భాష ఛందస్సు సులక్షణసారము
8. గణ ప్రయోగ విచారము
8.1. గణోత్పత్తి క్రమము
ఆ. చంద్రసూర్యవహ్ని - చక్షుఁడౌ రుద్రుని
మూఁడు కన్నులందు - మూఁడు గురువు
లుదయమయ్యె దాన - నొప్పారె మగణమై
యందు సప్తగణము - లమరఁబుట్టె.
    (భీమన ఛందము)
196
క. ఒనరఁగ మయరసతజభన
లన నీ యెనిమిది గణముల - నతి సత్కృపతో
నెనసిన మతిఁ బింగళునకు
మనసిజమథనుండు దాఁగ్ర - మంబునఁ దెల్పెన్‌.
    (కవి గజాంకుశము)
197
క. మగణము వలనన్‌ యగణము
యగణము వలనన్‌ జనించె - నా రగణంబున్‌
రగణము వలనన్‌ సగణము
సగణంబును తగణమునకు - జనకంబయ్యెన్‌.
    (కావ్యచింతామణి)
198
క. తా వలన జగణమయ్యెన్‌
జా వలనను భగణమయ్యె - సరసంబుగ నా
భావలన నగణమయ్యెను
భావింపఁగ జన్యజనక - భావముగాఁగన్‌.
    (కావ్యచింతామణి)
199
క. అదికానఁ దండ్రి కొడుకుల
కొదవదు వైరంబటంచు - నొనరఁగ సుకవుల్‌
గొదుకక బంధుగణంబులఁ
గదియంతురు రసలుదక్కఁ - గావ్యముఖములన్‌.
    (కావ్యచింతామణి)
200
8.2. అష్టగణ లక్షణములు
8.2.1. మగణము
మ. ధర దైవంబు గ్రహంబు సౌమ్యుఁడు హరి - ద్వర్ణంబు సత్కాంతి యా
సుర మూహింప గణంబు జాతి తిలకిం - చున్‌ శౌద్రియౌ యోని దా
హరిణం బుజ్జ్వల తార జ్యేష్ఠ రస ము - ద్య ద్రౌద్ర మారాశి తే
లురు భద్రంబు ఫలంబునా మగణ మిం - పొందున్‌ బుధ స్తుత్యమై.
    (కవిసర్పగారుడము)
201
8.2.2. యగణము
మ. అలరన్‌ దైవము వారి బ్రాహ్మ్యము కులం - బా వన్నె తెల్పర్థ మా
ఫలమా యోని ప్లవంగ మా గణము సె - ప్పన్‌ మానవం బా గ్రహం
బల శుక్రుండు రసంబు దాఁ గరుణ - పూర్వాషాఢ నక్షత్ర మి
మ్ములఁ గోదండము రాశి యా యగణ మొ - ప్పు న్గోవిద స్తుత్యమై.
    (కవిసర్పగారుడము)
202
8.2.3. రగణము
మ. అనలుం డీశుఁడు రాశి మేషము గ్రహం - బా భౌముఁ డత్తార సం
ప్రణతిన్‌ గృత్తిక దైత్యమాగణము వై - రాజ్యంబు వశంబు మేఁ
కనెఱి న్యోని ఫలంబు భీ రసము శృం - గారంబు సత్కాంతి కో
కనదా చ్ఛచ్ఛవి మించు నా రగణ మె - క్కాలంబు నొప్పున్‌ భువిన్‌.
    (కవిసర్పగారుడము)
203
8.2.4. సగణము
చ. అనిలుఁ డధీశుఁడున్‌ గువల - యంబుల కాంతి కులంబు హీనమున్‌
జను గ్రహమా శనైశ్చరుఁడు - చాలఁగ నల్పగు నన్నె తౌళి యౌఁ
దనరఁగ రాశి స్వాతి యగుఁ - దార ఫలంబు క్షయంబు దానవం
బొనర గణంబు నమ్మహిష - యోని యగున్‌ సగణాన కీశ్వరా!
    (వాదాంగ చూడామణి)
204
8.2.5. తగణము
మ. అమరు న్మి న్నధిదైవముం గులము బ్రా - హ్మ్యం బా గణ బెన్న దై
వము జీవుండు గ్రహంబు నల్పరుచి యై - శ్వర్యంబు లబ్ధంబు మే
షము దా యోని రసంబు శాంత మల న - క్షత్రంబు పుష్యంబు రా
శి మహిం గర్కటకంబు నా తగణ ము - త్సేకంబగున్‌ జెల్వమై.
    (కవిసర్పగారుడము)
205
8.2.6. జగణము
మ. అరుణుం డేలిక చాయ రక్తిమ రసం - బవ్వీర మా యన్వయం
బురు వైరాజ్యము రాశి సింహము గ్రహం - బుష్ణాంశుఁ డత్తార యు
త్తర రోగంబు ఫలంబు యోని యిర వొం - దన్‌ ధేను వమ్మానవం
బరుదారంగ గణంబు నా జగణ మిం - పారున్‌ జగత్సేవ్యమై.
    (కవిసర్పగారుడము)
206
8.2.7. భగణము
ఉ. చంద్రుఁ డధీశ్వరుం డమృత - సారము కాంతియు విట్కులంబు నా
చంద్రుఁడె తద్గ్రహం బతని - చాయయుఁ దెల్పు వృక్షంబు రాశి భో
గీంద్రము యోని దేవగుణ - మీప్సిత సౌఖ్యము తత్ఫలం బిలన్‌
జంద్రుని తారయై తనరు - జంద్రధరా! భగణాన కెన్నఁగన్‌.
    (వాదాంగ చూడామణి)
207
8.2.8. నగణము
మ. పరమాత్ముం డధినాయకుండు జయ సౌ - భాగ్యైక సామ్రాజ్య పూ
జ్వరమాసంతతులీవి లబ్ధము నిజో - పాంతస్థ దుష్టాక్షరో
త్కరదోషాఢ్యగణౌఘ ధూర్త గుణముల్‌ - ఖండించుటల్‌ శీల మె
వ్వరికిం గాదనరాదు నా నగణ మ - వ్యాజస్థితిన్‌ బొల్పగున్‌.
    (కవిసర్పగారుడము)
208
8.3. గణాధి దైవములు
చ. భగణము నేలుఁ జందురుఁడు - భానుఁడు దా జగణంబునేలు నా
నగణము నేలు నిర్జర గ - ణంబు సమీరణుఁ డేలు నెప్పుడు
న్సగణము నుర్వి యేలు మగ - ణంబు నొగిన్‌ యగణంబుఁ దోయము
న్రగణము పావకుండు తగ - ణంబు నభంబును నేలుఁ గేశవా!
    (అనంతుని ఛందము)
209
8.4. గణఫలములు
ఉ. నవ్యసుఖ ప్రదాయి భగ - ణంబు జకారము రుక్ప్రదంబగున్‌
ద్రవ్యమునేయు నా లయక - రంబు సకారము మా శుభంబు యా
దివ్యసువర్ణకారి వెతఁ దెచ్చును - రేఫ విభూతినిచ్చుఁ దాఁ
గావ్యములందు నాదినిడఁ - గర్తకు భర్తకు నంబుజోదరా!
210
క. సరసాన్న రుచిరభూషణ
పరితాపాస్థానచలన - బహుదుఃఖ రుజా
పరమాయు రచలలక్ష్మీ
కరములు మయరసతజభన - గణములు వరుసన్‌.
    (భీమన ఛందము)
211
8.5. గణములకు జాములు
సీ. జయవిజయంబులు - శంఖమహా, శంఖములుననఁ బగటిజా - ల్వెలయుచుండు
రాత్రిజాల్రామ వి - రామస్తుప్తప్రసు, ప్తంబులు ననఁగను - దనరుచుండు
నీ యెనిమిదిజాలఁ - బాయక మగణాది, గా జనించు గణాష్ట - కంబు వరుస
నేజామునను గావ్యు - డెలమితోఁ గబ్బంబు, విరచింపఁ బూనె న - వ్వేళయందు
 
తే. నుద్భవంబయిన గణప్ర - యోగమునకు
శుద్ధిగాఁ గూర్చునదియు; వి - జ్జోడుపడఁగ
గణము లూహించి కూర్చు బి - కారికుకవి
పద్య మొల్లఁడు బ్రతుకాస - పడఁడువాఁడు.
    (కవిసర్పగారుడము)
212
8.6. గణములకు జాతులు
క. లలిత యతులు విప్రకులం
బులు రజలవనీశకులజ - ములు భనలు న్వి
ట్కులజులు మగణము నాలవ
కులజము సగణంబు హీన - కులజం బమరన్‌.
213
క. నాయకుఁ డే కులమైనను
బాయక తత్కులగణంబు - పద్యము మొదటన్‌
ధీయుక్తి నిడఁగ మేలగు
నేయెడ సంకరము లిడఁగ - నెగ్గగుఁ బతికిన్‌.
    (అధర్వణుని ఛందము)
214
8.7. గణ లింగములు
క. మగణము వగణము పురుషులు
జగణరగణసగణములు ని - జంబుగ నింతుల్‌
యగణము తగణము భగణ
మ్మగు క్లీబము లెసఁగు నుత్త - మాది ఫలంబుల్‌.
    (భీమన ఛందము)
215
క. సంగతిగఁ గృతుల స్త్రీ పుం
లింగపుశబ్దములు నిల్ప - లెస్సగుఁ బతికిన్‌
వెంగలిబుద్ధి నపుంసక
లింగంబగు శబ్దమిడిన - లేవు సుఖంబుల్‌.
    (కవిసర్పగారుడము)
216
8.8. గణ యోనులు
క. హరిణ, వలీముఖ, మహిషీ,
వర సైరిభ, మేష, ధేను - వాతాశనులున్‌
వరుసను మయరసతజభల
కరయఁగ నక్షత్రయోను - లై విలసిల్లున్‌.
    (వాదాంగ చూడామణి)
217
8.9. గణముల ఛాయలు
క. రవితురగ, రజత, విద్రుమ,
కువలయ, హరి నీల శకల, - కురువింద, సుధా
ర్ణవ, కనకనికష రేఖా
ప్రవిమల కాంతులఁ దనర్చు - బరువడి గణముల్‌.
218
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - sulakShana sAramu - vishhaya sUchika - liMgamaguMTa timmakavi - sulaxaNa sAramu vellaMki tAtaMbhaTTu andhra telugu tenugu ( telugu andhra )