కేశవ' యనంగఁ - బరికింపగా
జగణము 'ముకుంద' యనఁగా
సగణము 'వరదా' యనంగ - సర్వజ్ఞనిధీ!
16
క. నగణము 'వరద' యనంగా
జగతి 'మురారీ' యనంగఁ - జను యగణంబున్‌
రగణంబు 'మాధవా' యన
తగణము 'దైత్యారి' యనఁగఁ - దామరసాక్షా!
17
క. నగణముపయి గురువున్నన్‌
నగమగు, లఘువున్న యెడల - నలమగు వరుసన్‌
సగణము పయి లఘువున్నన్‌
దగ సలమగుఁ గంజహిత సు - ధాకరనయనా!
18
2.7. ఉపగణములు - సూర్యేద్ర చంద్ర గణములు
క. నల నగ సల భ ర తలు నా
నెలమిని నీయాఱు గణము - లింద్రగణంబుల్‌
గల నగణము లీ రెండును
జలజాప్త గణంబు లయ్యె - జగదాధారా!
19
క. గల సగణము లినుఁ డింద్రుఁడు
సల నగ సల భ ర త లింక - నగగ నహ సలా
భల భగురు మలఘు సవ సహ
తల రల నవ నలల రగురు - తగ లిందుఁ డజా!
    (అనంతుని ఛందము)
20
2.8. వృత్తగణ ప్రస్తారము
క. చాలుగను సర్వగురులిడి
లాలితముగ గురువు క్రింద - లఘువు వలపటన్‌
ఓలి సమంబులు దావలి
వ్రాలకు గురువులను నిల్పఁ - బ్రస్తారమగున్‌.
    (అనంతుని ఛందము)
21
క. ఎన్నవ ఛందం బడగిన
నన్నియ గురులిడుచు మఱి గ - ణాష్టకమును దాఁ
బన్నుచు లఘువులె తుదగా
నెన్నిక నిడ వృత్తసంఖ్య - యేర్పడవచ్చున్‌.
22
2.9. సూర్యేద్ర చంద్ర గణోత్పత్తి
క. ద్విత్రిచతుర్గురు భవములు
ధాత్రీధర రెండు నుడుపఁ - దక్కినగణముల్‌
మిత్రేంద్ర చంద్రు లనఁ దగు
మాత్రాది గణంబు మొదల - మాత్ర లిడంగన్‌.
    (అనంతుని ఛందము)
23
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - sulakShana sAramu - vishhaya sUchika - liMgamaguMTa timmakavi - sulaxaNa sAramu vellaMki tAtaMbhaTTu andhra telugu tenugu ( telugu andhra )