| శతకములు | దాశరథి శతకము |
|
| చ. |
దురితలతానుసారి భయదుఃఖకదంబము రామనామ భీ కరతర హేతిచేఁదెగి వకావకలై చనకుండ నేర్చు నే దరికొని మండుచుండు శిఖదార్కొనినన్ శలభాదికీటకో త్కరము విలీనమై చనదె దాశరథీ! కరుణాపయోనిధీ! |
81 |
| చ. |
హరిపదభక్తి నింద్రియజయాన్వితుఁ డుత్తముఁడింద్రియంబులన్ మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారవశ్యుఁడై పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా దరమున నెట్లుకాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ! |
82 |
| చ. |
వనకరిచిక్కె మైనసకు వాచవికిం జెడిపోయె మీను తా వినికికిఁ జిక్కెఁ జిల్వ గనువేఁదుఱు జెందెను లేళ్ళు తావిలో మనికినశించె దేఁటి తరమా యిరుమూఁటిని గెల్వనైదుసా ధనములనీవె కావదగు దాశరథీ! కరుణాపయోనిధీ! |
83 |
| చ. |
కరములు మీకు మ్రొక్కులిడఁ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణఁ దనర్ప వీనులు భవత్కథలన్ వినుచుండ నాస మీ యఱుతనుబెట్టు పూసరుల కాసగొనం బరమార్థ సాధనో త్కరమిది చేయవే కృపను దాశరథీ! కరుణాపయోనిధీ! |
84 |
| చ. |
చిరతరభక్తి నొక్కతులసీదళ మర్పణ సేయువాఁడు ఖే చరగరుడోరగ ప్రముఖసంఘములో వెలుఁగన్ సదాభవత్ స్ఫురదరవింద పాదములఁ బూజలొనర్చినవారికెల్లఁ ద త్పర మఱచేతిధాత్రిగద దాశరథీ! కరుణాపయోనిధీ! |
85 |
| ఉ. |
భానుఁడు తూర్పునందు గనుపట్టినఁ బావక చంద్రతేజముల్ హీనతఁజెందినట్లు జగదేకవిరాజితమైన నీ పద ధ్యానముచేయుచున్నఁ బరదైవమరీచులడంగకుండునే దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ! |
86 |
| ఉ. |
నీ మహనీయతత్త్వ రసనిర్ణయబోధకథామృతాబ్ధిలోఁ దామును గ్రుంకులాడక వృథా తనుకష్టముజెంది మానవుం డీ మహిలోకతీర్థములనెల్ల మునింగిన దుర్వికార హృ త్తామసపంకముల్ విడునె దాశరథీ! కరుణాపయోనిధీ! |
87 |
| ఉ. |
కాంచన వస్తుసంకలిత కల్మషమగ్నిపుటంబు బెట్టి వా రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం బంచిత భక్తియోగ దహనార్చిఁ దగుల్పక పాయునే కన త్కాంచనకుండలాభరణ దాశరథీ! కరుణాపయోనిధీ! |
88 |
| ఉ. |
నీ సతి పెక్కుగల్ములిడ నేర్పరి లోక మకల్మషంబుగా నీ సుత సేయు పావనము నిర్మితి కార్యధురీణదక్షుఁడై నీ సుతుఁడిచ్చు నాయువులు నిన్ను భజించినఁ గల్గకుండునే దాసుల కీప్సితార్థములు దాశరథీ! కరుణాపయోనిధీ! |
89 |
| ఉ. |
వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం దారయ రొంపిలోన దనువంటని కుమ్మర పుర్వురీతి సం సారమునన్ మెలంగుచు విచారగుఁడై పరమొందుగాదె స త్కారమెఱింగి మానవుఁడు దాశరథీ! కరుణాపయోనిధీ! |
90 |