భాష ఛందస్సు సులక్షణసారము
6. ప్రాసములు
క. స్వరనియతి లేదు ప్రాసకు
నరయఁగ నేయక్షరమున - కా యక్షర మే
పరువడి నిలుచును నాలుగు
చరణంబులఁ గృతులయందు - సమ్యక్ఫణితిన్‌.
166
6.1. షడ్విధ ప్రాసములు
క. భాసురములగుచు సుకర
ప్రాసాను ప్రాస దుష్క - ర ప్రాసాంత్య
ప్రాస ద్విప్రాస త్రి
ప్రాసము లన షడ్విధములు - ప్రాసము లుర్విన్‌.
    (భీమన ఛందము)
167
6.1.1. సుకరప్రాసము
క. పరమోపకార! ధరణీ
సురవర సురభూజ! సుగుణ - సుందర! తరుణీ
స్మరనిభ! సుకరప్రాస మ
మరఁ జెప్పంగఁ గృతులఁ జెల్లు - మల్లియరేచా!
    (భీమన ఛందము)
168
6.1.2. అనుప్రాసము
క. విప్రప్రకరముని ప్రీ
తిప్రద! సుప్రభవ! యప్ర - తిమదోఃప్రభవా!
విప్రణుతి! సుప్రసన్న! య
ను ప్రాసప్రవణ మిది మ - నుప్రియ చరితా!
    (అనంతుని ఛందము)
169
6.1.3. దుష్కరప్రాసము
క. దోః కీలత మణికటక! యు
రః కలిత రమాభిరామ! - రాజిత సుగుణాం
తః కరణ! ఖండితారి శి
రః కందుక! యనిన దుష్క - ర ప్రాసమగున్‌.
    (అనంతుని ఛందము)
170
6.1.4. అంత్యప్రాసము
క. అగణితవిభవస్ఫూర్తీ!
నిగమాగమ సతత వినుత - నిర్మలమూర్తీ!
జగదభి రక్షణవర్తీ!
యగు నంత్య ప్రాస మిట్లు - దంచితకీర్తీ!
    (అనంతుని ఛందము)
171
6.1.5. ద్విప్రాసము
క. కంజనయన! భవభీతి వి
భంజన! శుక శౌనకాది - బహుముని చేతో
రంజన! ద్వంద్వప్రాసమ
నంజను నిప్పాటఁ బల్కి - నం గృతులందున్‌.
    (అనంతుని ఛందము)
172
6.1.6. త్రిప్రాసము
క. తా నవనీత ప్రియుఁడన
దానవ నిర్మూలనైక - తత్పరుఁడన స
న్మౌని వినుతుఁడని నతసుర
ధేనువనఁగ గృతులయందుఁ - ద్విప్రాసయగున్‌.
    (అనంతుని ఛందము)
173
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - sulakShana sAramu - vishhaya sUchika - liMgamaguMTa timmakavi - sulaxaNa sAramu vellaMki tAtaMbhaTTu andhra telugu tenugu ( telugu andhra )