| శతకములు | దాశరథి శతకము |
|
| చ. |
జలనిధులేడునొక్క మొగిఁ జక్కికిఁదెచ్చె శరంబు ఱాతినిం పలరగఁ జేసెనాతిగఁ బదాబ్జపరాగము నీ చరిత్రముం జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం దలఁప నగణ్యమయ్య యిది దాశరథీ! కరుణాపయోనిధీ! |
61 |
| ఉ. |
కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుఁడౌట దవానలుఁడెట్టివింత మా సీత పతివ్రతామహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా బొగడ దాశరథీ! కరుణాపయోనిధీ! |
62 |
| ఉ. |
భూపలలామ రామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్ పాపఁగదయ్య రామ నినుఁ బ్రస్తుతిసేసెదనయ్య రామ సీ తాపతి రామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! |
63 |
| ఉ. |
నీ సహజంబు సాత్త్వికము నీ విడిపట్టు సుధాపయోధి ప ద్మాసనుఁడాత్మజుండు గమలాలయ నీ ప్రియురాలు నీకు సిం హాసనమిద్ధరిత్రి గొడుగాకస మక్షులు చంద్రభాస్కరుల్ నీ సుమతల్పమాదిఫణి నీవె సమస్తముఁ గొల్చునట్టి నీ దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ! కరుణాపయోనిధీ! |
64 |
| చ. |
చరణము సోఁకినట్టి శిల జవ్వనిరూపగు టొక్కవింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ స్మరణఁ దనర్చుమానవులు సద్గతిఁజెందిన దెంతవింత యీ ధరను ధరాత్మజారమణ దాశరథీ! కరుణాపయోనిధీ! |
65 |
| ఉ. |
దైవము తల్లిదండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నె కా భావన సేయుచున్న తఱిఁబాపములెల్ల మనోవికార దు ర్భావితుఁజేయుచున్నవి కృపామతివై నను గావుమీ జగ త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! |
66 |
| ఉ. |
వాసవ రాజ్యభోగ సుఖవార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా ఉయాసకు మేరలేదు కనకాద్రిసమానధనంబు గూర్చినం గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్ వీసరబోవ నీవు పదివేలకుఁజాలు భవంబునొల్ల నీ దాసునిగాఁగ నేలికొను దాశరథీ! కరుణాపయోనిధీ! |
67 |
| ఉ. |
సూరిజనుల్ దయాపరులు సూనృతవాదులలుబ్ధమానవుల్ వీరపతివ్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహీ భారముఁ దాల్పఁగా జనులు పావనమైన పరోపకార స త్కార మెఱుంగలే రకట దాశరథీ! కరుణాపయోనిధీ! |
68 |
| ఉ. |
వారిచరావతారమున వారధిలోఁ జొఱఁబాఱిఁ క్రోధ వి స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిన్ జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో దారతనిచ్చితీవెగద దాశరథీ! కరుణాపయోనిధీ! |
69 |
| చ. |
కరమనురక్తి మందరము గవ్వముగా నహిరాజు ద్రాడుగా దొరకొని దేవదానవులు దుగ్ధపయోధి మథించుచున్నచో ధరణిచలింప లోకములు తల్లడమందఁగఁ గూర్మమై ధరా ధరము ధరించితీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ! |
70 |