వచన వ్యాసములు రామాయణ కథాగానము
మునిపల్లె సుబ్రహ్మణ్యకవి కృత
అధ్యాత్మ రామాయణ విశిష్టత
-మంగళగిరి ప్రమీలాదేవి

రామాయణ కథాగానము
మునిపల్లె సుబ్రహ్మణ్యకవి కృత
అధ్యాత్మ రామాయణ విశిష్టత

- మంగళగిరి ప్రమీలాదేవి
(భారతీ కళాతరంగిణి (వ్యాస సంపుటి), 1982 నుండి)

1

భారతీయ సంస్కృతికి వేదము ఆధారమైనను అది పుష్పఫలవంతమై చల్లని నీడనిచ్చే వృక్షరూపముగా ప్రసరించినది. రామాయణ మహాభారతముల వలననే, ఒక్క భరతఖండములోనే కాక భారతీయ సంస్కృతి వ్యాపించిన విస్తారభారతము (Greater India) అని పిలువబడే బర్మా, సయాం, కంబోడియా, మలయా, బలి, జావా, సుమిత్రా, బోర్నియో ఇత్యాది దేశాంతర ద్వీపాంతరాలలో కూడ ఈ రెండు ఇతిహాసాలు విస్తరించి అక్కడ స్థిరనివాస మేర్పరచుకున్నవి. ఆ రెండిటిలోనూ కూడా ఆదికవి రచించిన రామాయణ కథ ఎక్కువ అభిమానపాత్రమైనది.

రామాయణము ఇంతగా అభిమానపాత్రము కావడానికి ప్రధాన హేతువు దాని రచనావిశేషములోనే ఉన్నది. స్వయముగా వాల్మీకియే దానిని గురించి ‘పాఠ్యే గేయే చ మధురమ్’ అని చెప్పుకొన్నాడు. అంటే నేటి సంగీత విద్వాంసుల పరిభాషలో మాతు, ధాతువులలో మాధుర్యమున్నదన్న మాట! వాక్కుకు మాతువని, గేయమునకు ధాతువని సంజ్ఞలు. ఆ రెండు చేయువాడే వాగ్గేయకారుడు. ఈ దృష్టిలో విచారిస్తే వాల్మీకి ఆదికవి మాత్రమే కాదు; ఆది వాగ్గేయకారుడు కూడా. నేడు వాల్మీకమునకు పాఠ్యముగానే ప్రచారమున్నది గాని గేయముగా లేదు. దురదృష్టవశాత్తుగా దాని గేయసంప్రదాయము అంతరించి పాఠ్యముగానే నిలిచియున్నది. కాని బాలకాండ నాల్గవ సర్గము చదువునపుడు వాల్మీకి తన కావ్యములోని పాఠ్యత కంటె గేయతకే ఎక్కువ ప్రాధాన్య మిచ్చినాడా అనిపిస్తుంది, ఆయన రామాయణ రచన పూర్తి చేసిన తరువాత దానిని కుశలవులకు ఉపదేశించిన సందర్భంలో ఇలా ఉన్నది-

“పాఠ్యే గేయే చ మధురం ప్రమాణై స్త్రిభిరన్వితమ్
జాతిభి స్సప్తభిర్బద్ధం తంత్రీలయసమన్వితం
రసైః శృంగార కరుణ హాస్య వీర భయానకైః
రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్య మేతదగాయతామ్.
తౌ తు గాంధర్వతత్వజ్ఞో మూర్ఛనాస్థానకోవిదౌ
భ్రాతరౌ స్వరసమ్పన్నౌ గంధర్వా వివ రూపిణౌ
రూపలక్షణసమ్పన్నౌ మధురస్వరభాషిణౌ”

కుశలవులు రాజమార్గములో రథ్యలలో ఆడి పాడి వినిపించుచుండగా తెలుసుకొని స్వయముగా శ్రీరాముడే వారిని తన సన్నిధికి పిలిపించి, తమ్ములు మొదలైన ఆప్తులతో పరిషత్తు తీరి కూర్చుండి, వారలను వినమని చెప్పి ఆ గాయకులను బోధన చేసెనట! అప్పుడు-

“తౌచాపి మధురం రక్తం స్వంచితాయతనిస్స్వనమ్
తన్త్రీలయవదత్యర్థం విశ్రుతార్థ మగాయతామ్
హ్లాదయత్సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ
శ్రోతాశ్రయసుఖం గేయం తద్భజౌ జన సంసది
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
తతస్తు తౌ రామ వచఃప్రచోదితౌ
అగాయతాం మార్గవిధానసంపదా...”

వారానాడు పాడినదే నేడు మనకు వాల్మీకి రామాయణముగా ప్రత్యక్షమై నిలిచియున్న ఆది కావ్యము!

ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. లోకములో ఎక్కడనైనా కవిత్వము ఆదిలో గేయరూపములోనే ఆవిర్భవించింది. గ్రీకు కవి ‘హోమరు’ తన రెండు ఇతిహాసాలు- ‘ఇలియడ్, ఒడిస్సీ’లను ప్రభువుల ఆస్థానములకు పోయి స్వయముగా ‘లైరు’ అనే తంత్రీవాద్యము తోడుగా వినిపించేవాడని ప్రసిద్ధి. మన దేశములోనో, ఋషియైన ఆదికవి తన శిష్యులచేత తన్త్రీలయ సమన్వితమైన గానము చేయించినాడు. అంతే భేదము.

మన గాన సంప్రదాయము ఎన్నెన్నో పరిణామాలు చెందినది. కాని మొదటి నుండి మార్గ, దేశి విభేదాలున్నట్లే తోస్తుంది. రామాయణ రచన నాటికే ‘మార్గవిధాన సమ్పదా’ అన్నదానిని బట్టి ఈ భేదమును అనుమేయింపవచ్చును. కాని ఒకనాడు దేశిగా ఉన్నదే సహృదయులకు నచ్చి, లక్షణవేత్తలు గ్రహించి, లక్షణము నిర్వచింపగా, అదే మార్గవిధానముగా పరిగణింపబడుట మన సంగీతసంప్రదాయ చరిత్రగా తోస్తుంది. కుశలవులు రామాయణ గానము చేసిన మార్గవిధాన సంపద ఎట్టిదో ఛాయామాత్రముగానైనా నేడు మనము ప్రదర్శించేందుకు సాధ్యము గాకుండా విస్మృతమయిపోయినది. అందువలన వాల్మీకి రామాయణము ప్రస్తుతము పాఠ్యముగానే నిలిచిపోయినది. అయినను రామకథయందు ప్రీతి గలవారు ‘పాఠ్యే గేయే చ మధురమ్’ అనే మాట ఎన్నడూ మరచిపోరు. ఈ కారణము చేతనే యేమో మన దేశభాషలలో పుట్టిన రామాయణాలు విస్తారంగా పఠనగానములను మేళవించుటకే ప్రయత్నించినవి.

భారతీయ భాషలన్నిటియందు అప్పుడు పుట్టిన రామాయణాలన్నిటిలో ముందు ప్రశంసింపదగినది మన ఆంధ్రదేశములో పుట్టిన రంగనాథ రామాయణము. తెలుగుదేశముతో తోలుబొమ్మలాడించేవారు కథాకథనానికి తెరలో నుండి రంగనాథ రామాయణమే ప్రధానముగా గానము చేస్తారని గుర్తుంచుకొనవలెను.

ఆ తరువాత తమిళములో పుట్టిన కంబరామాయణము చెప్పతగినది. అది కూడా పాఠ్యమే గాక గేయము కూడా. అది పుట్టినప్పటినుండి నేటివరకు తమిళ, కేరళములలో తోలుబొమ్మలాడేవారు పాటలో దానినే ప్రయోగిస్తున్నారట.

ఆ తర్వాత 15వ శతాబ్దములో వంగభాషలో మొత్తముమీద వాల్మీకి ననుసరించి కృత్తివాస ఓఝా రామాయణము పుట్టినది. అది కూడా మాత్రాచ్ఛందస్సులో పాదాంత్యప్రాస నియమముతో నడచిన గేయమే. 15, 16 శతాబ్దాలలో వంగభాషా కవులు ఆధ్యాత్మిక రామాయణానువాదాలు కూడా చేసినారు. అన్నీ గేయకవితలే.

తరువాత ప్రసిద్ధి పొందిన రామకథా కావ్యము 16వ శతాబ్దములో గంగాతీరములో పుట్టిన తులసీదాసుని రామచరిత మానసము. అది కూడా పఠనగానములకు అనువైన దే. దానిలో సామాన్యముగా వరుసగా 4 చౌపాయీలు (చౌపాయి అనగా నాలుగు పాదములు కలది), దాని తరువాత దోహా (ద్విపద), సోరఠా ఛందస్సు ఈ మూడింటిలో ఒకటి గాని, రెండు గానీ ఉండును. తులసీదాసు వాల్మీక కథకు ఇతరకథలెన్నో చేర్చినాడు. అతడు సంస్కృతములోని అధ్యాత్మ రామాయణమునుండి ‘శ్రీరామ హృదయము’ను గ్రహించి రాముని మానవమాత్రునిగా గాక పరబ్రహ్మముగా చిత్రించినాడు. రామకథను పార్వతికి శివుడు చెప్పినట్లు కూడా అధ్యాత్మ రామాయణము ననుసరించే చేసినాడు.

దానిలో సరిగా ఆ శతాబ్దములోనే, ఆధునిక మలయాళ భాషకు పిత అనదగిన ఎళుతచ్చన్ రచించిన రామాయణము గణింపదగినది. అతడు అందులో ప్రధానముగా వాల్మీకి రామాయణమును గాక ఆధ్యాత్మక రామాయణమునే అనుసరించెను. అది పుట్టినప్పటినుండి నేటివరకు కేరళ దేశీయులు ఆబాలగోపాలము గానము చేస్తున్నారు. దాని ఆవిర్భావముతో మలయాళములో తక్కిన రామాయణములన్నియు విస్మృతప్రాయములైనవి. ఆ శతాబ్దములోనే కుమారవాల్మీకి కన్నడభాషలో తోరవేయ రామాయణమును రచించెను. అది భామినీషట్పదీలో నున్నది. కావున గేయము కూడ. అందులో అతడు వాల్మీకినే అనుసరించెను. మరల కన్నడములోనే 18వ శతాబ్దములో శంకరనారాయణ షట్పదిలోనే అధ్యాత్మ రామాయణమును అనువదించెను.

ఆ పిమ్మట ప్రశంసించదగినది 16, 17 శతాబ్దములలో ఓఢ్రములో పుట్టిన బలరామదాస రామాయణము. ఆంధ్రములో పుట్టిన స్త్రీల రామాయణపు పాటలలో ఆంధ్రుల ఆచారవ్యవహారములు ప్రతిబింబించినట్లుగానే ఓఢ్రుల ఆచారవ్యవహారము లందు ప్రతిబింబించును. అది కూడా గేయాత్మకమే.

ఇక మరాఠీభాషలో పదిహేడవ శతాబ్దములో సమర్థరామదాసస్వామి రామాయణ భాగములను, 18వ శతాబ్దములో మోరోపంతు అనేక రామాయణములను రచించినారు. అన్నీ గేయాత్మకాలే.

రంగనాథ రామాయణము తరువాత ఆంధ్రభాషలో పుట్టిన రామాయణాలు అసంఖ్యాకములైనవి. శ్రీరాముని జన్మస్థానమయిన అయోధ్యనుండి ఆయన పర్ణశాల నిర్మించుకొన్న భద్రాచలసమీపము వరకు గీతగీయగా దానిని చుట్టివచ్చే ప్రదేశమంతా రామభక్తి వ్యాపించినట్లు తోస్తుంది. ఆ పరిధిలోనిదే ఆంధ్రదేశము.

2

ఆంధ్ర దేశములో ఎన్నో మతములు వెలసినవి. ఎందరో దేవతలు ప్రీతిపాత్రములైనారు. ఇక్కడ వెలసిన రామాలయాలు కూడా తక్కిన దేవతల ఆలయాలతో పోల్చి చూస్తే తక్కువే. కాని ఆంధ్రుల ఇష్టదైవము శ్రీరామచంద్రుడే అని చెప్పుటకు సందేహము లేదు. ఇందులో పండితులు, పామరులు అను భేదము లేదు, కులభేదము లేదు. శ్రీరామచంద్రుడు ఆంధ్రుల హృదయములనే మందిరములుగా ఆవేశించి అధిష్ఠించినాడనవచ్చును. ఏమి వ్రాయుటకు ఉపక్రమించినను ఆంధ్రులు ‘శ్రీరామ’ పెట్టి కాని వ్రాయరు. తల్లులు పిల్లలకు స్నానము చేయించిన పిమ్మట రోజూ శ్రీరామరక్షనే చేస్తారు, ముష్టికి వచ్చినవారంతా ‘శ్రీసీతారామాభ్యాన్నమః’ అనే కేక వేస్తారు. ఆశ్చర్యార్థకముగా ‘అయ్యో రామా!’ అనీ, నిశ్చయార్థకముగా ‘రామరామ నేనేమి ఎరుగన’ని రామస్మరణపూర్వకముగానే అంటారు. ధర్మరక్షణకు ప్రజలు ప్రచారము చేయవలసివచ్చినపుడు రామదండులే ప్రచలితమయ్యేవి.

‘అడుగు దాటి కదలనీయను - నా కభయ మీయక నిన్ను విడువను’ అని కుశలవుల ముద్దు కూడా ఎరుగని శ్రీరాముని కన్నబిడ్డవలె నిలబెట్టి, ‘పలుకే బంగారమాయె, పిలచిన పలుకవేమి?’ అని ధాష్టికముగా కూడా ప్రశ్నించకలిగిన రామభక్తాగ్రేసరుడు ఆంధ్రుడైన భద్రాచల రామదాసు. ఆతని కైంకర్యము వలననే భద్రాచల క్షేత్రము అనాదిప్రసిద్ధమైన శ్రీశైలక్షేత్రముతో సమానమైన ఖ్యాతి గడించినది. తమిళ దేశములో నివాసము చేసుకొన్నా ఆంధ్రకుటుంబములో జన్మించిన శ్రీ త్యాగరాజస్వామి ‘తారకరూపుని నిజతత్త్వార్థము తెలిసి రామచింతనతో నామము’ గానము చేసి తరించిన నాదతపస్వి. ఆంధ్రదేశములో రామప్రతిష్ఠ చేసిన దేవాలయములు తక్కువే అయినా, రామమందిరాలు, భజనమఠాలు వేలకు వేలున్నవి. రామకోటి వ్రాసేవారు కోకొల్లలు. దేవతార్చన చేసే స్మార్తులలో చాలమంది శ్రీరామ పంచాయతనమునే అర్చిస్తున్నారు.

శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అరణ్యవాసము చేసిన 14 సంవత్సరములలో సుమారు 13 సంవత్సరములు ఆంధ్రదేశములోనే పర్యటించినాడు. అప్పటి దండకారణ్యము ఎక్కువపాలు ఆంధ్రదేశములోనే ఉండేది. అందులో అక్కడక్కడ ఉన్న ఋష్యాశ్రమాలలో ఎక్కువకాలము గడిపినాడు. 14వ సంవత్సరములో సీతావియోగము ప్రాప్తించినది. ఆయన సీతాన్వేషణము చేస్తూ వియోగదుఃఖముతో గోదావరిని, కృష్ణను దాటి వినుకొండ వద్ద జటాయుపును చూచి సీత వార్త విని, పశ్చిమంగా ప్రయాణం చేసి, కబంధ శాపవిమోచనం చేసి తుంగభద్రా తీరమందలి పంపాక్షేత్రము చేరుకొన్నాడు. అక్కడ సుగ్రీవునితో మైత్రి, వాలి వధ చేసి, తుంగానదికి దక్షిణతీరాన ఉన్న మాల్యవంతములో కొన్ని నెలలు గడిపి సీతాన్వేషము చేయించినాడు. అక్కడనుండి లంకమీద దండయాత్రకు బయలుదేరి సరాసరి రామసేతువు సమీపమునకు చేరుకున్నాడు. శ్రీరామ పాదవిన్యాసముతో ఆంధ్రదేశమంతా పవిత్రీకృతమైనది, ఏ మారుమూల పల్లెపట్టుకు వెళ్ళినా స్థానికులు ‘ఇక్కడ శ్రీరాముడు ఈ పని చేసినాడు. ఇక్కడ సీతమ్మ స్నానము చేసినది - ఇక్కడ ఈ పని జరిగినది.’ అని మొదలుగా సీతమ్మ తమ యింటి ఆడపడుచు అన్నట్లుగానే ఎన్నెన్నో చెప్పగా వింటూ ఉంటాము. అవి నేటి నాగరికులు మరచిపోతున్నా, ముదుసలుల నాలుకల మీద ఇప్పటికీ కొంత కొంత ఆడుతూనే ఉన్నవి. అవి ప్రత్యేకంగా సేకరించదగినవి.

కాళిదాసు మేఘదూతములో వివాసితుడయిన యక్షుని వాసముగా చేసిన ‘రామగిర్యాశ్రమములు ఆంధ్రదేశము లోనివే. అవి ‘జనకతనయ స్నానపుణ్యోదకము’లని విశ్లేషించి వర్ణించినాడు.

ఈ విధముగా రాముడు ఇలవేలుపైన ఆంధ్రభూమిలో రామాయణము చెప్పనిదీ, రామస్మరణ చేయనిదీ జిహ్వకు పవిత్రత చేకూరదనే భావము ఆంధ్రకవులలో స్థిరపడట సమంజసము. ఆందువలననే యేమో దేశభాషలన్నింటిలో చక్కని రామాయణ కావ్యము ముందు వెలసినది ఆంధ్రభాషలోనే! అది రంగనాథ రామాయణము. అది పాఠ్యము, గేయమూ కూడా!

ఆ తరువాత ఆంధ్రములో పాఠ్య రామాయణములే వెలయసాగినవి. దానికి ముందు దారిచూపినవారు ఉభయకవిమిత్రుడైన తిక్కనామాత్యుడు. నిర్వచనోత్తర రామాయణము కూడా పాడుకొనవచ్చునేమో కాని అది గేయప్రబంధ మనలేము గదా! అట్టిదే ఎఱ్ఱయ ప్రోలయ వేమారెడ్డికి అంకితముగా రచించిన రామాయణము. ఆ దారినే నడచినది భాస్కరాదులు రచించిన రామాయణము. మొల్ల రామాయణమూ అంతే. అయ్యలరాజు రామభద్రుని రామాభ్యుదయము, పింగళి సూరన రాఘవపాండవీయము, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణము, రఘునాథ రామాయణము, కూచిమంచి తిమ్మకవి అచ్చ తెనుగు రామాయణము, గత శతాబ్దిలో పుట్టిన గోపీనాథ రామాయణము, పట్టాభి రామాయణము, అద్భుత రామాయణము ... ... అన్నియు పాఠ్యప్రధానములే. ఈ శతాబ్దములో పుట్టిన, పుట్టుచున్న వాసుదాసు రచించిన ఆంధ్రవాల్మీకి రామాయణము, మానికొండ రామాయణము, కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి కృష్ణ రామాయణము, తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి రామకథామృతము, విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షము, ధర్మవరపు సీతారామాంజనేయులు సాహితీసమితి పేర అచ్చు వేయిస్తున్న ధర్మవరపు రామాయణము - ఈ విధముగా అచ్చయినవీ, కానివీ శతసంఖ్యలలో రామాయణాలు పుట్టినవి. ఆంధ్రదేశములో పుట్టినన్ని రామాయణాలు ఇతర ప్రాంతాలలో పుట్టినట్లు తోచదు. ఇవిగాక భారత భాగవతాదులలో సందర్భవశాత్తుగా వచ్చిన రామకథలు, ఎఱ్ఱయ అరణ్యపర్వములోను, పోతన నవమస్కంధములోను వ్రాసినట్లుగానే శ్రీ దేవీభాగవతకర్తలు తృతీయస్కంధములో రామకథ వ్రాసినారు. అందరూ ప్రసిద్ధులైన కవులే. అన్నీ కావ్యాలుగా రమణీయమైనవే, కాని గేయములు కావు. పాఠ్యములైన రామాయణ రచనకు దారి చూపిన వాడు ఉభయకవిమిత్రుడు.

రంగనాథ రామాయణము వలెనే పాఠ్యగేయోభయముగా ద్విపదలో వరదరాజు, ఏకోజీ మొదలైనవారు వ్రాసినారు. కాని వాటికి రంగనాథ రామాయణానికి వచ్చిన ప్రచారము రాలేదు.

3

ఇవిగాక పండితులు గానివారు ఎందరో రామకథను ముఖ్యముగా గేయ ఫణితులలో రచనలు చేసినారు. అట్టివి మొన్నమొన్నటివరకు ముఖ్యముగా వేదము వలెనే ఆనోటినుండి ఆనోట స్త్రీలు చెప్పుకొని వల్లించుటచే నిల్చినవి ఎన్నో ఉన్నవి. గుజలీ పుస్తకములుగా ఎన్నో అచ్చుపడినవి. వాటిలో కొన్నింటిని సేకరించి హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తువారు ‘కృష్ణశ్రీ’ సంపాదకత్వాన ‘స్త్రీల రామాయణపు పాటలు’ అనే పేరుతో చక్కగా 1950లో ప్రచురించినారు. వీటిలో ఎక్కువ భాగము స్త్రీలు వ్రాసినవని చెప్పవచ్చును, కొన్ని పురుషులు వ్రాసినవి కూడా కావచ్చును. కాని వ్రాసినదెవరైనను అటు ధాతువులో గానీ, ఇటు మాతువులో కాని అంత పాండిత్యము గలవారు మాత్రము కారు. వ్యాకరణ లక్షణాలు లెక్క చేయరు. పాటనడక కోసము పదాలలో అక్షరాలు పొడిగిస్తారు, కోస్తారు. ఇది వైరిసమాసమని, ఇది వ్యాకరణవిరుద్ధమని ప్రయోగించుటకు సందేహించరు. ఏది ఏమైనా వాటి మాధుర్యము హృదయానికి సూటిగా నాటుకుంటుంది. సహజసుందరమయిన అమాయకపు తేటరచన వాటిది. వీటిలో రామకథ తెలుగునాటి ఆచారాలతో నిండి నిబిడీకృతమైనది. సీతాదేవి వామనగుంటలు, సీత దాగుడుమూతలు, ఊదర కుప్పీలు, శ్రీరాములవారి అలక, సీత అప్పగింతలు, సీత సమర్త, సీతమ్మ వేవిళ్ళు, కుశలవుల తొట్టి - ఈ మొదలైన పేర్లను బట్టీ రామాయణ పాత్రలు ఎంతగా తెలుగుదనము కూర్చుకొన్నారో స్పష్టపడుతుంది. ఈ కథలు చదివితే మన ఇళ్ళలో రోజూ జరిగే నవ్వులు, పరిహాసాలు, సూటిపోటీలు, కోపతాపాలు ఆ పాత్రలకు అంటగట్టబడి ఉన్నట్లుండును. ఓఢ్రములో కూడా ఇట్లే రామకథ ఓఢ్రాచారాలు పొదువుకొన్నదట!

ఈ కథలలోని వివరమైన అవ్యాజ మాధుర్యమే వీటి విశిష్టత. ఈ విశిష్టత ఎట్టిదైనా అది శాస్త్రవేత్తల లక్షణానికి నిలువలేదు. ఒక్క మాటలో చెప్పవలెనంటే వాటి పాఠ్యము, గేయత్యమును దేశీయములే గాని మార్గ పద్ధతులు కావు. అవి భాషావిద్వాంసులకు గాని, సంగీత విద్వాంసులకు గాని లాక్షణికులకు గాని సంతృప్తి కలిగించవు.

4

13వ శతాబ్దమువాడైన శార్ఙ్గదేవుడు వాగ్గేయకారవరుల లక్షణమును మొత్తముమీద ఈ విధముగా నిర్వచించాడు.

శబ్దానుశాసనజ్ఞానము, అభిదానప్రవీణత, ఛందోభేదజ్ఞానము, అలంకారకౌశలము, రసభావపరిజ్ఞానముతో పాటు అశేషభాషాపరిజ్ఞానము కూడా ఉండవలెను. తౌర్యత్రిక చాతుర్యము, హృద్య శారీరము, లయ, తాళ కళాజ్ఞానములతో పాటు ఉచితజ్ఞతయే కాక రోషద్వేషపరిత్యాగము కూడా కావలెనట. ఇట్టి లక్షణాలు ఇంకను ఎన్నో ఉన్నవి.

శార్ఙ్గదేవుడు చెప్పిన లక్షణాలు అన్వయించుటకు అర్హతగలవాడు లోకములో మనుష్యమాత్రుడుంటాడని తోచదు. ఋషియైన వాల్మీకికే ఈ లక్షణాలు పట్టించలేము. ఈ లక్షణనిర్దేశము వలన లక్షణకర్త ఎంత ఉన్నతాదర్శముతో వాగ్గేయకారకుని భావించినాడో తెల్లమగుచున్నది.

అసాధ్యమయిన ఈ లక్షణాలెలా ఉన్నా, ఉత్తమమధ్యమాధమ భేదాలు తెలిపి వాటిని వర్ణించినాడు. రెండు మూడు విధాలుగా వివరించినాడు. అందులో ఒకదాని ప్రకారము వస్తుకవి ఉత్తముడు; వర్ణనకవి మధ్యముడు; ఇతరుల సంగీతానికి సాహిత్యము కూర్చేవాడు అధముడు. వస్తుకవి అంటే తాను సృష్టించిన సంగీతానికి వర్ణనము చేర్చుటే కాక కథాకథనము చేయగలవాడన్నమాట. బహుశః పాఠ్యే గేయే చ మధురముగా రసవత్తర కావ్యరచన చేసిన వాల్మీకిని మనసులో భావించి ఉత్తమ వాగ్గేయకారకుని లక్షణము ఆయన ఆ విధముగా చెప్పి ఉంటాడు. ఆయన కావ్యములోని గేయత్వము మనకిప్పుడు తెలియదు గదా! కథాకథనములో రసవత్తరమైన పాఠ్యముగా రచించే సామర్థ్యము వాల్మీకితో సమానముగా గల కవి ఇంతవరకు పుట్టలేదు. కాని తన సంగీతమువకు వర్ణనలే కాక కథనమును కూడ జోడించినవాడే ఉత్తమ వాగ్గేయకారకుడౌతాడని మనము సామాన్య లక్షణముగా గ్రహింపవచ్చును. మనము ఇలా విచారణ చేస్తే ఆ కోటిలో నిలవతగినవి సంస్కృతములో జయదేవుని గీత గోవిందము, శ్రీ నారాయణతీర్థుల కృష్ణలీలాతరంగిణి మాత్రమే మిగులును. ఆంధ్రములో సుబ్రహ్మణ్య కవి అధ్యాత్మ రామాయణము కూడా ఆ కోవలోనిదే. శ్రీ త్యాగరాజస్వామి కూడా ప్రహ్లాద భక్తివిజయము, నౌకాచరిత్రములు రచించి తన అతిశయమును ప్రకటించినాడు.

పై విధముగా విచారిస్తే రంగనాథ రామాయణము, తక్కిన ద్విపద రామాయణాలు పాఠ్యగేయాత్మకములైనను, వానిలో పాఠ్యమునకే ప్రాధాన్యమున్నది గాని గేయమునకు అంత లేదు. అందువలన అవి పైవాటితో పాటు ఉత్తమ స్థానమును పొందలేవు. ఆంధ్రమున పుట్టిన ద్విపద రామాయణాలకే కాక ఇతర దేశభాషలలో పుట్టిన కంబ, తులసీదాసు, ఎళుతచ్చన్, బలరామదాసుల రామాయణాలకు గూడ పై వాక్యములు అన్వయిస్తాయి. అవి అన్నీ గేయాలైనా, వాటిలో గేయత్వము అప్రధానము, పాఠ్యము ప్రధానము.

మరి తిక్కనాదుల కావ్యములలో గేయత్వము సమకూర్చవలెనను ప్రయత్నమే లేదుకదా!

పై వాగ్గేయకార లక్షణానికి నిలబడగల రామాయణ రచనలు ఆంధ్రములో రెండే ఉన్నవి. వానిలో ఒకటి సుబ్రహ్మణ్యకవి అధ్యాత్మ రామాయణము, రెండవది నారాయణకవి మోక్షగుండ రామాయణము. ఈ రెండింటిలో మోక్షగుండ రామాయణము పాఠ్యముగా గాని గేయముగా గాని ఆధ్యాత్మ రామాయణమునకు తీసికట్టే. అది రెండింటిలో దేశికి దగ్గరగా ఉంటుంది. ‘మార్గవిధాన సంపద’ అధ్యాత్మ రామాయణములోనే పాఠ్య గేయములలో పరిణతి పొంది కనిపిస్తుంది.

5

అధ్యాత్మ రామాయణకర్త శ్రీ సుబ్రహ్మణ్యకవి. ఆయనను గూర్చి శ్రీ తిమ్మావజ్ఝల కోదండరామయ్య ఖరసంవత్సర (1951) భారతిలో ‘దామెరవారిమీది పదములు’ అనే వ్యాసములో పరిశోధకులకు ఆధారమైన విషయములెన్నో తెలిపినారు. అందులో వారు చేసిన కాలనిర్ణయము నిర్దుష్టమైనది కాదు. అందులో బారు ప్రకటించిన దామెరవారిమీద పదములు సుబ్రహ్మణ్య కవి కృతములని వారూహించిరి. కాని శ్రద్ధగా పరిశీలించినవారికి ఆయన వ్రాసినవి కాదనటానికి ఎక్కువ అవకాశమున్నది. కాని రెండు పత్రములలో ఉన్నట్లు ఉదాహరించిన ఈ క్రింది వాక్యములు స్పష్టముగా అధ్యాత్మ రామాయణ కర్తకే అన్వయించుననడానికి సందేహము లేదు.

“మునిపల్లె రామలింగార్య పుత్రులైన సుబ్రహ్మణ్యకవి చాతుర్యంబుగా రచియించిన అధ్యాత్మ రామాయణ కీర్తనలు తమ ప్రియశిష్యులైన రాజశ్రీ దామెర కృష్ణస్వామివారికి కృప చేసి యిచ్చిన పుస్తకం.”
“మునిపల్లె రామలింగార్య పుత్రులైన సుబ్రహ్మణ్యకవి చాతుర్యంబుగా రచియించిన అధ్యాత్మ రామాయణ పద్యకావ్యం తమ ప్రియశిష్యులైన రాజశ్రీ దామెర కృష్ణస్వామివారికి కృప చేసి యిచ్చిన పుస్తకం...”

పై రెండింటి వలన సుబ్రహ్మణ్యకవి ఇంటి పేరు మునిపల్లె వారనీ, తండ్రి రామలింగార్యుడనీ, ఆయన కాళహస్తి ప్రభువైన దామెర కృష్ణస్వామికి పూజాపాత్రుడైన గురువుగా ఉండెనని మాత్రము నిస్సందేహముగా భావింపవచ్చును. ఆ తరువాత ఉండవలసిన అధ్యాత్మ రామాయణమునకు బదులు ఏవో కీర్తన లున్నందున అది సుబ్రహ్మణ్యకవివి అనుటకు వీలులేదు. దాని రచనకూ అధ్యాత్మ రామాయణ రచకూ ఏమాత్రమూ పోలిక లేదు.

6

ఈ కవి కాళహస్తివాసుడనటానికి అధ్యాత్మ రామాయణమందు కొంత ఆంతరంగిక సాక్ష్యము కూడా లభిస్తున్నది. ఇందులోని కీర్తనలన్నీ ‘శేషగిరీశ’ - మొదలైన ముద్ర కలిగి శేషాద్రివిభునికి అంకితము చేయబడినవి. కాని శివస్తుతిపరమైన మొదటి కీర్తన 4వ చరణములో ‘భవహరణాయ శ్రీకాళహస్తీశ్వరాయ’ అని చేర్చి చివరి చరణములో ముద్రాభంగము లేకుండా ‘శేషశైలాధీశమిత్రాయ’ అని నేర్పుగా చేర్చినాడు. మరల గ్రంథాంతమందలి చివరి రెండు కీర్తనలలో మొదటిదానిలో ఫలస్తుతి చెప్పుచు ‘శ్రీజ్ఞానప్రసూన వినవే’ అని పల్లవిలో చెప్పినాడు. మంగళము చెప్పిన చివరి కీర్తనలో ‘శ్రీకాళహస్తినగరీ శంభుమిత్రునికి సౌకర్యశాలికి జయ మంగళం - సు|| శ్రీకకుత్‍స్థాన్వయ సింహాసనస్థునికి వివేకకార్య శేషగిరి వేంకట సుబ్రహ్మణ్యునికి|| మంగళం శుభమంగళం” అని పూర్తి చేశాడు. ఈ విధముగా ఆద్యంతములలో శ్రీకాళహస్తీశ్వరునీ, చివరి కీర్తనకు ముందు కీర్తనలో జ్ఞానప్రసూనాంబనూ స్మరించి తనకు జ్ఞానప్రసూనాంబయందును, శ్రీకాళహస్తీశ్వరునియందును గల అభిమానము చూపినాడు.

మరియు దామెర కృష్ణభూపతియందు తనకు గల అభిమానము చూపుటకేమోగాని యుద్ధకాండము 44వ కీర్తన చివరి చరణమును “శేషగిరి కృష్ణానుమతిని బొంది” అని పూర్తి కావించెను. దాని తరువాత గ్రంథములో మూడు కీర్తనలే గలవనీ, అందులో నొకటి మంగళమును, దానికి పూర్వప్రకృతి ఫలశ్రుతిని చెప్పేవని గుర్తుంచుకొన్నచో ‘కృష్ణానుమతి’ అన్న పదము సాభిప్రాయముగా ప్రయోగించినాడని ఊహించుట సత్యదూరము గాదు.

చివరనున్న మంగళగీతము పరిసమాప్తి చేస్తూ, “శ్రీకకుత్‍స్థాన్వయ సింహాసనస్థునికి వి-వేకకార్య శేషగిరి వేంకట సుబ్రహ్మణ్యునికి మంగళం” అని పరిసమాప్తి చేయుటకు ‘శేషగిరి వేంకట సుబ్రహ్మణ్యునికి’ అనుటలో శేషగిరి నామముతో కవికేదో సంబంధమున్నట్లు స్ఫురించి శేషగిరి శబ్దము ముద్రలలో ఎన్ని మారులు వాడినాడో లెక్కించగా 104 కీర్తనలలో 40 కీర్తనలలో శేషగిరి శబ్దము వచ్చినట్లు తేలినది. కావున ఈ కవి పూర్తి పేరు శేషగిరి వేంకట సుబ్రహ్మణ్యమా! లేక ఇంటి పేరు శేషగిరివారా! ఇటువంటి వెన్నో సందేహాలు కలుగుచున్నవి. ప్రస్తుతమివి పరిశీలింపదగిన ఊహామాత్రములుగానే భావించి, పరిశోధకులు పరిశీలించదగినవి. ప్రస్తుతమునకు బహుశః కవి పూర్తి పేరు శేషగిరి వేంకట సుబ్రహ్మణ్య (అయ్య, ఆర్య, శాస్త్రి, శర్మ) అయి ఉంటుందని భావించుట సత్యదూరము కాదేమో!

శ్రీ తిమ్మావజ్ఝలవారి వ్యాసములో బహులాశ్వచరిత్ర కర్తయైన వెంగళభూపాలుని తండ్రి వేంకటేంద్రునికి కేసమాంబికయందు జన్మించిన కృష్ణభూపాలు డొక్కడున్నాడు. కాని అతనే సుబ్రహ్మణ్యకవి శిష్యుడని నిర్ణయించుటకు చిక్కులున్నవని తెల్పిరి. ఆ చిక్కులంత ప్రబలమైనవి కావు. బహులాశ్వచరిత్ర కర్త 1500-1600 మధ్యకాలము వాడు. సుబ్రహ్మణ్యకవి శిష్యుడైన కృష్ణభూపాలుని 1780 ప్రాంతములకు సరిపుచ్చుటకు దామెర వంశావళి ప్రకారము బహులాళ్వచరిత్ర కర్తకు 25 వ తరమువాడైన తిమ్మభూపాలుని తోడను, అతని కుమారుడగు కుమారవేంకటప్పనాయుని తోడను, కృష్ణభూపాలుని తాతతండ్రులను సరిపుచ్చచూచినారు శ్రీ తిమ్మావజ్ఝలవారు. ఈ విధముగా 200 సంవత్సరములు 27 తరములకు లెక్కించినారు. ఇది అంత సందర్భశుద్ధి కలది కాదని మాత్రము సూచించి, అప్రస్తుతము కనుక దీర్ఘవిచారణ ఉపేక్షించడమైనది. కేసమాంబిక కుమారుడైన కృష్ణభూపతియే సుబ్రహ్మణ్యకవి శిష్యుడైచో ఈ కవి 18వ శతాబ్దమువాడు కావలెను. శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఆంధ్ర వాగ్గేయకార చరిత్రములో శ్రీ తిమ్మావజ్ఝలవారి ననుసరించి తాత్కాలికముగా శ్రీ సుబ్రహ్మణ్యకవి కాలము 1780 ప్రాంతమని తెలిపినను ఆయన ప్రయోగించిన రాగములను బట్టి క్షేత్రయ్యకు పూర్వుడును అన్నమాచార్యులకు దగ్గఱవాడును కాగలడేమో అనిపిస్తుందనిరి.

అది కాక భద్రాచల రామదాసు 17వ శతాబ్దమువాడు. వీరికి తరువాత కాలమువాడైన శ్రీ త్యాగరాజస్వామివారు తమ ప్రహ్లాదభక్తివిజయమను సంగీతనాటక ప్రారంభమున భద్రాచల రామదాసును సన్నుతించారు. రామకథను వ్రాస్తూ రామదాసు కాలమునుండీ ఆంధ్రదేశమంతటా విస్తారప్రశస్తికి వచ్చిన ‘భద్రాచల’ నామమును సుబ్రహ్మణ్యకవి స్మరింపకుండుట ఒక విశేషము. కాబట్టి ఆయన రామదాసుకు పూర్వుడనియే భావించుట సమంజసము. అయినా శ్రీ తిమ్మావజ్ఝలవారు ‘ఈ పదముల యందలి రచనము అంత పూర్వపుదని తోచుట లేదు.’ అన్న మాటలు గూడ భాషాశాస్త్రవేత్తలు అలోచించి నిర్ణయము చేయవలసియున్నది. ప్రస్తుతము సుబ్రహ్మణ్యకవి కాలనిర్ణయము సంతృప్తికరముగా జరుగలేదని విన్నవించి దానిని భావి పరిశోధకులకు వదలివేయుట మంచిదని తోచుచున్నది.

లక్షణవేత్తలు ఉత్తమ వాగ్గేయకారకుని లక్షణాలుగా నిర్ణయించినవాటిని బట్టి అధ్యాత్మ రామాయణ విచారణ చేదాము. ఆ విచారణ చేసేముందు ఆ లక్షణాల స్వరూపము మరింత స్పష్టముగా వర్ణించుట యుక్తము.

పాఠ్యములో ప్రావీణ్యమంటే, ముందు భాషావిజ్ఞానమే కాక కావలసి వచ్చినపుడు శబ్దాలు వాచోవిధేయముగా ఉండవలెను. దానితో పాటు అలంకారకౌశలము, రసభావ పరిజ్ఞానము కావలెను. లక్ష్మణసేన మహారాజు ఆస్థానకవుల ప్రత్యేక లక్షణాలు వర్ణిస్తూ, జయదేవుడు తనను గూర్చి ‘సందర్భశుద్ధిం గిరాం జానీతే జయదేవ ఏవ’ అని చెప్పుకున్నాడు. కనుక సందర్భశుద్ధి తెలిసి, అనగా ఔచిత్య మెరిగి, రచన చేసే సామర్థ్యముండవలెను. అంటే ఏ సందర్భములో ఏది విస్తరింపవలె, ఎక్కడ ఆపవలె అనునది తెలిసి ఉండవలెనన్నమాట. ప్రకారాంతరముగా చెప్పినచో కల్పనాసంపదతో పాటు ఆత్మనిగ్రహముకూడా ఉండవలెను.

ఇక గేయములలో లయ, తాళ, కళాజ్ఞానము, రాగవిస్తృతి, స్వతంత్రముగా హృదయంగమమైన సంగీతకల్పన చేయగల చాతుర్యము కావలెను, ఏ సందర్భములో ఏ రాగము ప్రయోగించవలెనో మొదలైనవాటి లక్షణము కూడా బాగుగా ఎరిగి యుండవలెను.

ఈ రెండింటికి తోడు వస్తుకవితలో చాతుర్యముండవలెను. అంటే వర్ణనలు వచ్చినపుడు వర్ణనలు, సంభాషణలు వచ్చినపుడు సంభాషణలు, కథాకథన సందర్భములో కథాకథనమూ నేర్పుగా చేయవలెను. వీటికి తోడు రోషద్వేష పరిత్యాగము ఇత్యాది సుగుణసంపత్తి కావలెనని లక్షణవేత్తలు చెప్పిన మాటలను పాతమాటలలో అనువదించి చెప్పినచో ఉత్తమ వాగ్గేయకారకుడు లౌల్యమేమీ లేని ఋషి కావలెను.

7

పైన విస్తరించిన మూడు ప్రధాన లక్షణములలో ముందు సుబ్రహ్మణ్య కవి స్వభావము, కథనాదికముల యందలి దక్షత విచారింతము.

కవి తాను అధ్యాత్మ రామాయణము తెలిగించినట్లు ప్రతి కాండాంతములోను చెప్పుకొన్నాడు. కాబట్టి ఇది సంస్కృతములోని అధ్యాత్మ రామాయణమునకు భాషాంతరీకరణ మనుట నిస్సందేహము. ఎళతచ్చన్ మొదలగు ఇతర భాషాకవుల వలెనే కావ్యము మంగళాంతము చేయుటకు కాబోలు, ఇతడును ఉత్తర కాండమును వదలి పట్టాభిషేకాంతముగా ఆరుకాండలలో వరసగా 17+9+11+10+10+47 కీర్తనలతో రచించెను. సంస్కృత -ధ్యాత్మ రామాయణమును విశ్వామిత్ర మహర్షి రచించెను. దాని మహాత్మ్యమును గూర్చి బ్రహ్మాండ పురాణములో బ్రహ్మ మార్కండేయ మునికి చెప్పినట్లుగా ‘అధ్యాత్మ రామాయణ సంకీర్తన శ్రవణాదికం, ఫలమ్ వక్తుం న శక్నోమి కార్శ్న్యేన మునిసత్తమ’- ఈ ఫలశ్రుతిని మనసులో పెట్టుకొనియే ఆంధ్రములో అధ్యాత్మ రామాయణ సంకీర్తమునకు సుబ్రహ్మణ్యకవి పూనుకొనెనేమో!

ఇందులోని రామాయణ కథ మొత్తముమీద వాల్మీకినే అనుకరించినా, వాల్మీకి రచనలో వలె శ్రీరాముడు, సీత ఆదర్శ మానవమాత్రపాత్రలు కారు. ‘శ్రీరామ హృదయ’మనే నామము గల బాలకాండములోని మొదటి సర్గలోని మూలము ననుసరించి సుబ్రహ్మణ్యకవి రచనలో -

‘రాముడు పరమానందమయుడు, సర్వ చరాచర పరిపూర్ణు డవ్యయుడు, సామగానలోలు డచలు డాద్యుడు సర్వసాక్షి ... పరమాత్ముడు ... నే మూలప్రకృతిని, ఈ మహాత్ము సన్నిధానమాత్రను ఈ మహాద్భుతము లొనర్తు ... రాముడై దశరథునకు నితడు పుట్టుటయు ... దండకాటవి కేగుట, ప్రాకటమాయాసీతాహృతి అందుచేత రావణుని భీకరాజి దునిమిన నన్ను గైకొని, సాకేతము చేరుటెల్ల మత్కృతి’ అంటుంది సీతాదేవి, రామాజ్ఞచే మారుతికి ఉపదేశము చేస్తూ. ఆ తరువాత స్వయముగా శ్రీరాముడే మారుతికి ఆత్మానాత్మ పరాత్మల స్వరూపము, ఐక్యజ్ఞానము కలుగగా నవిద్య మాయమయ్యే విధము ఉపదేశిస్తాడు.

ఈ వేదాంత విజ్ఞానము మూర్తీభవించినది అధ్యాత్మ రామాయణములో. ఈ కావ్యమును ఈ సంశయము వారింపవే అనిన్నీ, జగదాధారమూర్తియైన శ్రీరామునియందు సారసద్భక్తికారూఢమై ముక్తికారణమై యలరారు నొక్క యుక్తి నాదిశక్తిమీర రసిధీర రసికాళికి సారకళలూర బలుకుమని పరమేశ్వరి శ్రీసదాశివ ప్రశ్న చేసెద వివరింపుమని కోరగా, శ్రీరామునకు నమస్కారము చేసి, అజ్ఞానహారి, జితారి, శ్రీవిహారి, మాయాధారి, తారకకీర్తి సత్యజ్ఞానస్ఫూర్తి, విదారితార్తి, దేవతాచక్రవర్తి, చిదానందమూర్తియై, రాజిలు శ్రీశేషశైలాధిపుడగు రాఘవచరితము సుధావర్షమై చెవుల పండువుగా సదాశివుడు వినిపించినదీ కథ.

‘వినవే పల్లవమృదుచరణా, కరుణావితరణ గుణాభరణ’ అనీ, ‘సఖీమణి వినవే నీ వీ సచ్చరితము, సలలితానంద దాయక మనవే’ - అనీ, ‘చానరో వినవే శ్రీరామచంద్రుని చరితము రసభరితము’ అనీ, ‘శ్రీరాజరాజేశ్వరీ, ఈ చరిత్రము ఆర్యనుతిపాత్రము’ అనీ, ‘పావనము, జ్ఞానోదయము, నిత్యాభ్యుదయము నధికపుణ్యామ్నాయము అధ్యాత్మ రామాయణం బెవరు విన్న, నుడివిన వారనఘులై నారాయణుని కరుణను ధన్యులగుదు రందమున’ అనునట్లే ఆదిదంపతుల సంవాదరూపముగా పవిత్రమైన శ్రీరామకథ శాంత రసాత్మకముగా నడుస్తుంది. కరుణవేదియై కవిత్వ మారంభించిన వాల్మీకి రామాయణము కరుణరస ప్రధానముగా సాగినది. అధ్యాత్మ రామాయణము బ్రహ్మవిద్యా ప్రతిపాదకమైనది, కనుక శాంతరస ప్రధానముగా నున్నది.

ఆదిదంపతుల సంవాదరూపములో సాగిన అధ్యాత్మ రామాయణములో వేదాంతము మూర్తీభవించినది. సుబ్రహ్మణ్యకవి వేదాంతవిద్వాంసుడే కాక అనుభవములో కూడ ఆత్మనిష్ఠ గల యోగిగా అఖండచిదనుభవిగా కనిపిస్తాడు. అందువలన ఇందులో క్షేత్రయ్య ఛాయలు కూడ కానరావు. మహాభక్తుడైన జయదేవుడుకూడా అందుకోలేని తాత్త్వికస్థితి ఇందులో గోచరిస్తుంది. వాగ్గేయకారకులలో సుబ్రహ్మణ్యకవి కూడా శ్రీ నారాయణ తీర్థులు, శ్రీ త్యాగరాజస్వాముల కోవలోనివాడు.

ఆయన వర్ణనాచాతుర్యమునకు ఉదాహరణముగా శ్రీరామజనన ఘట్టమే చాలు.

శంకరాభరణ రాగము - ఆట తాళము

పల్లవి:
శ్రీరాముని గాంచెను, పార్వతీ వినవే
మన కౌసల్య ఆత్మ రాముని గాంచెను
అనుపల్లవి:
తోరమై హర్షాశ్రుపూరము కన్నుల
జార భయసంభ్రమాశ్చర్యము ల్బెనగొనగ ||శ్రీ||
చరణములు:
అల నల్లకలువ రేకులచాయ మేనిచే
జెలగు వాని పసిడి చేల గట్టినవాని
వెలయు నాల్గు భుజములవాని కనుగొ-
ల్కుల నరుణరేఖలు గలవాని స్వర్ణకుం-
డలలసిత గండమండలములవాని న-
స్ఖలితరవికోటిప్రకాశకుని రత్నో-
జ్జ్వల కిరీటమువాని అలినీలకుటిల కుం-
తలములచే ముద్దుగులుకుచుండెడివాని గాంచెను! ||శ్రీరాముని||
ఘనతర శంఖచక్రగదాబ్జములవాని,
వనమాలిక యరుత దనరువాని, చిరున-
వ్వను వెన్నెల లాననచంద్రుడు దిక్కు-
లను వెదజల్ల జెల్వలలారెడువాని,
ననుపమాన కరుణామృత పూర్ణనే-
త్రుని మంజీరాంగదుని శ్రీవత్స కటకం-
కణకేయూర కౌస్తుభాది భూ,
షణ భూషితుని జూచి తనివిదీరక తిరుగ! ||శ్రీరాముని||
ఈశ నీవు నిఖిలేంద్రియసాక్షివి
శ్రీశుఁడ వీ విశ్వసృష్టి సంరక్షణ,
నాశములొకటను, జేసిసేయకయున్న,
వాసిచేఁ బోయి, పోవనివాడవై ప్రకృతి
డాసిడాయనివాఁడవై శాశ్వతుఁడవై యా-
కాశాది భూతసంఘములకెల్ల నవ-
కాశమై నీవు ప్రకాశింతు విది మాయా-
పాశాది బద్ధుల కెరగ వశము గాదని తిరుగ! ||శ్రీరాముని||
నీ జఠరమునందనేక బ్రహ్మాండము లీ
యోజఁ బరమాణువులై, యున్న విప్పుడు నీవు
రాజిల్లు నా యుదరమున బుట్టుట కల్ప-
భూజము ముంగిట మొలచినట్లయ్యె నం-
భోజాక్ష పతిధనపుత్రాదిసక్తనై
నే జెల్ల సంసారనీరధిఁ బడనొల్ల
శ్రీజాని నీ శరణు జెందితి నా మదిని
తేజరిల్లుచును సుస్థిరుఁడవు గమ్మని ||శ్రీరాముని||
ఈ యఖిలమును మోహింపజేయు నీదు
మాయకు నగుపడచేయకు నను శేష-
శాయి యీ రూపము సంహరించగదోయి
కాయజజనక చక్కని ముద్దుపట్టివై
హాయిగా నన్నలరచేయు మమితానంద-
దాయినని నిను మదిని దలంతురు ఘనులెల్ల
మాయురే యనుచు వేమారును వినుతించి
శ్రీయుతమూర్తి యా శేషాచలేశుడౌ ||శ్రీరాముని||

భాగవతములోని శ్రీకృష్ణునివలెనే అధ్యాత్మ రామాయణములోని శ్రీరాముడు కూడ నిజరూపములోనే ఆవిర్భవించినట్లు కవి కల్పించినాడని ఈ సందర్భములో మనము గుర్తుంచుకొనవలెను. కన్నులకు గట్టినట్లు ముద్దులొలికే తేటమాటలలో ఎంతో మనోజ్ఞముగా కవి శ్రీరాముని వర్ణించినాడు.

రావణ వధానంతరము సీతను అలంకరించి రాముని వద్దకు తెచ్చిన వర్ణనము అనుపమానమైనది. ‘పట్టుచీరెగట్టి, బంగారు రవిక దొడిగి, బొట్టుకస్తూరి బెట్టి, కాటుకన్నుల బెట్టి ... ఇత్యాదిగ ఉన్నది. ఇట్లే రామరావణ యుద్ధవర్ణనలు ఎంతో మనోజ్ఞముగా నున్నవి. రాగతాళాల నిర్బంధములో వర్ణనలు చేయుట కొంత తేలిక గావచ్చును గాని కథాకథనము రసవంతముగా చేయుట అసాధ్యమనదగినంత కష్టసాధ్యమైన కార్యము. సుబ్రహ్మణ్యకవి పట్టాభిషేకాంతమైన శ్రీరామ కథను హృద్యముగా రసవత్తరముగా కథనము చేసినాడని అనడానికి కావ్యమంతా ఉదాహరణభూతమగును, సీతా వివాహము, రామ పరశురామ సంవాదము, శ్రీరామ వివాసనము, భరతుని సమాగమము, అత్రిముని దర్శనము, సీతాహరణము, జటాయువునకు కైవల్యమిచ్చుట, వాలి పరిదీవనము, సీతాన్వేషణము, హనుమంతుడు సీతను దర్శించుట, విభీషణుని శరణాగతి, సంజీవిని తెచ్చుటలో కాలనేమి విఘ్నము, రావణాది రాక్షసులతో యుద్ధములు, శ్రీరామ పట్టాభిషేకము- అన్నీ సందర్భోచితముగా మధ్య మధ్య మంచి సంభాషణలు కలిపి, రసవంతముగా కథనము చేసినాడు.

ఈ విధముగా వర్ణనమందు సమర్థత, సంభాషణలో చాతుర్యము, కథాకథనములో రసప్రదరచన- అన్నీ కలిసి శాంతరస ప్రధానమైన ఉత్తమకావ్యముగా అధ్యాత్మ రామాయణమును సుబ్రహ్మణ్యకవి తీర్చిదిద్దినాడు.

8

పాఠ్యము చక్కగా నిర్వహించుటకు కవి భాషావేత్త కావలెను. సుబ్రహ్యణ్యకవికి సంస్కృతాంధ్రములలో నిర్దుష్టమైన పాండిత్య మున్నదగటానికి వీరి మొదటి కీర్తన రచనమే చాలు. నన్నయ భారతమును, తిక్కన ఉత్తర రామాయణమును సంస్కృత శ్లోకములతో ప్రారంభించినట్లే, సుబ్రహ్మణ్యకవి తన కావ్యమును సంస్కృత కీర్తనతోనే ప్రారంభించినాడు. ధన్యాసి రాగము, ఆదితాళములో చెప్పిన ఒక్క కీర్తనే చాలు, ఎవరి పేరైనా శాశ్వతముగా నుండటానికి!

పల్లవి:
నమశ్శివాయ తే నమో భవాయ!
అనుపల్లవి:
సమానాధిక రహితాయ శాంతాయ స్వప్రకాశాయ
ప్రమోదపూర్ణాయ, భక్తౌఘపాలనాయ ||నమశ్శివాయ||
చరణం 1:
గర్విత దానవలోకఖండనాయ శ్రీరజత-
పర్వతాగ్రనిలయాయ పావనాయ
సర్వలోకపాపపుంజ నిర్వాపణాయ శర్వాయ
దర్వీకర భూషణాయ, సర్వోత్తమాయ ||నమశ్శివాయ||
చరణం 2:
అండజాధిపవాహనఖాండాయ మేరుశైలకో-
దండాయ శితికంఠాయ పండితాయ
మండితత్రిపురజయోద్దండతాండవాయ బ్ర-
హ్మాండనిలయాయ మహామాయాతీతాయ ||నమశ్శివాయ||
చరణం 3:
మందహాసవదనారవిందసుందరాయ యోగి-
బృందానందదాయ శత్రుభీకరాయ
ఇందుసూర్యాగ్నినేత్రాయ నందిత ప్రమథగణాయ
నందివాహనాయ పోషితబృందారకాయ ||నమశ్శివాయ||
చరణం 4:
నిరుపమానంద ఘననిశ్చితాయ శాశ్వతాయ
వరదా భయంకరణాయ, గిరీశాయ
తరుణేందుశేఖరాయ పరమపురుషాయ భవ-
హరణాయ శ్రీకాళహస్తీశ్వరాయ ||నమశ్శివాయ||

ఈ విధముగా ఎత్తుగడలోనే శివకేశవులందు అభేదమైన భక్తి పాఠకుల హృదయాలలో ఆవిర్భవింపచేసినాడు. పల్లవిలో పంచాక్షరిని స్మరించి, అనుపల్లవిలో పరబ్రహ్మస్వరూపము ప్రదర్శించినాడు. సంస్కృతభాష ఎంత ఉదాత్తముగా నడుస్తూ కవికి వాచోవిధేయముగా నున్నదో తెలుస్తూనే ఉన్నది. అప్రయత్నముగా యమకము, అనుప్రాసలు, అంత్యప్రాసలే గాక ఆంధ్రభాషకు విశిష్టమైన ద్వితీయాక్షరప్రాస, అక్షరమైత్రి రూపమున యతి, ప్రాసయతులు కూడ ఇందులో ప్రత్యక్షమైనవి.

శివస్తోత్రరూపమైన సంస్కృత కీర్తనతో గ్రంథారంభము చేయటానికి కారణాలు చాలా ఊహింపవచ్చును. గీర్వాణభాషయం దభిమాన మొకటి. సంగీత లక్షణవేత్తలు వాగ్గేయకారవరునికి అనేకభాషలు వచ్చి యుండవలెననుట రెండవది. మూడవది ప్రాచీన వాగ్గేయకారులు తమ లక్షణములనే కాక లక్ష్యమును కూడ సంస్కృతములోనే చెప్పియుండుట. వీని అన్ని టికి తోడు ఇది గేయాత్మకమైన గ్రంథము కాన గానమునకు, నాట్యమునకు ప్రథమాచార్యుడైన శివుని స్తోత్రము చేయుట సమంజసము కదా! అందుకనే చివరి చరణములో ‘సంగీత లోలాయ’ అనే విశేషమును ప్రత్యేకముగా వేసినాడు. కవి తన గ్రంథమును శేషగిరీశునకు అంకితము చేసినను తాను భేదము లేని శివభక్తి కలవాడనని, శ్రీకాళహస్తివాసుడనీ కూడ రమ్యముగా సూచించినాడు. ఈ కవి భావించిన శివుడు సమానాధికరహితుడు. అందుచే శ్రీరామ స్వరూపుడే!

సంస్కృతములో ఇదేగాక మరి ఐదు కీర్తనలు, ఒక చూర్ణికను గూడ చేర్చినాడు. అందులో ఒకటి సేతుబంధ సమయములో చేసిన శివస్తోత్రము. దానితో ‘తాంకిట తకతకిట రిమరిస-’ అను జతులను చేర్చి ఆ స్తోత్రమునకు పరిపూర్ణత చేకూర్చినాడు.

సురటి రాగము ఆది తాళములో చెప్పిన ‘రామలింగా వృషభతురగా రాజితాంగా’ అనునది వీరి సంస్కృత కీర్తనలలో నొకటి. మరి యొకటి కుంభకర్ణవధ సందర్భములో నారదుడు చేసిన రామస్తుతి. మూడవది, నాలుగవది సీత అగ్నిశుద్ధియైన వెంటనే బ్రహ్మ, ఇంద్రుడు చేసిన శివస్తుతులు. ఐదవది శ్రీరామ పట్టాభిషేక సమయములో బ్రహ్మాది దేవతలు చేసిన స్తుతి. గ్రంథప్రారంభమును పంచాక్షరితో చేసినట్లే, ‘నమోస్తు శ్రీరామాయ నారాయణాయ’ అనే ఘంటారాగ రూపకతాళ పల్లవిలో నారాయణాష్టాక్షరి ధ్వనింపజేయుట గమనింపదగిన విశేషము.

‘గద్యం కవీనాం నికషం వదంతి’ అని అభియుక్తోక్తి కలదు. ‘శ్రీమదగణిత గుణమణిగణాలంకృత రుచిరతర శుభస్వరూపం, సకలజనభయావహ మహదజ్ఞానజనిత కలికలుషాంధతామిస్రనివారక భవతారక దీపం ...’ ఇత్యాదిగా ఆరణ్యకాండములో జటాయువుచేత చక్కని చూర్ణికలో రామస్తుతి చేయించాడు.

ఇంతవరకు సంస్కృత పాఠ్యములో కవికున్న సమర్థత వివరించబడినది. వీరి ఆంధ్రభాషాపాండిత్యము దాని కెంతమాత్రము తీసిపోదు. ఆంధ్రభాషలో ఈ కవి పూర్తిగా నన్నయాది పురాణ కవులయు, పెద్దనాది ప్రబంధ కవులయు మార్గములే అవలంబించినాడు. ఆంధ్ర గేయ రచయితలు సర్వసామాన్యముగా ప్రయోగించే వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు అధ్యాత్మ రామాయణములో కానరావు. తద్భవ దేశ్య శబ్దములతో ఉన్నా, భాష నిర్దుష్టముగా ఉంటుంది. భాషా విషయములో ఇట్టి విశిష్టత పాటించిన ఆంధ్ర వాగ్గేయకారులు ఇంకెవరూ లేరనియే చెప్పవచ్చును. సంస్కృత శబ్దాల కూర్పులోనూ, తెలుగు శబ్దాల కూర్పులోనూ సౌలభ్యము, నేర్పు కనపడును. చక్కని పలుకుబడి ఉన్నది. వీరి రచనలు గేయములైనను అందలి భాష చక్కని జాతీయములతో గూడి కావ్యమునకు పరిపూర్ణత కూర్చుచున్నది. యుద్ధకాండములో రావణుడు విభీషణుని హితోక్తులు పెడచెవిని పెట్టు సందర్భమున ‘ఔషధము రోగి మెచ్చునా!’ అని సందర్భోచితముగ ప్రయోగించినారు. వీరి రచనలు సుందరమైన సమాసములతో కూడి యుండును. వ్యర్థపదములు చాల అరుదు. యతి ప్రాసలు, అంత్యప్రాసలు, యమకాదులు కవి అలవోకగా కూర్చగలడు.

మాయ లేడిని వర్ణించు ఫరజు రాగ, ఆటతాళ కీర్తనలో-

పల్లవి:
ఇంతీ చెంగల్వబంతీ చెలువల మేల్
బంతీ గుణముల దొంతి వినవే||
5వ చరణము:
పదియారు వన్నియ బంగారువలె దనువు
పొదల మేనిపై వెండిపువ్వులవలె చుక్కలు
గుదిగొన మణిరుచుల గొమరారు కొమ్ములు
కొదమరత్నములనగా గొరిసెలు దనరగ
నుదుట నీలములవలె గన్గవ యొప్ప మారీచుండు లేడియై
కదలి శేషగిరీశుడగు రాఘవుడున్న పంచవటి చేరెను ||ఇంతీ||

ఆ తరువాతిదైన నాయకి రాగ, ఆదితాళములోని కీర్తన

2వ చరణము:
సర్వపూర్ణుడయ్యు నచలుడయ్యును సాక్షియయ్యు లోకానుసారియై
పర్విడి మాయామృగము వెంట దగిలె భక్తపోషణుం డనెడి నుడిని విదితముగా
నుర్వీతనూజ కోరిక దీర్చగ నుద్దండాటవి రఘువీరుడు చని
దుర్వారామర్షణుడై మృగంబు నుర్విం బడనేసె నిశితాస్త్రమున ||ఇంతీ||
3వ చరణము:
త్రుళ్ళడంగి కపటరూపు చెడి మారీచు డొరలుచో హా లక్ష్మాణా
చెల్లరే నన్ను బ్రోవుమని చక్రి చీరినటుల దోచ నార్తరవమున నిలపై
ద్రెళ్ళుచు మహీశు సన్నిధిచే ముక్తిం జెందెనచట నార్తధ్వని విని
తల్లడపడి భూమిజ రాము డాపదం బొందెను జను లక్ష్మణా యనెను
దీనభక్తజన సౌఖ్యదాయకి ప్రాణనాయకీ వినవే ||ఇంతీ||

ఇతర సందర్భాలలో ఈ వ్యాసములో ఉదాహరించిన కీర్తనల భాషను కూడ గమనిస్తే, సుబ్రహ్మణ్యకవి పాఠ్యములో మార్గపద్ధతినే సమర్థతతో నిర్వహించాడని విదితమౌతుంది.

9

అధ్యాత్మ రామాయణ గేయత్వము కూడ మార్గమే. ఇందు ప్రతి కీర్తనకూ రాగము, తాళము నిర్ణయింపబడి ఉన్న వి. స్వరసహితముగ ఈ గ్రంథము ఇంతవరకు ప్రకటింపబడి యుండలేదు. కాని సంగీతాభిమానుల చేత ఇందలి కీర్తనలు పరంపరగా గానము చేయబడుచు వీటి గేయఫణితులు ఇంకను భక్తగాయకుల నాలుకల మీద స్థిరముగ నిలిచియే ఉన్నవి. అధ్యాత్మ రామాయణ మంతయు పాఠము చేయకున్నను కనీసము రెండు మూడు కీర్తనలైనను పాఠము చేసి, గానము చేయనివారు ఆంధ్ర దేశమున అరుదు.

ఇందు మొత్తము 104 కీర్తనలు కలవు. ఇందలి ప్రతి ఒక్క కీర్తనా ఒక కళాఖండము.

కీర్తన సర్వాంగసంపన్నముగా నుండుటకు పల్లవి, అనుపల్లవి, చరణము అను మూడు భాగములు ఉండవలెను. అట్టి కీర్తనలకే కృతులను నామము నేటికాలమున రూఢి ఐనది. వీరి కృతులన్నిటియందును పల్లవి, అనుపల్లవి, చరణము లను భాగములు కలవు. పల్లవి, అనుపల్లవి, చరణములు - ఈ మూడును మూడు వేరువేరు ధాతువులలో ఉన్నవి. కాన అధ్యాత్మ రామాయణ రచన అంతా కృతులలోనే సాగిన దనదగును. వీరి కృతులకు 3, 4 నుండి 10, 11 వరకు చరణములు కలవు. చరణములన్నియు ఒకే ధాతువులో పాడబడును, అయినను చక్కని కథాకథనముతో ఈ చరణముల రచన సాగి శ్రోతలకు విసుగు కలిగించవు.

చరణములలో మరియొక విశేషము కూడ కలదు. దీని చివరి భాగమందలి సాహిత్యము మధ్యమ కాలములో గానము చేయబడును. ఇట్టివాటినే నేటి సంగీత విద్వాంసులు మధ్యమకాల సాహిత్యము లనుచున్నారు, కృతి రచన ఏర్పడుటకు పల్లవి, అనుపల్లవి, చరణములు చాలును కాని, సుబ్రహ్మణ్య కవి చరణాంతములందు మధ్యమకాల సాహిత్యములను రచించి వాటి శ్రావ్యతను ఇనుమడింపచేసినాడు. ‘మధ్యమకాల సాహిత్యములకు సృష్టికర్త’ అని ప్రసిద్ధి పొంది కర్ణాటక సంగీత త్రిమూర్తులలో నొకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితుల మధ్యమకాల సాహిత్యముల కేమాత్రము ఇవి తీసిపోవు. శ్రీ ముత్తుస్వామి దీక్షితులకు సుబ్రహ్మణ్యకవి పూర్వుడగుటచే వారికిందులో మార్గదర్శి యనుట అతిశయోక్తి గాదు.

యుద్ధకాండమందు సురటిరాగము - ఆదితాళములో చెప్పిన ‘రామలింగా వృషభతురంగా రాజితాంగా రామా’ అను శృతి చివరనున్న

“తాంకిట తక తకిట రిమ రిసరీ, తహక ఝం రిమ పద
తకుంద ఝంతారి తధ పద మప
తాహ తకిటతక ఝం తారి సరి మరీస సని సరీ సనిదప
తాం తకిట పదమనిదపమ ధళాంగు ధిమితక తధిగణ తోం ||రామ||”

అనునదియు, సీతారామ కల్యాణ సమయమున అప్సరసలు ఆడిరని తెల్పు సమయమున కూర్చిన జతులును వీరి స్వరలయాది పాండిత్యమును ప్రదర్శించుచున్నవి.

ఈ వాగ్గేయకారుడు లక్ష్యలక్షణములందు సామర్థ్యము కలవాడు. ఈ కావ్యమునందు వారు వాడిన రాగముల వైవిధ్యమును బట్టియే అది స్పష్టపడుతున్నది. ఇందు గల 104 కృతులు 58 రాగములలో చెప్పబడినవి. శ్రీ నారాయణతీర్థులు 153 కీర్తనలు గల శ్రీ కృష్ణలీలాతరంగిణి 37 రాగములలో గానము చేసి ఉండిరి. ఇప్పటికి లభించిన 334 క్షేత్రయ్య పదాలలో 39 రాగములు మాత్రమే ఉపయోగింపబడినవి.

బాలకాండములో ఒక విశేషము కూడ గమనింపవచ్చును. ఇందలి 17 కృతులు 17 వేరువేరు రాగములలో రచింపబడినవి. ఒక రాగమందు ఒక కృతి రచింపవలెనంటే ఆ రాగముపై పూర్తి అధికారము ఉండవలెను గదా! ఇట్లు ఒక్కొక్క కృతిని ఒక్కొక్క రాగములో గానము చేయుట వలన ధాతువులో ఈ వాగ్గేయకారకునకు గల అనితరసామాన్యప్రజ్ఞ వెల్లడి యగుచున్నది. బాలకాండములో ప్రత్యేకముగా ఇంత వైవిధ్యము చూపుటను బట్టి ఆ కాండమునందు కవికి ఎక్కువ అభిమానమని భావింపవచ్చును. ఈ కాండమును సురటి రాగముతోనే అంత్యము చేయుట ఈ ఊహనే బలపరచుచున్నది. ‘అంత్య సురటి’ అను అభియుక్తోక్తి ప్రసిద్ధము కదా!

నేడు ఎక్కువ ప్రచారములో లేని ఘంటా, రేగుప్తి, గుమ్మకాంభోజి, మారువ, ఆహిరి, హిందూఘంటా, మంగళకైశిక, పూరి రాగముల వంటి ప్రాచీన రాగములు ఇందులో కలవు. అవి అన్నమాచార్యుల కీర్తనలలోను, ప్రాచీన యక్షగానములలోను ఎక్కువ వాడుకలో ఉన్నట్లు చెప్పవచ్చును.

సుబ్రహ్మణ్యకవి యోగించిన అపూర్వరాగములలో లలిత, లలితపంచమి, యమున వంటి రాగములను పేర్కొనవచ్చును. అవియే కాక ఫరజు, కాపీ వంటి హిందూస్తానీ రాగములను కూడ వాడి యుండిరి. క్షేత్రయ్య పదాలతో ప్రచారము పొందినదనే ‘హుసేని’ రాగమును సుబ్రహ్మణ్యకవి కూడా ఉపయోగించినాడు. దీనిని బట్టియు, ఈయన వాడిన ప్రాచీన రాగములను బట్టియు ఈ కవి క్షేత్రయ్యకు పూర్వుడై ఉండుననుటకు ఎక్కువ అవకాశము గలదు.

యుద్ధకాండమున ప్రథమ యుద్ధారంభమున ఘనరాగములైన నాట, ఆరభి, శ్రీ, గౌళ అను నాలుగు రాగములను వరుసగా ఉపయోగించినారు. వరాళి రాగము వాడలేదు. నేటి విద్వాంసులు వరాళి రాగముతో కలిపి వీటిని ‘ఘనరాగ పంచకమ’ని వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ కాలమున వరాళి రాగమును వదలి తక్కిన వాటినే ‘ఘనరాగ చతుష్టయము’గా పరిగణించేవారేమో అని ఊహింప నవకాశమున్నది.

అది కాక మరియొక కారణము కూడ ఊహింపవచ్చును. నేటి ఘనరాగ పంచకమందు వరాళి రాగమును వదలి, నాట, గౌళ, ఆరభి, శ్రీ అను తక్కిన నాలుగు రాగములు మాత్రమే గురువులీనాడు వరుసగా పాఠము చెప్పుచున్నారు. వరాళి రాగమును మరియొక గురువు వద్ద కాని లేక స్వయముగా కాని నేర్చుకోవలసినదే. ఈ ఐదు రాగములు వరుసగా నేర్పుట గురువుకు ప్రమాదము కలిగిస్తుందనే విశ్వాసమున్నది. సుబ్రహ్మణ్యకవి నాటికి కూడా ఇటువంటి భావమున్నదేమో! ఇది గృహస్థ విషయము. సన్యాసాశ్రమము స్వీకరించిన శ్రీ త్యాగరాజస్వామి మాత్రము వరాళి రాగముతో కూడిన ఘనరాగములందు పంచరత్నములు రచించినాడు.

రాగరసమును, కావ్యమందలి సందర్భము ఎరిగి రాగములను ప్రయోగించినపుడే ఆశించిన ఫలము చేకూరగలదు. సుబ్రహ్మణ్యకవి కావ్యమునం దంతట ఇట్టి విజ్ఞతయే చూపినాడు. సీతారామ కల్యాణ ఘట్టమందలి కృతిని కల్యాణిరాగమందే రచించి తన ఔచిత్యమును ప్రదర్శించినాడు. శ్రీ నారాయణతీర్థులవారును కృష్ణలీలాతరంగిణియందు రుక్మిణీ కల్యాణఘట్టమందలి కీర్తనను కల్యాణి రాగమందే రచించిరి.

ఈ కవి రచనలలో కొన్ని విశేషమైన అలంకారములు కూడ కానవచ్చుచున్నవి. మాయామృగమును తెమ్మని సీత అడిగిన సందర్భములో రచించిన ‘నాయకి రాగ’ కీర్తన పల్లవిలో ‘దీనభక్తజన సౌఖ్యదాయకి ప్రాణనాయకి వినవే’ అని నాయకి శబ్దము కూర్చినాడు. ఈ సందర్భములో మాత్రము నాయకి శబ్దము వ్యాకరణరీత్యా సాధువో కాదో లెక్కచేయక ‘ప్రాణనాయకి’ అని ప్రయోగించినాడు. ఇది సంగీత విద్వాంసులు నిర్వచించు దశముద్రలలో నొకటి యగు ‘రాగముద్ర’ యనునది. ఈ రాగముద్రను వాడినట్లే ఆలంకారికులు ప్రత్యేకముగా అలంకారముగా గణించు ముద్రాలంకారము కూడ ప్రయోగించినాడు. ఇటువంటిదే సీతా కల్యాణ సందర్భములో కల్యాణి రాగముతో రచించిన కీర్తన. దానిలో ‘కల్యాణము వినవే’ ఇత్యాదిగా కల్యాణ శబ్దము పల్లవిలో రెండు మారులు, అనుపల్లవిలో మూడు మారులు ప్రయోగించి సీతాకళ్యాణములో తాదాత్మ్యము పొందినాడు,

సుందరకాండములో వానరులు మధువనము భంగము చేసిన కథను గానము చేయు సందర్భములో రచించిన కృతి పల్లవిలో సుబ్రహ్మణ్యకవి మధువనము తేనెలాలిన ఆనందముతో పొంగిపోవుచున్నవానివలెనే ‘సరిగారీ సచ్చరిత్రము వినువారి కరయ నెవ్వారిలను గౌరీ’ అని స్వరాక్షరములను అర్థవంతముగ కూర్చి తన నేర్పును ప్రకటించినాడు!

కొన్ని పల్లవులలో చిత్రమైన విశేషములు కూడా కానవచ్చినవి. కేవలము రెండే పదములు, నాలుగు లఘువులు మాత్రమే కల ‘విను చెలి’ అను చిన్న పల్లవి ఒకచో కూర్చినాడు. మరికొన్ని యెడల ‘తగ వినవే ఈ చరిత్ర దళత్కంజదళ మంజులనేత్రా, నగవిభేదన మణినిచయకాంతిస్ఫుటసుగాత్ర నుతిపాత్రా’ వంటి దీర్ఘమైన పల్లవులును కలవు.

అనుపల్లవియు, చరణములును పాడిన తరువాత పల్లవి అందుకొనుటలో వైవిధ్యము చూపుటకు అనువుగా చక్కని రచన కొన్నింటిలో సాగినది. ఇది గానము చేయు గాయనీగాయకులకు ఎక్కువ సమ్మోదదాయకము. అట్టివానిలో కానడ రాగము, ఆది తాళములోని ఈ క్రింది కీర్తన ఒకటి.

పల్లవి:
అందముగ నీ కథ వినవే రజతాచల సదనా పరిహసిత వి-
నిందితారవింద చంద్రవదనా కుందబృందసుందరరదనా!
అనుపల్లవి:
మందయాన దశరథ వసుధీశుడు మాన్యయశు డయోధ్యాకాంతుడు
పొందుగ తనయులు లేనందుకు వగజెంది వశిష్ఠుని చేరి బల్కె సా ||నందముగ||
4వ చరణము:
లలి నలరిరి హనులు లబ్ధ మనోరథుడై దశరథుడు మందమున
జెలగుచు ఋశ్యశృంగ వసిష్ఠులచే ననుజ్ఞగొని హవిస్సు వేడుకను
కలితగుణుడు కౌసల్యకు సగమును కైకకు సగమొసగగ వారలు
దెలిసి సుమిత్రకు దమయంశములం దెలమ్మి సగము సగ మొసగిరి నిరతా ||నందముగ||
5వ చరణము:
పరమాన్నము భుజియించిన మువ్వురు తరుణులు
... ... ... ... ... ... ... ... ... ... సుమనో-
హర కర్నాటక లగ్నమునను శేషాచలేశుడగు
హరి జనియించె సా ||నందముగ||

వీరి కృతులన్నిటిలో పల్లవులు మిక్కిలి సమర్థతతో రచింపబడినవి. వానిలో ప్రారంభములోనే రాగసంచారము ప్రారంభమై అనుపల్లవిలోను, చరణములలోను సంపూర్ణత చెందును. వాటి విశేషములు గానము చేసి, వినిపించి ప్రదర్శించినపుడే కాని కేవలము మాటలలో వర్ణించుట సాధ్యము కాదు.

తాళ విషయమున గూడ ఈ కవికి మార్గ విధానమందే అభిమానము కనబడుచున్నది. ఇతడు దేశి తాళములను వాడక అట, రూపక, జంపె, త్రిపుట, ఆది తాళములను మాత్రమే వాడినాడు. వానిలో విస్తార ప్రచారమందిన ఆది తాళమను నామాంతరము గల చతురశ్రజాతి త్రిపుటతాళమును 58 కృతులకు ఉపయోగించిరి. ఇందువలన ఆఖ్యానాత్మకమైన ఈ కృతులు భావప్రధానముగా పాడుటకు వీలుగా నున్నవి. సంగీత విద్వాంసులు యథాశక్తిగా ప్రస్తరించుటకును, సామాన్యులు భక్తితో కథాగానము చేసి ఆనందించుటకును అనువుగ కుదిరినవి.

‘సంగీత విద్యాప్రవీణ వినవే’, ‘వీణావాదనాభినయిత మస్తకా వినవే’, ‘సంగీత భారతి వినవే’- ఇత్యాది సంబోధనల యందును, ‘సంగీత లోలాయ’, ‘నాదబిందు కళాతీత’ ... మొదలగు విశేషణములందును ఈ కవికి జంత్ర, గాత్ర సంగీతములందును, అభినయమునందును, నాట్యమునందును గల అభిరుచి అప్రయత్నముగా వ్యక్తమగుచున్నది.

చివరి కృతిలోని అనుపల్లవిలో ‘సంగీతలోలునికి శృంగారశేఖరునికి నంగజాతకోటి రుచిరాంగునికి మంగళం’ అని చెప్పి తన కావ్యమును సంగీతలోలుడైన శ్రీరామచంద్రున కంకితము చేసి నవవిధభక్తులనందరిని శ్రీరామస్వరూపులుగానే భావించి మంగళము చెప్పినాడనిపించును.

ఈ గ్రంథము ఫలశ్రుతిలో చెప్పినట్లు ఇది ‘పావనము జ్ఞానోదయము నిత్యాభ్యుదయము నధికపుణ్యామ్నాయము అధ్యాత్మ రామాయణం బెవరు విన్న నుడివినను వారనఘులై నారాయణుని కరుణన్ ధన్యులనం దగుదురు.’ అనుటకు సందేహము లేదు.

సంస్కృత అధ్యాత్మ రామాయణములో శ్రీరామ హృదయమని ప్రసిద్ధి కల బాలకాండ ప్రథమసర్గలో ఉద్ఘోషింపబడినట్లుగా సుబ్రహ్మణ్యకవి రచనయు “పురారిగిరిసంభూతా శ్రీరామార్ణవ సంగతా, అధ్యాత్మ రామగంగేయం పునాతి భువనత్రయమ్.”


అధ్యాత్మ రామాయణ కీర్తనలు : మునిపల్లె సుబ్రహ్మణ్య కవి

మునిపల్లె సుబ్రహ్మణ్యకవి (క్రీ. శ. 1730 - 1780)
- బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - మొదటి భాగము నుండి)

అధ్యాత్మ రామాయణ కర్త మునిపల్లె సుబ్రహ్మణ్యకవి (కొన్ని కొత్త అంశాలు)
- బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - రెండవ భాగము నుండి)

అధ్యాత్మ రామాయణ కీర్తనల కర్త సుబ్రహ్మణ్యకవి జీవిత విశేషాలు
- ముక్తేవి శ్రీరంగాచార్యులు (భారతి, మే 1977 నుండి)

AndhraBharati AMdhra bhArati - యథావాక్కుల అన్నమయ్య - వేదము వేంకటకృష్ణశర్మ - ఆంధ్రభారతి - (శతకవాఙ్మయసర్వస్వమునుండి) ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) yathavakkula Annamayya - Vedamu Venkata Krihsna Sarma - AndhraBharati AMdhra bhArati ( telugu kAvyamulu andhra kAvyamulu)