వచన వ్యాసములు మునిపల్లె సుబ్రహ్మణ్యకవి
- బాలాంత్రపు రజనీకాంతరావు

మునిపల్లె సుబ్రహ్మణ్యకవి (క్రీ. శ. 1730 - 1780)

- బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - మొదటి భాగము నుండి)

రామదాసు కీర్తనల తర్వాత ఆంధ్రప్రదేశంలో అధిక జనరంజన పొందిన సంగీత సాహిత్య రచన కీర్తనాత్మకమైన అధ్యాత్మ రామాయణము. భక్తీ, అధ్యాత్మ పరత్వమూ కలిగిన కుటుంబాలలో ఏ కొన్నియైనా అధ్యాత్మ రామాయణ కీర్తనలు తప్పకుండా పాఠం చేసిన వారుంటారు. సంకీర్తనాత్మకంగా అన్నమాచార్యులు ప్రారంభించిన గేయం అధ్యాత్మ రామాయణంలో కథనాత్మకంగా పరిణమించినది. రామాయణ కథ అంతా ఆరుకాండాలలో 104 కీర్తనలలో చెప్పబడినది. దీనిని రచించిన వాగ్గేయకారుడు సుబ్రహ్మణ్యకవి. యుద్ధకాండంలోని మంగళానికి ముందున్న 46 వ కీర్తనలో చిట్టచివరి చరణంలో ఇలాగ ఉన్నది:

“శ్రీ శేషాచల వేంకటాఖ్య లక్ష్మీరమణుని పేర
ఈశ బ్రహ్మాది లక్ష్మీ సర్వేశిత్వశాలి పేరను
కోశాతీత నిరీశ సత్యజ్ఞానగురుడౌ విష్ణుని పేరను కృష్ణుని పేరను
ఈ శుభాధ్యాత్మ రామాయణము తెనుగు కీర్తనలుగ నేర్పించెన్
సగుణ ముక్తామణుల పేరను కౌశలంబునను
యుద్ధకాండము ఇది షట్కాండ మఖండ చిదనుభవి
రుచిరవి సుబ్రహ్మణ్యకవి ... ...
శ్రీరాముని శ్రీమచ్చరితము శ్రీజ్ఞానప్రసూన వినవే ...”

దీనినిబట్టి శేషాచలమని పేరుబడిన తిరుమలపై వెలసిన వేంకటేశ్వరస్వామికి అంకితంగా సుబ్రహ్మణ్యకవి రచించిన గ్రంథం అధ్యాత్మ రామాయణం. ఇతని వంశచరిత్ర గాని, స్థలమూ కాలం గాని తెలియడానికి తగిన ఆధారాలు ఇందులో స్పష్టంగా ఏవీ లేవు. మొదటి ధన్యాసిరాగ కీర్తన- ‘నమశ్శివాయ తే నమో భవాయ’ అనే దానిలో 4 వ చరణంలో చివర -

“తరుణేందుశేఖరాయ పరమపురుషాయ భవ-
హరణాయ శ్రీకాళహస్తీశ్వరాయ ...” అనీ,

గ్రంథం చిట్టచివరి మంగళంలో చివరి చరణంలో ...

శ్రీకాళహస్తినగరీ శంభుమిత్రునికి
సౌకర్యశాలికి జయమంగళం సు-
శ్రీకకుత్‍స్థాన్వయసింహాసనస్థునికి, వి-
వేకకార్యశేషగిరి వేంకటసుబ్రహ్మణ్యునికి
మంగళం శుభమంగళం ...”

అనీ వ్రాసిన దానినిబట్టి, తిరువుల వేంకటేశ్వరస్వామియందే కాక, శ్రీకాళహస్తిలో వెలసిన ఈశ్వరుని యందు కూడా భక్తి కలవాడనీ, బహుశా ఇతడు తిరుపతిలో కాని, శ్రీకాళహస్తిలో గాని, ఆ చుట్టుపట్ల గాని ఉండినవాడనీ ఊహించవచ్చు.

సంగీత విద్వాంసులకు గాని, చరిత్రకారులకు గాని సుబ్రహ్మణ్యకవి జీవితాంశములను గురించి మొన్నమొన్నటిదాక, పైని తెలియజేసిన విషయాలను మించి కొంచమైనా తెలియలేదు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు శ్రీకాళహస్తి జమీందారులయిన దామెరవారి వద్ద నుంచి వారి సంస్థానంలో చాలాకాలంగా ఉంటూన్న తాళపత్ర గ్రంథాలను కొన్నిటిని తిరుపతి ప్రాచ్యపరిశోధనాలయానికి తీసుకు వెళ్లారు. వారి సలహా పైని ఆ గ్రంథాలలో ఉన్న ‘దామెరవారి పదాలు...’ అనే తాళపత్ర ప్రతిని చదివి పరిశోధించగా తేలిన అంశాలను తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారు ఖర భాద్రపదపు భారతిలోని ఒక వ్యాసంలో వ్రాశారు. దానినిబట్టి అధ్యాత్మరామాయణ కీర్తనలు రచించిన సుబ్రహ్మణ్యకవి దామెరవారి శ్రీకాళహస్తి సంస్థానంలో పోషితుడనీ, ఆ సంస్థానపు ప్రభువుల ప్రోత్సాహం పైని, వారికి అంకితంగా ఆయన కొన్ని పదాలను కూడా రచించాడనీ తెలిసింది. సుబ్రహ్మణ్యకవి ఇంటి పేరు మునిపల్లె వారయినట్లు కూడా తేలింది.

ఆ తాళపత్ర గ్రంథము పైని ఇలా వ్రాసి ఉన్నది.

“... మునిపల్లె రామలింగార్య పుత్రులైన సుబ్రహ్మణ్యకవి చాతుర్యంబుగా రచించిన రామాయణ కీర్తనలు తమ ప్రియశిష్యులైన రాజెశ్రీ దామెర కృష్ణస్వామివారికి కృపచేసి యిచ్చిన పుస్తకం-”

ఆ తాళపత్రాలలో దామెరవారి పదాలు అని చెప్పబడిన పదాలే ఉన్నవిగాని, రామాయణ కీర్తనలు లేవు. ఆ పదాలలో నాలుగు దామెర తిమ్మభూపాలుని కుమారుడైన కుమార వెంకట సార్వభౌముని మీదను, మరి రెండు దామెర వేంకటేంద్రుని కుమారుడైన కృష్ణభూపాలుని మీదను వ్రాసినవి. ఈ వేంకట సార్వభౌముడు లేక వేంకటేంద్రుడు అను రాజు కాళహస్తిపాళెము తూర్పు ఇండియా కంపెనీవారికి లొంగిపోయిన 1780 వ సంవత్సర ప్రాంతమున పరిపాలించినవాడు. కృష్ణభూపాలుడు లేదా కృష్ణస్వామి అతని కుమారుడు. ఆ తండ్రికొడుకు లిద్దరివద్దను పోషితుడై, కొడుకుకు గురువైన సుబ్రహ్మణ్యకవి, ఆనా డక్కడ సంగీత సాహిత్య నాట్యశాస్త్రాదులలో ప్రావీణ్యం కలిగిన పండితుడూ, వాగ్గేయకారుడూ. పై గ్రంథాలలో కృష్ణరాజుకు అంకితమైనవి 2 పదాలు, శ్రీకాళహస్తీశ్వరునికి అంకితమైన దొక పదమూ, అగస్త్యనాథునికి అంకితమైన ఒక పదమూ కూడా ఉన్నాయి. 1780 ప్రాంతంనాటికి వాగ్గేయకారుడుగా, పండితుడుగా, రాజకుమారునికి సాహిత్య కళాచార్యుడుగా ఉండిన సుబ్రహ్మణ్యకవి సుమారు 1730 ప్రాంతాలలో జన్మించి ఉండవచ్చును.

సంస్కృతాంధ్ర భాషలలోను, సంగీత నాట్యాలంకార శాస్త్రములలోను, వేదాంతశాస్త్రములలోను కూడ సుబ్రహ్మణ్యకవికి అపారమైన పాండిత్యం ఉన్నట్లు ఆయన రచనలవలన తెలుస్తుది. అంతే కాకుండా, ఆయన సంస్కృతాంధ్రాలలో గేయరచనాదక్షుడు. క్షేత్రయ్యకు, త్యాగరాజుకు నడుమ వెలసి, బహుజనరంజకుడైన వాగ్గేయకారుడు.

అధ్యాత్మ రామాయణం:

అంతటి ప్రతిభావంతుడయిన అధికారి కనుకనే, సుబ్రహ్మణ్యకవి - రామాయణగాథద్వారా అద్వైత తత్త్వమును బోధించే అధ్యాత్మ రామాయణమును కీర్తనలుగా రచించి ఆంధ్రదేశానికి అర్పించాడు.

“అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మ ముచ్యతే -
బ్రహ్మ సత్యం జగన్మిథ్యా - జీవో బ్రహ్మైవ నా పరం”

క్షరాక్షర రూపమైన దేహంలో అధ్యాత్మ అక్షరమనీ, దేహం అధిభూతమనీ గీతలలో, ఉపనిషత్తులలో వివరింపబడింది. దేహధారుల కందరికీ చైతన్యకారణమయిన జీవాత్మ పరమాత్మకంటె అన్యం కాదనే అద్వైత తత్త్వాన్ని బోధించే జ్ఞానము అధ్యాత్మ జ్ఞానము. రామాయణ నాయకుడైన రాముడు అటువంటి పరమాత్మస్వరూపు డయినప్పటికీ, దేహధారియై అవతరించి, లోక వ్యవహారమనే మాయలో చిక్కుకొని కూడా, ఆత్మజ్ఞానం కలిగి దుష్టసంహారం చేసినవాడని నిరూపించినది అధ్యాత్మ రామాయణము. ఇది సంస్కృతంలో బ్రహ్మాండ పురాణంలో మొదట ప్రసక్తమయినది. ఈ తత్వం శివుడు పార్వతికి బోధించినట్లు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. సంస్కృతాధ్యాత్మ రామాయణంలో వాల్మీకి రామాయణంలో వలెనే ఏడుకాండ లున్నవి. సుబ్రహ్మణ్యకవి కృతమైన తెలుగు అధ్యాత్మంలో ఆరుకాండాలే - యుద్ధకాండంతో గ్రంథం ముగుస్తుంది. అధ్మాత్మ రామాయణంలోని ఇతివృత్తమూ, పాత్రలూ మొత్తంమీద వాల్మీకి రామాయణంలోనివే అయినా, అక్కడక్కడ సంఘటనలలో విచ్చలవిడి మార్పులు ఉన్నాయి. వాల్మీకి రచించిన రామచరిత్రం అంతా ఒక మానవోత్తముని చరిత్ర. సామాన్య మానవునివలె ఆ రాముడు కూడా భార్యావియోగానికి దుఃఖిస్తాడు. శత్రువుపై పగ పడతాడు. కాని అధ్యాత్మ మందలి రాముడు పరబ్రహ్మస్వరూపుడు, సీత ఆదిమాయ, లేదా అవిద్య, లేదా ప్రకృతిస్వరూపిణి; ఇందలి రామచరిత్రమంతా లీలానటనం. ఇందులో అద్వైత సిద్ధాంతమే పరతత్త్వమనీ, శ్రీరామునిపై భక్తే భక్తి అనీ పరమేశ్వరు డంతటివాడు పార్వతికి ఉపదేశిస్తాడు.

ఇతివృత్తంలో మార్పులు:

రావణ సంహారమనే దేవకార్యం నిర్వర్తించడానికని పరబ్రహ్మస్వరూపుడైన విష్ణువు బ్రహ్మాదుల కోరికపై శ్రీరాముడై భూలోకంలో జన్మించి, ఆత్మస్వరూపాన్ని మరచి ఉండగా, ఒకనాడు నారదమహర్షి వచ్చి “... నీవు రావణవధార్థమై భూమిపై అవతరించావు. రేపు నీకు పట్టాభిషేకమయితే ఆ సౌఖ్యంలో కర్తవ్యాన్ని మరచిపోగలవు. జాగ్రత్త ...” అని ప్రబోధిస్తాడు. అప్పుడు రాముడు ఆత్మజ్ఞానం కలిగి దేవకార్య నిర్వహణం కోసం అరణ్యవాసం చేయ్యడానికి నిశ్చయించుకొంటాడు. దేవతలు రామ పట్టాభిషేకం భంగం కలిగించాలని సరస్వతిని కోరగా ఆమె మంధరలో ప్రవేశించి, ఆమెచేత కైకకు దుర్బోధ చేయించి దశరథుని- రామవనవాసము, భరత పట్టాభిషేకమూ అడిగేటట్లు చూస్తుంది. సీతారామలక్ష్మణులు అరణ్యవాసంలో ఉండగా, రావణుడు సీతను ఎత్తుకొని పోతాడని రాముడు ముందే దివ్యదృష్టితో తెలిసికొని, సీతతో - నీవిక ప్రచ్ఛన్నురాలివై మాయాసీతను పర్ణశాలలో ఉంచమని చెపుతాడు. అప్పుడు వాస్తవసీత అగ్నిలో దాగి, మాయాసీతను పర్ణశాలలో ఉంచుతుంది. రావణుడు మాయాసీతనే ఎత్తుకొని పోగా, ఆ మాయాసీతకోసమే రాముడు లోకవ్యవహారరీత్యా వియోగశోకబాధితుడై, రావణాదులతో యుద్ధం చేసి జయిస్తాడు. యుద్ధానంతరం మాయాసీత అగ్నిప్రవేశం చెయ్యగా సత్యసీత అగ్నిలో నుంచి వెలువడుతుంది. జ్ఞానపిపాసువులూ, ముముక్షువులూ అధ్యాత్మ రామాయణాన్ని నిరంతరం పారాయణం చేస్తారు. సీతారామాంజనేయ సంవాదం అని తెలుగులోనికి కూడా వచ్చిన వేదాంత తత్త్వచర్చ అధ్యాత్మ రామాయణంలోనిదే. అధ్యాత్మంలోని ఉత్తరకాండలోని ఐదవ అధ్యాయానికి రామగీత అని పేరు. అందులో రాముడు లక్ష్మణునికి అద్వైత వేదాంతాన్ని, ‘ఏది పరబ్రహ్మస్వరూపమో అదే నీవు ...’ అనే ‘తత్త్వమసి’ సిద్ధాంతాన్ని బోధిస్తాడు.

ఈ రామగీత ఉన్న ఉత్తర కాండాన్ని సుబ్రహ్మణ్యకవి తెనిగించలేదు. అధ్యాత్మ రామాయణాన్ని కాణాద పెద్దన సోమయాజి, కంచర్ల శరభయ్య, దూర్వాసుల రామాయార్యుడు, కోటంరాజు నాగయామాత్యుడు- బహుశా అందరూ సుబ్రహ్మణ్యకవి తరువాతి వారే- తెలుగులో పద్యకావ్యములుగా రచించారు. సుబ్రహ్మణ్యకవికి 100 ఏళ్లు ముందు మైసూరు ప్రాంతాల (1600-23 ) చెన్నపట్టణం నిర్మించి విజయనగరపు వేంకటపతిరాయల సామంతుడై ఏలిన ఇమ్మడి జగదేవరాయలు, సంగీత సాహిత్య విద్యాచతురుడు, అధ్యాత్మ రామాయణమును తెలుగు చేశాడు. వీరు కాక, ఆధునిక యుగంలో అధ్యాత్మ రామాయణమును పిశుపాటి నారాయణశాస్త్రిగారు తెలిగించారు. గుండు అచ్చమాంబ, మామిడన్న సుభద్రమ్మగార్లు ద్విపద కావ్యంగా చేశారు.

కాండములు, ఇతివృత్త వివరణము:

ఇక సుబ్రహ్మణ్యకవి రచన పరిశీలిద్దాము.

బాలకాండము: 17 కీర్తనలు. కవికృత శివస్తుతి: పార్వతీదేవి తనకు కలిగిన రామజీవితాత్మకమైన సంశయాలను నివారించమని ఈశ్వరుని అడుగగా సీతారామమారుతి సంవాదంలో సీత - శ్రీరాముడు ఆంజనేయునికి బోధించిన రామావతార తత్త్వార్థం శివుడు పార్వతికి వివరిస్తాడు . శ్రీమన్నారాయణుని కడ బ్రహ్మాదుల వేడుకోలు, దశరథ పుత్రకామేష్టి, రామాదుల జననం, విశ్వామిత్ర యాగరక్షణం, అహల్య శాపవిముక్తి, సీతాకల్యాణం, పరశురామ గర్వభంగం.

అయోధ్యాకాండము: 9 కీర్తనలు. నారదాగమనం; రామునికి ఆత్మజ్ఞానమూ, అవతార కర్తవ్యమూ జ్ఞాపకంచేసి, రావణవధాప్రతిజ్ఞ చేయించడం- పట్టాభిషేక ప్రయత్నాలూ; కైక వరాలు; సీతారామలక్ష్మణుల చిత్రకూటగమనం; దశరథ మృతి, భరతాగమనం; పాదుకా పట్టాభిషేకం, దండకారణ్య ప్రస్థానం.

అరణ్యకాండము: 11 కీర్తనలు. విరాధవధ; మున్యాశ్రమాతిథ్యం; రావణమారీచుల కుట్ర; మాయలేడి; రాముడు సీతతో మాయాసీతను ఉంచి అంతర్హితవు కమ్మని చెప్పడం; మాయాసీతాపహరణం; జటాయు దర్శనం; జటాయుకృత రామస్తుతి చూర్ణిక, జటాయు కైవల్యం, శబరీ మోక్షం.

కిష్కింధాకాండము: 10 కీర్తనలు. సుగ్రీవ సఖ్యం; దుందుభి వధ; సప్తతాలకృంతనం; వాలి వధ; తారా విలాపం; సుగ్రీవ పట్టాభిషేకం; రామ విరహం; సీతాన్వేషణం; వానరులు నలుదిక్కులకు పోవడం, హనుమత్సంపాతి సమాగమనం; సంపాతి జ్ఞానోపదేశం; హనుమ లంకాయాత్ర.

సుందరకాండము: 10 కీర్తనలు. సింహికాలంకిణుల వధ; హనుమంతుని లంకాప్రవేశం; అశోకవన దర్శనం; సీతారావణ సంవాదం; త్రిజటా స్వప్నం; హనుమత్సందేశం; సీతమ్మ ఆనవాళ్లు; హనుమంతుడు బ్రహ్మాస్త్రబద్ధుడు కావటం; రాముని చేరి చూడామణిని ఇవ్వటం.

యుద్ధకాండము: 47 కీర్తనలు. రావణుని మంత్రిగోష్టి; కుంభకర్ణుడు, విభీషణుడు రావణునికి రామునితో వైరం తగదని బోధింపగా రావణుని ఆగ్రహం; విభీషణుడు అన్నను విడిచి రాముని చేరటం; రావణుని ఆజ్ఞపై శుకుడనే రాక్షసుడు సుగ్రీవుని వద్దకు రాయబారం వచ్చి యుద్ధం తప్పదని తెలిసికొనటం; సాగర విధేయత; సేతు నిర్మాణం; శుకుని హితవచనాలు రావణుడు నిరసించడం; ఇంద్రజిత్తు యుద్ధం; అంగదుని పోరు; అతికాయ యుద్ధం; రావణుని యుద్ధం; లక్ష్మణమూర్ఛ; సంజీవని; కుంభకర్ణునికి మేలుకొలుపు, యుద్ధము, మృతి, ఇంద్రజిద్వధ; రావణుని అభిచార హోమానికి వానర సైన్యం విఘ్నం కలిగించటం; రామరావణ సంగ్రామం; రావణ వధ; విభీషణ పట్టాభిషేకం; మాయాసీత అగ్నిప్రవేశం; పుష్పక ప్రయాణం; భారద్వాజాతిథ్యము; అయోధ్యా ప్రవేశం; పట్టాభిషేకం.

సాహిత్య శిల్పము:

సుబ్రహ్మణ్యకవి వ్రాసినవి అన్నీ కలసి మొత్తం 104 కీర్తనలు. ఇంచుమించు అన్ని కీర్తనలూ అనుప్రాసలతో కూడి శృంగార రసాత్మకమైన విశేషణాలతో శివుడు పార్వతిని సంబోధించి రామకథను వినిపిస్తున్నట్లుండే పల్లవితో ప్రారంభిస్తాయి.

మనోహరమైన కొన్ని పల్లవులు -

 1. వినవే శర్వాణి అలివేణి నీరజపాణి
 2. వినుము ధరావరతనయా ధృతవినయా, సరసగుణాభినయా
 3. అందముగ నీ కథ వినవే రజతాచలసదనా, పరిహసిత
  వినిందితారవిందచంద్రవదనా కుందబృందసుందరరదనా
 4. చేరీ, వినవె శౌరిచరితము గౌరీ, సుకుమారి గిరివరకుమారీ
 5. చికురనిందితాళీ, లలనా గౌరీ, సుకుమారి గిరివరకుమారీ
  సకల భువనపాళీ, లలనా జనకకాళీ, కాళీ, వినవే
 6. కలికీ అలరుల ములికీ, చిలుకల కొలికి, వీనుల సుధ జిలికీ కథ వినవే
 7. ఇంతీ, చెంగల్వపూబంతీ, చెలువల మేల్‍బంతీ, గుణములదొంతీ వినవే
 8. వినవే ఘనవేదాంతవనపాలికా, దివ్యమణిమాలికా, బాలికా!

అధ్యాత్మ రామాయణము భక్తీ, వేదాంత ప్రధానమైనా, సుబ్రహ్మణ్యకవి తన కథాకథనంలో శృంగార రసాత్మకమైన మనోహర పదజాలాన్ని పై మాదిరి పల్లవులలోనే కాకుండా, కీర్తనలలో చాలాచోట్ల అవకాశం చిక్కినప్పుడల్లా అనుసంధిస్తూనే వచ్చాడు. భక్తితత్త్వప్రబోధితులయిన పోతనాది మహాకవులు పోయిన మార్గమే అది. రామజనన ఘట్టంలో - శ్రీరాముని గాంచెను అనే శంకరాభరణం రాగకీర్తన -

“శ్రీరాముని గాంచెను, పార్వతీ వినవె మన కౌసల్య ఆత్మారాముని గాంచెను
తోరమై హర్షాశ్రుపూరము కన్నుల,
జార, భయసంభ్రమాశ్చర్యము ల్బెనగొనగా
అల నల్లరేకుల చాయమేనిచే చెలగువాని పసిడిచేలగట్టినవాని
వెలయు నాల్గుభుజములవాని కనుగొల్కుల నరుణరేఖలుకలవాని స్వర్ణకుం
డలలసిత గండమండలములవాని యస్ఖలితరవికోటిప్రకాశుని రత్నో-
జ్జ్వలకిరీటమువాని లళినీలకుటిల కుంతలములచే ముద్దుకులుచుండెడువాని ...”

‘రాముని సకలగుణాభిరాముని ...’ అనే ముఖారి రాగంలోని కీర్తనలో శ్రీరాముని శైశవ లీలలు, కౌసల్యా దశరథుల లాలింపులూ తేట తెలుగు మాటలతో సహజ రమణీయమైన దృశ్యాలను కన్నులకు కట్టేటట్లు వర్ణించాడు.

“చెలగి సౌమిత్రితోగూడ మెలగుచు తేనియలొలుక
బలుకు సుతుని నృపుడు గాంచి, భూషణజాల-
ములతోడ నలంకరించి, శిస్తుగ గస్తురి
తిలకము నుదుటనుంచి, గళమున రత్న-
కలిత హారములు కీలించి, ముద్దాడునపుడు
కలకల నవ్వుచు మద్దికాయలల్లాడ నందియలు
ఘలుఘలుఘల్లనుచు మ్రోయ లలితగతుల నటియించు ...”
“చిన్నారి బొజ్జలో నన్ను గన్నవాడా నా పాలిటి
పెన్నిధానమ రారా, ఓరి నా చిన్ని-
అన్న బూచివచ్చే రారా, పరుగెత్తవల-
దన్న నాతో నలుగ మేరా, పాటబాడుచు
నిన్ను లాలియూచే రారా, లాలబోసేను
మన్ను చేతనంటవద్దు వెన్నబెట్టేననుచు చాలా
మన్నించి పలుకు కౌసల్యకు మరులు రెట్టింపజేయ ...”
“ధరణివిభుడు భుజియించుతరిని కౌసల్య తనయుని
మురిపెమున రమ్మనుచు జీర, వరయోగి హృదయాం-
తరమునందు చెల్వుమీర, వసియించు దేవుడు
చిరుతవాడయి ముద్దుగార, వచ్చిన జూచి
తరుణి తనదు కోర్కెలుమీర, కౌగిటనుంచి
కరుణించి భుజియించుమనిన కబళము చే నందుకొని
తిరుగా నాటలాడ పరుగెత్తిన మాయాబాలకుడౌ ...”

సీతాస్వయంవర సందర్భంలో జనకుని కొలువుకూటంలో సీతాప్రవేశవర్ణనం కూడి ఎంతో మధురంగాను, లలితమైన తెలుగుపదాలతో అందమైన భావాలను కలిగిస్తుంది. (వినీలవేణి అనే బేగడరాగ కీర్తనలో)

“పట్టుచీరకట్టి గట్టిరవికను కట్టుదిట్టముగ గట్టి మృగమదము
బొట్టు నుదుటనునిచి కనుల కాటుకబెట్టి కురులుదువ్వీ
చట్టముగా కీల్ముడివైచి మరిన్
పట్టంపురాణి నౌదు నేనని బాళితోడ కుందనపు బొమ్మవలె
నెట్టన రాజమరాళకరిగతుల నెరా నిరాకరింపుచు నడిచెను ...” (వినీల)
“తాటంకద్యుతి దిక్కులనెల్లను దీటుకొనగ పాపట బొట్టును సరి-
సాటిలేని చంద్రసూర్యులును సయ్యాటమునను మెరయ,
తేటపు ముత్యపుసరులు పతకములు మేటి చిలుకతాళితోడ బెనగొన
మాటికి నందెలు గల్లని మ్రోయగ దీటులేని వైఖరిని సీతావ-
ధూటి గుణములపేటి హారకిరీటాది భూషణాఢ్యు శేషగి-
రీశు రామభూవిభుని చేరి మణిహాటకమయమాలిక గళమున నిడి
హరిన్ వరించితినని చనె ముదమున ...” (వినీల)

కథాఘట్టాలనూ పాత్రలనూ సూటిగా వర్ణించేటప్పటి శైలికి పై కీర్తనభాగాలు ఉదాహరణలు.

అధ్యాత్మతత్త్వం బోధించే పట్టులలో సుబోధకమైన సంస్కృతసమాసాలతో సాగిపోతాయి చరణాలు. ‘వినుమని శ్రీరాముడు తా బలికెను ...’ అనే సావేరి రాగ కీర్తనలో ఆంజనేయునికి రాముడు జ్ఞానబోధచేసే ఘట్టం:

“సమతను ఆత్మానాత్మపరాత్మల జాడలు త్రివిధములు పవనజ
మమతాహంకార కర్తృత్వముల నమరి నయ్యది యాత్మ
రమణ ననృత జడదుఃఖములను నీరసమయినది యనాత్మ, నిత్యము
విమలము సత్యజ్ఞానానందాత్మిక మిదియె పరాత్మ
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
చెలగు నవిచ్ఛిన్నత బ్రహ్మము విచ్ఛేదము కల్పితము కావున
అల భిన్నునకు పూర్ణాత్మకు నైక్యమువలనను సుజనులచే
అలఘు తత్త్వమస్యాది మహావాక్యములచే ప్రకటమై, అలరెడు
వెలయగ నైక్యజ్ఞానము కల్గ నవిద్య మాయమౌను; గుణములతోను ...

సుతీక్షణుడను మునీశ్వరుడు శ్రీరాముని పరబ్రహ్మమూర్తిగా స్తుతించే ఘట్టంలో - ‘వీనులవిందుగను వినవే యీ చరిత మిమ్ముగను ...’ అనే కీర్తనలోని చరణాలు సుతీక్షణుని భక్త్యావేశాన్నీ, ఆధ్యాత్మికజ్ఞాన గాంభీర్యాన్నీ ప్రకటించడానికి వీలయిన చిక్కని సంస్కృతసమాసాలతో సాగుతాయి.

“పరమేశ ప్రకృతిపరుడవౌ నీ దివ్యచరణముల్గంటి దృక్స్వాంతములకు గో-
చరుడవు కావైన హరి నీ నామస్మరణ పరమతుల కెపుడు గనుపట్టుదువనె మౌని
రూపాద్యుపాధిదూరుడవైన మాయానటనాపాదితమౌ ఈ నీ మానవరూపము నిది-
గో పొడగంటి స్మరకోటిసుందరము శరచాపాన్వితము కరుణాశ్రయనేత్ర యనెను ముని
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
దేశకాలకర్మాతీత విజ్ఞానమఖిలేశ నీ రూప మతిహిత మమలము
నాశరహితము స్వప్రకాశము నిఖిలావకాశము చిద్ఘనాకాశమని పొగడె ముని ...”

ఈ ఆధ్యాత్మ రామాయణములో నాలుగో, ఐదో పూర్తిగా సంస్కృతంలో రచించిన కీర్తనలున్నాయి. జటాయువు మరణించే ముందు చేసిన రామస్తవం చూర్ణిక అనబడే సంస్కృత గద్యప్రబంధం:

“శ్రీమదగణిత గుణమణిగణాలంకృత రుచిరచిరతర శుభస్వరూపం, సకలజనభయావహ మహదజ్ఞానజనిత కలికలుషాంధతామిస్రనివారక భవతారక దీపం, ... అనుపమాద్భుత మహత్ప్రతాపం, హతదీనజనతామనస్తాపం, ... కరధృతవిదాతామోఘ శరచాపం, -” ఇత్యాది చూర్ణిక.
“శ్రీజగన్నాథ హే రఘువర దయానిధే (శ్రీజగ)
“ఓజసా తేజసాభ్రాజ త్వన్నమో హరే (శ్రీజగ)

- ఇది యుద్ధకాండంలో దేవమునివరులు చేసిన రామస్తుతి. పూరి రాగం.

“వందే విష్ణుం విష్ణు మశేషస్థితహేతుం
త్వా మధ్యాత్మజ్ఞానిభి రంతర్హృది భావ్యం”

ఇది బ్రహ్మకృతమైన రామస్తుతి. రామదాసు కీర్తనలతో హరికథలుగా రచించినవారు ఈ కీర్తనను కూడా అందులో చేర్చి ఇది రామదాసుదా అన్న భ్రమ కల్పించారు. అయితే, మిగిలిన తెలుగు కీర్తనలలోను, సంస్కృత కీర్తనలలోను సుబ్రహ్మణ్యకవి చివరి చరణాలలో వాడుకొన్న శేషగిరీశముద్ర ఈ కీర్తనలో లేదు. శ్రీజగన్నాథ అనే కీర్తనలో ఆ ముద్ర ఉన్నది.

పున్నాగవరాళి రాగంలోని -

“భజేహం భవాని హృదా భావితం బుధసేవితం
నిజాశ్రితభవదవానలవినిర్మల నామధేయం”

ఇత్యాదిగా రచించిన కీర్తనలో శేషాచలాధీశముద్ర ఉన్నది.

గ్రంథాదిని ఉన్న ధన్యాసిరాగ కీర్తన -

“నమశ్శివాయ - తే నమో భవాయ
సమానాధిక రహితాయ శాంతాయ స్వప్రకాశాయ
ప్రమోదపూర్ణాయ భక్తౌఘపాలనాయ” (నమశ్శివాయ)

ఈ కీర్తనలోనే నాల్గవ చరణంలో కాళహస్తీశ్వరాయ అనీ, ఐదవ చరణంలో శేషశైలాధీశమిత్రాయ అనీ - సుబ్రహ్మణ్యకవి తన వాసస్థలమైన శ్రీకాళహస్తిలోని ఈశ్వరుని గురించిన ప్రార్థనతో గ్రంథాన్ని ప్రారంభిస్తూ చేసిన కీర్తనలో ఆయనను శేషశైలాధీశమిత్ర అని పేర్కొని, తన ముద్రానియమం కూడా పాటించుకొన్నాడు.

ఈ రామాయణంలో చాలచోట్ల వారూ, వీరూ రాముని స్తుతించారు గాని, అహల్య చేసిన స్తుతిలో ‘శరణు శరణని రామచంద్రుని అహల్య సన్నుతించెను వినవే’ అనే కీర్తనలో . . . “నీ చరణ నీరజరాగమునను దురిత మెల్లను తొలగె నహహా గరిమతోను కృతార్థనైతి జగత్ప్రభో కమలావిభో ...” అని అనుపల్లవిని ముగించి ... “ఏ విభు పాదరాజీవరేణువులచే పావనమైనది భాగీరథి ...” అనే చరణంలో భక్తిరసం పరమావధిని చెందుతుంది. “శ్రీరఘువర నీ లీల లద్భుతములు” అనే చరణంలో రామావతార తత్త్వాన్ని ప్రకటించాడు. జటాయువు చేసిన స్తుతిలో సంస్కృతసమాసాలు అప్రయత్నధారాప్రవాహంగా సాగి భక్త్యావేశాన్నీ, గగుర్పాటునూ కలిగిస్తాయి.

సుబ్రహ్యణ్యకవి పదాలు:

తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారి ‘భారతి’ వ్యాసంలో దామెరవారి పదాలు ఈ సుబ్రహ్యణ్యకవి రచనలే అని పేర్కొన్నారని - ఈ వాగ్గేయకారుని దేశకాలనిర్ణయం చేసినప్పుడు చెప్పుకొన్నాము గదా! వారు తమ పరిశోధనా వ్యాసంలో తొమ్మిది పదాలు ఉదాహరించారు. ఆ పదాలు దామెరకుమార వేంకటేంద్రునీ, అతని కుమారుడైన కృష్ణస్వామినీ, కాళహస్తీశ్వరునీ, అగస్త్యనాథునీ నాయకులుగా చేసి చెప్పినవి.

ముఖారీ రాగపదం - కుమార వేంకటేంద్రుని గురించి చెప్పినది.

పల్లవి:
మనసు వచ్చితే రమ్మనవే దామరల కుమార వేంకటేంద్రుని
అనుపల్లవి:
వనితరో చెలగుచు పరిపరిగతులను బహుబంధంబుల పెనగుదును నా సామిని
చరణము(లు):
సదయుడవని మ్రొక్కి సారెకు వానిపై పదములు వినిపింతును
మదిరాక్షి నా సామి మది రా, నడచి దక్కి మనవి అంతయు తెల్పుదు
మృదుపాదములు తమకమునను వాని తొడలమీద నుంచుకొందును
కుదురుగ బాగాలొసగి ఆకుమడుపు నే కొరికి సగమందింతును-నా సామిని
కోరికలిమ్మని కురులచే కట్టుదు కొట్టుదు విరిసరుల;
తీరైన మన్నెహుజూరు డనుచు వెరచి ఊరకె నేనుండను;
ఔర మంచిదికాని - లేరా ఓరియని నేరము లెన్నుదును;
పేర బిలి చొకసారి పెనగొందు నొకసారి పెనగొందు, పై కొందును - నా సామిని
(ఇలాగే 5 చరణాలు)

సావేరి - త్రిపుట

పల్లవి:
నృపశిఖామణి వౌరా,
అనుపల్లవి:
విపుల శ్రీ దామరల వెంకటవజీరా . . .
చరణము(లు):
వగమీర తాళికై వజ్ర మడిగినను, నె-
మ్మొగతమ్మి మాంజాళి పగిది ముద్దాడేవు,
పొగర తగు కన్నుచూపులనె తేలించేవు! ||నృపశిఖా||
కొదమ పులిగోరునకు గోమేధిక మడిగితే
పదర కవి పరమపావనత జూచేవు
పొదలు మేఖలకు నిను పుష్యరాగ మడిగితే
మది కుచగిరిక్షేత్ర మహిమ గొనియాడేవు ... ||
వెలయు కమ్మలకు కురువిందమణు లడిగితే
లలితరాగము లెచ్చి కలియగూడేవు
వెలలేని మాణిక్యములు నీ గుణము లెన్న-
గలనె కుమార వెంకట సార్వభౌమ ||

ఆనంద భైరవి (పురుష విరహం)

పల్లవి:
చెలియ యీ విరహ మగ్గలమాయె నెట్లోర్తు
చెలిని తోడి తేవె . . .
అనుపల్లవి:
చెలగి చంద్రుడు కాయగ ఎలమి మరుడేయగ
చిలకలు గూయగ, అళులు రొదసేయగ ...
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
చరణము(లు):
సరసముతోడ నా సరణి వీణ మీటుచు సరసగతుల వాయించుచు,
భరతప్రౌఢిమీర భావజుడై ధర వెలసిన శ్రీ దామెర వెంకట
ధరణిపాలుని తనయా కృష్ణాయని నను గూడె ...

ఆనందభైరవి పదం పల్లవి, అనుపల్లవులకూ, క్షేత్రయ్య రచించిన ఆహిరి రాగంలోని యీ క్రింది పదానికి కొంత పోలిక ఉంది. అయితే పైది పురుషవిరహం; క్రింది పదం స్త్రీ విరహాత్మకం.

“ఏమి సేతునే ఓ యమ్మ నే నేమి సేతునే
ఏమి సేతునే వెన్నెలకాకల ఎట్లోరునమ్మా ... ... ...||
కలకలరవములు చిలుకల పలుకులు
సొలపులు నా మీద ఝల్లుఝల్లు మనెనే
అళులచే నళుకుచు సొలపుల వలచితి
తెలతెల్లవారదే చిలకల కొలికి ... ||
మింట చందురుడు నన్నంటి కాయుగాక ...” ఇత్యాది.

పైవి కాకా, ఆనందభైరవిలోనే - “అంతటి విలుకాడననుచు సంతతము కలహము సేయుచున్నాడే యేమి సేతు నమ్మలారా” - అని ఒక పదమూ; “నిందె పయి నిందలుపుట్టెను, ఇందుకేమి సేతు” - అనే ఇంకొక పురుషవిరహ పదమూ, కల్యాణి రాగంలో శ్రీకాళహస్తీశ్వరుడు నాయకుడుగా ఒక పదమూ, ఆహిరిరాగంలో అగస్త్యనాథుడనే పేర వెలసిన మరొక దేవునిపై మరొక పదమూ, కేదారగౌళలో ఇంకొక పదమూ - సుబ్రహ్యణ్యకవి కృతాలైనవాటిని కోదండరామయ్యగా రుదాహరించారు.

సుబ్రహ్యణ్యకవి స్వతహా గొప్ప ఆధ్మాత్మికతత్త్వవేత్తా, భక్తినిష్ఠాగరిష్ఠుడూ అయినప్పటికీ - జీవితంలోని శృంగారమూ, సృష్టిలోని సౌందర్యమూ అనుభవానికి తెచ్చుకొన్నవాడేననీ, శృంగారరసనిష్యంది అయిన మధుర భావసంపదా, లలిత పదజాలమూ ఆయనకు కరతలామలకములే అనీ పై పదాలనుబట్టేగాక, అధ్యాత్మ రామాయణంనుంచి పైని ఉదహరించుకొన్న కీర్తనభాగాలనుబట్టి కూడా స్పష్టంగా తెలుస్తుంది. తనను ఆచార్య పీఠాన ఉంచి గౌరవించిన శ్రీకాళహస్తి పాలకుల కోరికపైని కొన్ని పదాలుకూడా వ్రాసిపెట్టి, వాటితోపాటు ఆశీఃపూర్వకంగా తనకు తానుగా దైవాంకితంగా రచించుకొన్న రామాయణ కీర్తనలను కూడా దామెర్లవారికి ఇచ్చి ఉంటాడు.

సుబ్రహ్యణ్యకవి పదరచనలోని పోకడలు కొన్ని యథాలాపముగా ఉన్నా, కొన్ని క్షేత్రయ్య పోకడలకు అత్యంత సమీపంగా ఉన్నవి. ఆయన క్షేత్రయ్య పదాలను బాగా విని గాని, పాడుకొని గాని ఉండవచ్చును. ఇప్పటి మట్టుకు 1730-1780 ప్రాంతములో ఉన్నవాడని నిర్ణయించినందున ఆయన క్షేత్రయ్యకు దాదాపు 100 ఏళ్ళ తరువాతివాడని తేలుతుంది. అంతకు ఇంకా ముందరివాడేమో అనీ, క్షేత్రయ్యకు ఇంచుమించు దరిదాపులలోనివాడేమో అనీ రచనలనుబట్టి అనిపిస్తుంది. ఈ విషయం ఇంకా పరిశోధించతగినదే. దానికి ముఖ్యసూత్రం తిమ్మభూపాలుని కుమారుడైన వేంకట భూపాలుడు, అతని కుమారుడు కృష్ణస్వామి ఈ ముగ్గురి పేర్లు శ్రీకాళహస్తి దామెరవారి వంశంలో ఎక్కడెక్కడున్నాయో చూచి తేల్చవలసిన విషయం. 1780 నాటికి ఒకసారి కనిపించిన యీ పేరులే అంతకు ముందు తరాలలో 17 వ శతాబ్దపు చివరిభాగంలో కూడా కనిపించినట్టునూ, కాని, అన్ని వివరాలూ సరిపోలేదనీ కోదండరామయ్యగారు వ్రాశారు.

సంగీతరచన:

సుబ్రహ్యణ్యకవి పదాలు ఈ మధ్యనే లభించి ఉండడంచేత వాటి పైని సూచించిన రాగాలు తప్ప, అవి పాడతగిన స్వరసంపుటిని గురించి మన కేమీ తెలియదు. పరంపరాగతంగా వాటిని పాడుకొంటున్నవారెవరైనా శ్రీకాళహస్తి ప్రాంతాలలో ఉన్నారేమో పరిశోధించవలసిన విషయం. అయినా రాగాలను బట్టి, పదాల కూర్పును బట్టి వాటిని పాడే తీరు, దరిదాపుగా క్షేత్రయ్య పదాలను పాడే తీరుకు దగ్గరగా ఉండవచ్చునని ఊహించవచ్చు. క్షేత్రయ్యనాడే ఏర్పడిన కీర్తన పదపరిణామ లక్షణాల ప్రకారం సుబ్రహ్యణ్య పదాలలోను, రామాయణ కీర్తనలలోను కూడ పల్లవికి తోడు అనుపల్లవి యేర్పడి, చరణాలు మూడో, ఐదో, ఏడో ఇంకా యెక్కువగానే ఉంటూ వచ్చాయి. అధ్యాత్మరామాయణ కీర్తనలు బహుశా సుబ్రహ్యణ్యకవినాడే ప్రచారం పొంద నారంభించి, ఇప్పటికి సుమారు 40-50 సంవత్సరాలకు మునుపటివరకూ ఆంధ్ర దేశంలో పలుచోట్ల సంకీర్తనాభ్యాసపరుల కుటుంబాలలోను, కొందరు గాయకులవద్దా గానపాఠం వినిపిస్తూండేవి. అన్నమాచార్యుల గేయాలు సంకీర్తనాత్మకములు, క్షేత్రయ్య పదాలు అభినయాత్మకములు కాగా, సుబ్రహ్మణ్యకవి కీర్తనలు ఆఖ్యానాత్మకములు - అంటే ఒక వ్యక్తి కథ చెప్పుతున్నట్లుగా కీర్తనలను గానంచేసుకొని పోవడం.

ఈ కీర్తనల ఆఖ్యానాత్మకశైలికి అనుగుణంగా ఆది, అట, జంపె, త్రిపుట, రూపకతాళాలలో ఆ కీర్తనలకు ఆయా రసాలకు ఉచితమైన ధాతుకల్పన చేశాడు సుబ్రహ్యణ్యకవి. కొందరు నేటి విద్వాంసులు ఆయన ధాతుకల్పన అంత విద్వత్పరిపుష్టం కాదనీ, ఆయన కేవలము భజనగోష్ఠులకు పనికి వచ్చే సంకీర్తనములను సులభశైలిలో చేసిన వాగ్గేయకారు డన్నట్లుగా భావిస్తారు. త్యాగరాజును గురించి ఆయన కాలపు విద్వాంసు లిటువంటి అభిప్రాయమే వెలిబుచ్చగా, ఆయన ‘జగదానందకారక’ మున్నగు ఘనరాగ పంచరత్న కీర్తనలను చిట్టస్వర సాహిత్యంతో సహా రచించి, తన ఘనత నిలుపుకొన్నాడు. రామాయణ కీర్తనలు వివరంగా చదివిన వారికైనా, పాడగా వినిన వారికైనా ఆ కీర్తనలలో చాలమట్టుకు - చరణనిర్మాణం చిట్టస్వర సాహిత్యంలాగే చౌక, మధ్యమ కాలగతులలో సాగి, సాహిత్యంతోనే చివర ముక్తాయింపులు వేసుకొని తిరిగి పల్లవికి బోయే ప్రౌఢరచన గోచరిస్తుంది. వేదాంతబోధనపు బరువుతో, కథాకథనపు బాధ్యతతో పొడుగాటి చరణాలను ఒక్కొక్క పాటలో ఏడెనిమిదింటికి మించి కూడా రచించిన సుబ్రహ్మణ్యకవి, ఆ చరణముల రచనాపద్ధతిలోనూ, గానపద్ధతిలోను కూడా ఒక సౌలభ్యాన్ని ఏర్పాటు చేయకపోలేదు. చరణం అనుప్రాసలతో అంత్యప్రాసలతో ఖండాలుగా తెగి, ఖండఖండానికి ఒకే మాదిరి ధాతువు తిరిగి తిరిగి వచ్చి, పై కాలంలో చివరి ఒకటి రెండు ఖండాలు రాగంలో పైస్థాయి నంతటినీ చుట్టుకొనివచ్చి ముక్తాయింపుతో చరణం ముగిసి పల్లవి అందుకొంటుంది. కొన్ని కీర్తనలలో తధిగిణతోం మొదలగు శబ్దాలు (సొల్లుకట్టు) కూడా సుబ్రహ్మణ్యకవి లయపాండిత్యాన్ని చాటుతాయి. అంతేకాదు- కీర్తనల సంగీత సాహిత్య రచనలో నాట్యానుకూలతను, వాగ్గేయకారుని భరతశాస్త్ర అభినివేశాన్ని ప్రకటిస్తాయి. ‘సామి రారా’ అని కూచిపూడివారు ప్రదర్శించే కృష్ణశబ్దం సుబ్రహ్మణ్యకవి రచనే అని గుర్తించారు. అది మోహనరాగం.

రాగ ప్రయోగం:

రామాయణ కీర్తనలు నూటనాలుగింటికీ దాదాపు 58 రాగాలు వాడబడ్డాయి. లభించిన క్షేత్రయ్య పదాలలో మున్నూటికీ 36 రాగాలే వాడబడ్డాయి. క్షేత్రయ్యనాటి మోహన, ఈ కీర్తనల రాగాలలో కనబడదు. అన్నమాచార్యులనాటి కర్ణాటక సారంగ, మంగళకౌశిక, లలిత పంచమం, గౌరి, కన్నడగౌళవంటి ప్రాచీన రాగాలలో కీర్తనలున్నాయి. ఇందువల్ల సుబ్రహ్మణ్యకవి క్షేత్రయ్యకు ఇంకా దగ్గరవాడు మాత్రమే కాక కించిత్పూర్వుడు కాగలడా అని కూడ అనిపిస్తుంది. ఏమంటే, ఈ రాగాలలో గౌరిని తప్ప మిగిలినవాటిని వేటిని క్షేత్రయ్య వాడలేదు. క్షేత్రయ్యనాడే బహుశా ప్రచారంలోకి వచ్చి ఉంటాయని ఇంతవరకూ విద్వాంసులు అనుకొంటూ ఉన్న ఉసేనీ, కాపీ, ఆనందభైరవీ సుబ్రహ్మణ్యకవి కూడా వాడాడు. మాంజి రాగంలో ఒక కీర్తన అధ్యాత్మంలో ఉంది. గుమ్మకాంభోజి, హిందూఘంటా అనే అపూర్వరాగాలూ ఆహిరి, రేగుప్తి, ధన్యాసి, కాంభోజి, కన్నడ, గౌళిపంతు, శంకరాభరణం, నాదనామక్రియ, సౌరాష్ట్ర, కల్యాణి, సురటి, పూర్వికల్యాణి, యదుకులకాంభోజి, ఘంటా, మారువ, నవరోజు, జుజావంతి, పూరి, సారంగ, నాట, ఆరభి, శ్రీ, వసంత, పున్నాగవరాళి, సైంధవి, ముఖారి, బేగడ, బిలహరి, సావేరి, శహన, అఠాణ, ఫరజు, తోడి, దేవగాంధారి, దేశీయదేవగాంధారి, కేదారగౌళ - సుబ్రహ్మణ్యకవి వాడిన ఇతర రాగాలలో కొన్ని. వాడిన తాళాలు: త్రిపుట, ఆది, రూపక, జంపె, చాపు.

సుబ్రహ్మణ్యకవి కీర్తనలలోని ధాతుకల్పన , పల్లవి యెత్తుగడలోనే రాగస్వరూపాన్ని స్పష్టంగా నిర్దేశిస్తూ, ఒక్కొక్క చరణంలోను అందలి భావాన్ని అనుసరించి ముందు చెప్పుకొన్న ప్రకారం, అనుప్రాసాన్వితమై తెగుతూ వినిపించే ధాతు ఆవర్తాలతో తిరిగి తిరిగి వినిపిస్తూ, చివరి ఖండాలతో రాగస్వరూపం మళ్లీ పూర్తిగా నిర్దేశింపబడుతుంది. కొంచెం వ్యత్యాసంతో సుబ్రహ్మణ్యకవి కీర్తనలలో కూడా క్షేత్రయ్య పదాలలో వలెనే ధాతుమాతువులు రెండూ సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఆ వ్యత్యాసం ఏమిటంటే, వేదాంత భావాల భారంవల్ల కొన్ని కీర్తనలలో సంగీతరచనకంటే ధాతుకల్పన కొంతవరకు సులభపద్ధతిలో ఉంటుంది.

విద్వద్గాయకుల ఆదరం క్రమంగా తగ్గి కాబోలు ఈనాడు అధ్యాత్మ రామాయణ కీర్తనల గానపద్ధతి అప్రౌఢ లైనప్పటికీ, అభిమానంతో ఆదరించిన కొందరు వృద్ధస్త్రీజనం నోళ్లలోను, మారుమూల గ్రామాల సంకీర్తనపరుల గొంతులలోను మిగిలి, క్రమంగా హరించుకుపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆంధ్రదేశంలో పుట్టి పెరిగి పాదుకొన్న, ఆంధ్రులను ఆబాలగోపాలాన్ని పాడించిన ప్రసిద్ధ వాగ్గేయకారుల కోవలో ఇంచుమించు చివరివాడు సుబ్రహ్మణ్యకవి. ఆయన కీర్తనల సంగీతాన్ని ఉద్ధరించుకొనడం ఆంధ్రుల సంగీతాన్ని ఉద్ధరించుకొనడం వంటిదే. ఎక్కడో దక్షిణాదివారి బాణినో, ఉత్తరాది బాణినో అనుకరించడం తప్ప ఆంధ్రులకు సొంత సంగీతం లేదనుకొనేవారందరికీ - అన్నమాచార్యులతో ప్రారంభించి, సుబ్రహ్మణ్యకవి వరకూ గడచిన అధ్యాయాలలో మనం స్మరించిన వాగ్గేయకారులందరి జీవితాలూ సరైన ప్రత్యుత్తరం ఇవ్వగలవు.


అధ్యాత్మ రామాయణ కీర్తనలు : మునిపల్లె సుబ్రహ్మణ్య కవి

అధ్యాత్మ రామాయణ కర్త మునిపల్లె సుబ్రహ్మణ్యకవి (కొన్ని కొత్త అంశాలు)
- బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - రెండవ భాగము నుండి)

రామాయణ కథాగానము - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి కృత అధ్యాత్మ రామాయణ విశిష్టత
- మంగళగిరి ప్రమీలాదేవి
(భారతీ కళాతరంగిణి (వ్యాస సంపుటి), 1982 నుండి)

అధ్యాత్మ రామాయణ కీర్తనల కర్త సుబ్రహ్మణ్యకవి జీవిత విశేషాలు
- ముక్తేవి శ్రీరంగాచార్యులు (భారతి, మే 1977 నుండి)

AndhraBharati AMdhra bhArati - యథావాక్కుల అన్నమయ్య - వేదము వేంకటకృష్ణశర్మ - ఆంధ్రభారతి - (శతకవాఙ్మయసర్వస్వమునుండి) ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) yathavakkula Annamayya - Vedamu Venkata Krihsna Sarma - AndhraBharati AMdhra bhArati ( telugu kAvyamulu andhra kAvyamulu)