| శతకములు | దాశరథి శతకము |
|
| ఉ. |
శ్రీరఘువంశ తోయధికి శీతమయూఖుఁడవైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపకవృత్తమాధురీ పూరితవాక్ప్రసూనములఁ బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! |
11 |
| చ. |
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్ సరసులమాడ్కి సంతసిల జాలుదురోటు శశాంకచంద్రికాం కురముల కిందుకాంతమణికోటి స్రవించినభంగి వింధ్యభూ ధరమున జాఱునే శిలలు దాశరథీ! కరుణాపయోనిధీ! |
12 |
| చ. |
తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినాకృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింపనెవ్వరికి దాశరథీ! కరుణాపయోనిధీ! |
13 |
| ఉ. |
దారుణపాతకాబ్ధికి సదాబడబాగ్ని భవాకులార్తి వి స్తార దవానలార్చికి సుధారసవృష్టి దురంతదుర్మతా చార భయంకరాటవికిఁ జండకఠోరకుఠారధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ! |
14 |
| చ. |
హరునకు నవ్విభీషణున కద్రిజకుం దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించు చుట్టమై పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ! |
15 |
| ఉ. |
ముప్పునఁ గాలకింకరులు ముంగిటవచ్చినవేళ రోగముల్ గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండినవేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ గల్గునొ గల్గదొ నాఁటి కిప్పుడే తప్పక చేతు మీభజన దాశరథీ! కరుణాపయోనిధీ! |
16 |
| చ. |
"పరమదయానిధే పతిత పావననామ హరే"యటంచు సు స్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు జేరకుఁడంచు యముండు కింకరో త్కరముల కాన బెట్టునఁట దాశరథీ! కరుణాపయోనిధీ! |
17 |
| చ. |
అజునకుదండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స ద్ద్విజమునికోటికెల్లఁ గులదేవతవయ్యు దినేశవంశ భూ భుజులకు మేటివయ్యు బరిపూర్ణుఁడవై వెలుగొందు పక్షిరా డ్ధ్వజ మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ! |
18 |
| ఉ. |
"పండిత రక్షకుం డఖిల పాపవిమోచనుఁ డబ్జసంభవా ఖండలపూజితుండు దశ కంఠవిలుంఠన చండకాండ కో దండకళాప్రవీణుఁ"డను తావక కీర్తివధూటికిత్తు బూ దండలుగాఁగ నా కవిత దాశరథీ! కరుణాపయోనిధీ! |
19 |
| ఉ. |
శ్రీరమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠము న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాఁగ వసించు చేతనో ద్ధారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ! కరుణాపయోనిధీ! |
20 |