| శతకములు | దాశరథి శతకము |
|
| చ. |
సిరులిడ సీత పీడలెగజిమ్ముటకున్ హనుమంతుఁ డార్తి సో దరుఁడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్ గరుణఁ దరిల్ప మానవులఁ గావఁగఁ బన్నిన వజ్రపంజరో త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ! |
31 |
| చ. |
హలి కులిశాంకుశ ధ్వజ శరాసన శంఖ రథాంగ కల్పకో జ్జ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా తలవునఁజేర్చి కావగఁదె దాశరథీ! కరుణాపయోనిధీ! |
32 |
| చ. |
జలనిధిలోనదూఱి కులశైలముమీటి ధరిత్రిగొమ్మునం దలవడమాటి రక్కసుని యంగము గీటి బలీంద్రునిన్ రసా తలమునమాటి పార్థివకదంబముగూర్చిన మేటి రామనా తలఁపుననాటి రాఁగదవె దాశరథీ! కరుణాపయోనిధీ! |
33 |
| ఉ. |
భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్ రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ! |
34 |
| ఉ. |
అవనిజ కన్నుదోయితొగలందు వెలింగెడు సోమ జానకీ కువలయనేత్ర గబ్బిచనుఁగొండలనుండు ఘనంబ మైథిలీ నవనవయౌవనంబను వనంబునకున్ మదదంతి వీవెకా దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ! |
35 |
| చ. |
ఖరకరవంశజా విను మఖండిత భూతపిశాచ ఢాకినీ జ్వరపరితాప సర్వభయవారకమైన భవత్పదాబ్జవి స్ఫురదురువజ్రపంజరముఁ జొచ్చితి నీయెడ దీనమానవో ద్ధరబిరుదాంక యేమఱకు దాశరథీ! కరుణాపయోనిధీ! |
36 |
| ఉ. |
జుఱ్ఱెద మీకథామృతము జుఱ్ఱెద మీపదకంజతోయమున్ జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుఱ్ఱెద జుఱ్ఱజుఱ్ఱఁగ రుచుల్ గనువారిపదంబుఁ గూర్పవే తఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ! |
37 |
| ఉ. |
ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా కారపిశాచసంహరణకార్యవినోది వికుంఠమందిర ద్వార కవాటభేది నిజదాసజనావళికెల్ల ప్రొద్దు నీ తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ! |
38 |
| ఉ. |
విన్నపమాలకించు రఘువీర! నహిప్రతిలోకమందు నా కన్నదురాత్ముఁడు బరమకారుణికోత్తమ! వేల్పులందు నీ కన్న మహాత్ముఁడుం బతిత కల్మషదూరుఁడు లేఁడునాకు వి ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ! కరుణాపయోనిధీ! |
39 |
| ఉ. |
పెంపనుఁ దల్లివై కలుషబృందసమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయువసించు దశేంద్రియరోగముల్ నివా రింపను వెజ్జువై కృప గుఱించి పరంబు దిరంబుగాఁగ స త్సంపదలీయ నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ! |
40 |