| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (ఇద్దరు ప్రమదల మధ్య తమతమ భర్తల గొప్పదనం, అందచందంలను గురించి సాగే సంవాదానికి - ఈ గౌరీ-లక్ష్మీ సంవాదం - ఒక మచ్చుతునక) |
| 046. గౌరీ - లక్ష్మీ సంవాదం |
|
గౌరిదేవి నీ శంభుదేవునకు గళమున నలుపేమమ్మా? నారీమణి నీ విష్ణుదేముడూ నలుపుకాదుటే కొమ్మా; ఏమి లేక నీ కాంతుడు జగమున ఎద్దు నెక్కెనే మమ్మా? పంతముతో నీ కాంతుడు పశులకాసెనె కొమ్మా; హద్దులేక నీ వల్లభుడూ సగమాడ రూపమేమమ్మా? ముద్దుగుమ్మ నీ మురహరి పెనిమిటి మోహిని కాదటే కొమ్మా; పంకజాక్షి నీ శంకరు శిరమున జింక వున్నదేమమ్మా? పంతముతో వనవాసముకేగి జింకను వేసెనె కొమ్మా; చింతలేక నీ కాంతుడు బ్రహ్మను శిరసు త్రుంచెనే మమ్మా? పంతముతో రావణబ్రహ్మను పదితలలు త్రుంచెనే కొమ్మా; విశాలాక్షి నీ విభుని మాయలా జంగము కులమే మమ్మా? పాలు పెరుగు లమ్మగను గొల్లవారి కులముకాదుటే కొమ్మా; పార్వతిదేవి నీ విభునికి నిలువున పాములున్న వేఁవమ్మా? అద్దులేక కాళంగి మడుగులో నాట్యము చేసెనే కొమ్మా; పార్వతిదేవి వైదేహి పలికిన పంతము వినరమ్మా! విన్నవారికే విష్ణులోకమూ కైలాసము కాదటె కొమ్మా. |