భాష ఛందస్సు సులక్షణసారము
7. కావ్యాదిగ్రాహ్యవర్ణ విచారము
7.1. పంచభూత బీజాక్షరములు
7.1.1. వాయు బీజాక్షరములు
క. పరఁగఁగ అ ఆ ఏ లును
వరుసఁ గ చ ట త ప య ష లు ధ్రు - వంబునఁ బదియున్‌
ధరఁ భవన బీజములు గో
వరవాహన! సకలలోక - వందిత చరణా!
    (వాదాంగ చూడామణి)
174
7.1.2. అగ్ని బీజాక్షరములు
క. క్రమమున ఇ ఈ ఐలును
రమణ ఖఛఠథఫరసలును - రాజిలుఁ బదియున్‌
సమముగను దహన బీజము
లమరఁగఁ దలపోయ శంబ - రాంతక హరణా!
    (వాదాంగ చూడామణి)
175
7.1.3. భూ బీజాక్షరములు
క. మున్నుగ ఉ ఊ ఓలును
నెన్నఁగ గజడదబలహలు - నీ ధరఁ బదియుం
బన్నుగ భూ బీజంబులు
పన్నగ వరశయన బాణ! - పన్నగభరణా!
    (వాదాంగ చూడామణి)
176
7.1.4. ఉదక బీజాక్షరములు
క. ధీరత ఋ ౠ ఔలును
సారపు ఘఝఢధభవళలు - సరసన్‌ బదియున్‌
దోరపు జలబీజంబులు
ఘోరాసుర పురవిదార! - గోధ్వజ కలితా!
    (వాదాంగ చూడామణి)
177
7.1.5. ఆకాశ బీజాక్షరములు
క. ఌ ౡ అం ఙ ఞ న మలు
సల్లలితములై వెలుంగు - శక్షలు పదియుం
జెల్లు గగన బీజములని
తెల్లముగా వాసవాది - దివిజస్తుత్యా!
    (వాదాంగ చూడామణి)
178
7.2. పంచభూత బీజాక్షర ఫలంబులు
మ. క్షితిబీజంబులు సంపదల ల్వొదలఁ బో - షించున్‌ బయోబీజము
ల్సతతంబున్‌ ప్రమదం బొనర్చు శిఖి బీ - జంబుల్‌ మృతింజేయు మా
రుత బీజంబులు శోకవార్ధిఁ బడఁగా - ద్రోయు న్నభోబీజముల్‌
పతి నత్యంత దరిద్రుఁ జేయు మిగులం - బద్యాది నొందించినన్‌.
    (భీమన ఛందము)
179
7.3. అమృతాక్షర విషమాక్షరములు
క. అమృతాక్షరములు హ్రస్వము
లమరఁగ దీర్ఘములు విషము - లనఁబడు వీనిన్‌
గ్రమమున అకచటతపయశ
సముదయమును దెలిపి నిలుపఁ - జనుఁ బద్యాదిన్‌.
    (గోకర్ణ చ్ఛందము)
180
క. తెలియక ఘోషాక్షరములు
నెలవుగఁ బద్యాదియందు - నిలిపిన చోటన్‌
నలమటఁ బొందియుఁ గృతిపతి
పలుమఱు వెతనొంది దైన్య - పాటుం జెందున్‌.
181
క. అకచటతప యశ లెనిమిది
ప్రకటిత గిరి ఋతులమూఁటఁ - బదునొక్కింటన్‌
వికటముగఁ బెట్టి పద్యము
సుకవులు సత్ప్రభువుల కిడ ర - శుభకరమగుటన్‌.
    (ఉత్తమగండచ్ఛందము)
182
క. పుర శర రస గిరి రుద్రుల
నరయ నకచటతప లిడుట - యనుచిత మీ య
క్షరములు నరచఛజంబులు
బరిహరణీయంబు లాదిఁ - బంకజనాభా!
    (అనంతుని ఛందము)
183
చ. రస గిరి రుద్రసంఖ్యలను - రాదొనఁగూర్ప స్వరాదివర్ణముల్‌
వసుధ హకారమున్‌ క్షరట - వర్ణ చవర్ణభముల్‌ దలంపఁగా
అసజగరంబు లగ్ను లెడ - నైదవచోట హలాది వర్ణముల్‌
ససిదగఁ జెప్ప నాఱిట ర - సల్‌ జగముల్‌ గదియింప వర్జ్యముల్‌.
184
క. ఌలుఋలుఙఛఝఙటదధణ
దలునవబణములును రళలు - దగ నక్షలున్‌
నెలకొని పద్యముఖంబున
నిలుపరు సత్కవులు శాస్త్ర - నింద్యము లగుటన్‌.
    (అధర్వణుని ఛందము)
185
క. హజగడ లివి మూఁటవచో
నిజముగ నిందించి చెప్ప - నీల్గుటయరుదే
భుజగమునకన్నఁ గీడగు
సుజనామరభూజ! రేచ! - సుగుణసమాజా!
    (భీమన ఛందము)
186
క. ఘోరతరపద్యముఖమున
వేఱుగ నొకచోట చూచి - వెదకఁగనేలా
యాఱవకడ 'తా' నిలిపిన
మాఱమ్మునఁ గ్రుమ్మినట్లు - మడియు మనుజుఁడున్‌.
    (భీమన ఛందము)
187
చ. హయమదిసీత పోతవసు - ధాధిపుఁ డారయ రావణుండు వి
నిశ్చయముగ నేను రాఘవుఁడ - జాహ్నవి వారిధి మారుఁ డంజనా
ప్రియతనయుండు సింగన వి - భీషణుఁడా గుడిమెట్ట లంక నా
జయమును బోతరక్కసుని - చావును నేడవనాఁడు సూడుఁడీ.
    (భీమన చాటువు)
188
7.4. శ్రీకార ప్రభావము
క. శ్రీకారము కృత్యాదిని
బ్రాకటముగనున్నఁ జాలు - బహుదోషములం
బోకార్చి శుభము లొసఁగును
బ్రాకృతముగ నినుముసోఁకు - పరుసము భంగిన్‌.
189
7.5. అక్షరములకు గ్రహాధిపతులు
తే. ఆదులకు రవి కాదుల - కవనిజుండు
చాదులకు బుధుఁడును, గవి - డాదులకును
తాదులకు బృహస్పతి, శని - పాదులకును
యాదులకు నెల్ల శశియు గ్ర - హంబు కృష్ణ!
190
7.6. వర్గములకు జాతులు
క. వసుధామరులకు కచటలు
వసుధాపతులకును తపర - వలు వైశ్యులకున్‌
యసహలశషలకును శూద్రుల
కసమపు ళక్షటలు చెప్ప - నగుఁ బద్యాదిన్‌.
    (అధర్వణుని ఛందము)
191
క. కాదులు వర్గత్రయమును
భూదేవతలు, తపవర్గ - ములు రవలును ధా
త్రీ దయితులు యలశషసహ
లాదట వైశ్యులును ళక్ష - ఱంబులు శూద్రుల్‌.
    (అనంతుని ఛందము)
192
7.7. మాతృకా పూజనము
సీ. కాది త్రివర్గ వ - ర్ణాలికి మౌక్తిక, వజ్రభూషలుఁ దెల్పు - వస్త్రములును
తపవర్గ రవవర్ణ - తతి కబ్జరాగంపుఁ, దొడవులు వలువలు - దొవరు చాయ
యలశషసహ బీజ - ములకగుఁ బుష్యరా - గాభరణములు పీ - తాంబరములు
ళక్షఱంబులకు నీ - లాల సొమ్ములు గారు, కొను నీలి వన్నెల - కోక లెల్ల
 
తే. వరుస నీనాల్గు తెఱఁగుల - వర్ణములకు
ననుభవంబగు ద్రవ్యంబు - లానవాలు
నాజ్యమును గమ్మఁ దేనియ - యాసవంబు
వీనిఁ దెలియక సత్కవి - యౌనె జగతి.
    (కవిసర్పగారుడము)
193
7.8. సంయుక్తాక్షర ప్రయోగవిధి
తే. మొదల సంయుక్త వర్ణంబు - గదిసె నేని
మడప కా రెంటికిని గ్రహ - మైత్రివలయు
నిది విచారింపఁడేనిఁ గృ - తీశ్వరుండు
పిడుగు మొత్తిన గతిఁగూలు - బిట్ట బిఱ్ఱు.
    (భీమన ఛందము)
194
7.9. కావ్యాది వర్ణశుద్ధి
తే. ఆదిపద్యాది శ్రీకార - మైన దేవ
వాచకంబైన నప్పుడు - వఱలు సిరులు
నాది పద్యాది మూఁడు గ - ణాక్షరములు
చూడవలెఁ గాని యన్నియుఁ - జూడవలదు.
195
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - sulakShana sAramu - vishhaya sUchika - liMgamaguMTa timmakavi - sulaxaNa sAramu vellaMki tAtaMbhaTTu andhra telugu tenugu ( telugu andhra )