భాష ఛందస్సు సులక్షణసారము
3. జాత్యుపజాతులు
3.1. కందము
క. కందము త్రిశర గణంబుల
నందము గాభజసనలము - లట వడి మూఁటన్‌
బొందును నలజల నాఱిట
నొండుం దుదగురువు జగణ - ముండదు బేసిన్‌.
24
3.2. ఉత్సాహ
. సాహచర్య పద్మమిత్ర - సప్తకంబు గురువు ను
త్సాహవృత్తమునకె చెల్లు - జలజదళవిలోచనా!
25
3.3. ద్విపద
క. ఎలమిన్‌ మూఁడింద్రగణం
బులపై నొక సూర్య గణముఁ - బొందించిన స
ల్లలితముగ ద్విపదలక్షణ
మిలఁ బదములు రెండు ప్రాస - మేకము కృష్ణా!
26
ద్విపద. ఇంద్రగణములు మూఁ - డినగణం బొకటి
చంద్రాస్య! ద్విపదకుఁ జనుఁజెప్ప రేచ!
    (భీమన ఛందము)
27
ద్విపద. నడురాత్రి యరుదెంచె - నరలోకనాథ
కడుడస్సి నాఁడవు - కచుమోడ్తుగాక.
    (రంగనాథ రామాయణము)
28
3.4. తరువోజ
తరువోజ. నలనామగణము లి - నగణంబుతోడ,
నాలుగుగాఁజేసి - నయముతోడుతను
కలయంగ నెనిమిది - గణములై రెండు
గణముల తుదఁగూడఁ - గా యతి నిల్పి
వెలయంగఁ బాదముల్‌ - విరచింప వళ్ళు
వేర్వేఱ నిప్పాట - విదితమైయుండ
సలలితగతిఁ గృతి - చనఁజెప్పుఁ డనియె
జానుగాఁ గవిజనా - శ్రయుఁడు తర్వోజ.
    (భీమన ఛందము) 29
3.5. మధ్యాక్కర
 
మధ్యాక్కర. సురరాజ యుగముతోఁ గూడి
సూర్యుతో నొడఁబడియుండి
సురరాజ యుగముతోఁ గూడి
సూర్యుతో నొడఁబడి వెండి
కరమొప్పు నీ పాట నాఱు
గణముల మధ్యాక్కరంబు
విరచింపఁ బ్రావళ్ళు నిట్లు
వెలయుఁ గవిజనాశ్రయుండ.
    (భీమన ఛందము)
30
3.6. ఆటవెలఁది - తేటగీతి
ఆ. ఇనగణత్రయంబు - నింద్రద్వయంబును
హంసపంచకంబు - నాట వెలఁది
సూర్యుఁ డొక్కరుండు - సురరాజులిద్దఱు
దినకరద్వయంబు - తేటగీతి
31
తే. జడలు దాలిచి తపసుల - చందమునను
దమ్ముఁడును దాను ఘోరదు - ర్గములందుఁ
గూరగాయలు కూడుగాఁ - గుడుచునట్టి
రాముఁ డేరీతి లంకకు - రాఁగలండు?
    (మొల్ల రామాయణము)
32
3.7. సీస పద్యము
తే. ఇంద్రగణము లాఱు - నినగణంబులు రెండు
పాదపాదమున - బరఁగుచుండు
ఆట వెలఁదియైనఁ - తేటగీతియునైనఁ
జెప్పవలయు మీఁద - సీసములకు
33
3.8. ద్విపదాదుల విశ్రమ స్థానములు
ఆ. ద్విపద సీసములకు - విశ్రాంతి రెంటిపై
నెలమి గీత కంద - ములకు మూఁటి
కడలయతులు నాల్గు - గణములమీఁద ను
త్సాహమునకు నిరతి - సారసాక్ష
34
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - sulakShana sAramu - vishhaya sUchika - liMgamaguMTa timmakavi - sulaxaNa sAramu vellaMki tAtaMbhaTTu andhra telugu tenugu ( telugu andhra )