వచన వ్యాసములు అధ్యాత్మ రామాయణ కీర్తనల కర్త
సుబ్రహ్మణ్యకవి జీవిత విశేషాలు
- ముక్తేవి శ్రీరంగాచార్యులు

అధ్యాత్మ రామాయణ కీర్తనల కర్త
సుబ్రహ్మణ్యకవి జీవిత విశేషాలు
- ముక్తేవి శ్రీరంగాచార్యులు

(- భారతి, మే 1977 నుండి)

వ్యాసప్రోక్తమైన సంస్కృతంలోని అధ్యాత్మ రామాయణాన్ని మునిపల్లె సుబ్రహ్మణ్యకవితో పాటు ఇంకా పలువురు కవులు తెలుగులోకి అనువదించారు. కాని ఈ కవి తప్ప ఇతరులెవ్వరూ కీర్తనల రూపంలో అనువదించలేదు. సుబ్రహ్మణ్యకవి విరచిత ఈ అధ్యాత్మ రామాయణ కీర్తనలు ఈ అనువాదాలన్నింటిలో మకుటాయమానమై బహుళ ప్రజాదరణ పొంది అజరామరమైన యశస్సును అందుకొన్నాయి. అందువల్ల వే ఈ కవి స్వర్గస్థుడై, కొన్ని శతాబ్దులు గడిచినా, నేటికిన్నీ వీటిలో, కొన్నింటినైనా, పల్లెలలో అచ్చటచ్చట పాఠం చేసేవారిని చూస్తున్నాము.

కవి కాలనిర్ణయము

ఇంతటి ప్రజాదరణ పొందిన కవి కాలమునుగూర్చి స్పష్టమైన ఆధారాలు లభించుటలేదు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు కాళహస్తి సంస్థానములో పరిశోధనకై తాము సేకరించిన తాళపత్ర గ్రంథాలలో “దామెరవారి పదాలు” అనే తాళపత్రప్రతి నొకదానిని 1949 సం॥రం ప్రాంతములో తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారికి ప్రకటన కొరకు అందజేయగా, వారు వాటిని పరిశోధించి ఆ వివరాలను 1951 సం॥రం “భారతి”లో “దామెరవారి మీద పదములు” అను వ్యాసములో ప్రకటించారు. వారు అందులో ఈ కవి ఇంటి పేరు, తండ్రి పేరుతో పాటు కాలమునుకూడా స్పష్టంగా నిర్ణయించారు.

ఎ) తిమ్మావజ్ఝలవారి పరిశోధనలు:

వేటూరివారు అందజేసిన తాళపత్ర గ్రంథం సంపుటికి సంరక్షకంగా ఉన్న కొయ్యఫలకంపై “రాజెశ్రీ దామెర కృష్ణస్వామి పొస్తుకం - ద్వైతాద్వైతం” అని ఉంది. పిమ్మట పత్రాలలో అగస్త్యనాథుడు, కాళహస్తీశ్వరుడు, మరొక దైవమునకు అంకితమైన పదాలు, ఆ పిమ్మట కాళహస్తి సంస్థానాధిపతులైన దామెర తిమ్మభూపాలుని కొమార్డు వెంకట సార్వభౌముని మీదనూ, దామెర వెంకటేంద్రుని కొమార్డు కృష్ణభూపాలునిమీదనూ పదాలు ఉన్నాయి. అగస్త్యనాథుని పదాలు పిమ్మట “మునిపల్లె రామలింగార్య పుత్రులైన సుబ్రహ్మణ్యకవి చాతుర్యంగా రచియించిన అధ్యాత్మ రామాయణ కీర్తనలు తమ ప్రియశిష్యులయిన రాజెశ్రీ దామెర కృష్ణస్వామివారికి కృపచేసి ఇచ్చిన పుస్తుకము” అని గలదు. దీనిని ఆధారంగా తీసుకొని తిమ్మావజ్ఝలవారు అధ్యాత్మ రామాయణ కీర్తనలు రచించిన సుబ్రహ్మణ్యకవి ఇంటి పేరు మునిపల్లె అనియు, తండ్రి రామలింగార్యుడనియు, ఈ కవి దామెర కృష్ణస్వామికి పూజార్హమైన గురువనియు నిర్ణయించారు. ఇందుపై ఎవ్వరున్నూ ఎట్టి బేధాభిప్రాయమున్నూ వెల్లడించక పోవుటేగాక లభించిన ఈ అమూల్యసంపదపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇక తిమ్మావజ్ఝలవారు సుబ్రహ్మణ్యకవికి నిర్ణయించిన కాలం పరిశీలిద్దాం. తాళపత్ర గ్రంథంలో పైన పేర్కొన్న తొలివాక్యం ప్రకారం అధ్యాత్మ రామాయణ కీర్తనలు దరిమిలా పత్రములలో లేవు, వాటి బదులు దామెరవారిమీద రచింపబడిన పదాలు ఉన్నాయి. ఆ పదాల కర్త ఎవరో అందులో లేదు. అయినా అవి సుబ్రహ్మణ్యకవియే రచించాడని భావించి ఆ పదాలలోని దామెర వెంకటేశ్వరుడు, ఆతని కొమార్డు కృష్ణభూపాలుడు 1780 సం॥రం ప్రాంతంవారనియు, సుబ్రహ్మణ్యకవి 1730 సం॥ర ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో జన్మించి ఆ రాజుల ఆస్థానంలో ఉండవచ్చుననియు తిమ్మావజ్ఝలవారు నిర్ధారణ చేశారు. వారే మరల ఆ వ్యాసంలోనే 1500-1600 సం॥ర మధ్యకాలంలో బహులాశ్వచరిత్ర రచించిన కృష్ణభూపాలు డొకడు ఉన్నాడని ప్రస్తావించినా, వానిని సుబ్రహ్మణ్యకవి శిష్యునిగా ఆమోదించలేదు. తమ దృష్టిని తాళపత్ర గ్రంథంలోని పదాల రచన మీదనే కేంద్రీకరించి ఆ రచన 1780 సం॥రముకు సరిపోతూంది గాన తాము నిర్ణయించిన కాలం సరియైనదేనని సమర్థించుకొన్నారు.

బి) నా పరిశోధనాంశాలు:

అధ్యాత్మ రామాయణంలోని కీర్తనల రచనకు, లభించిన తాళపత్ర గ్రంథంలోని పదాల రచనకు, ఏలాంటి సామ్యం లేదు. వాటి రచయిత సుబ్రహ్మణ్యకవియే అని తాళపత్ర గ్రంథంలో ఎచ్చటా పేర్కొనబడలేదు. అయినా తిమ్మావజ్ఝలవారు ఆ పదాల మీదనే కేంద్రీకరించి తమ పరిశోధన సాగించినందువల్ల కవి కాలనిర్ణయముపై వారి పరిశోధన నిర్దుష్టంగా లేదు. బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఆ పిమ్మట తాము రచించిన వాగ్గేయకారుల గ్రంథంలో సుబ్రహ్మణ్యకవి కాలమును గూర్చి వ్రాస్తూ తిమ్మావజ్ఝలవారి పరిశోధనలు కూడా ప్రస్తావించి అధ్యాత్మ రామాయణ కీర్తనల రచన అనుసరించి ఈ కవి అన్నమాచార్యులకు దగ్గిరవాడేమోనని పేర్కొని, పరిశోధకులు ఈ విషయం తేల్చాలని స్పష్టపర్చారు. సుబ్రహ్మణ్యకవి కాలమును గూర్చి ఇలాగే పలువురు కవులు తమ బేధాభిప్రాయాలు వెల్లడించారు. ఈ పెద్దలందరి అభిప్రాయం మన్నించి, కవిగారి అధ్యాత్మ రామాయణ కీర్తనల రచన ఆదినుంచి చివరవరకు విపులంగా పరిశీలించి కవి కాలము నిర్ణయించుటకు పూనుకొన్నాను. కవి, సంగీత విద్వాంసుడేగాక వ్యాకరణప్రవీణుడు కూడా అగుటచే తన కాలంలో వాడుకలో ఉన్న సంగీత వ్యాకరణ ప్రయోగాలతో రచన కొనసాగించాడు. గ్రంథంలో ఇలా గోచరించిన ప్రయోగాలతో పాటు ఆనాటి హరిహరాద్వైత కాలప్రభావములాంటి ఆధారాలు కూడా విపులంగా పరిశోధించి, ఈ కవి 15-16 శతాబ్దుల మధ్యవాడని నిర్ణయించి ఉన్నాను. అందులో ముఖ్యమైన కొన్నింటిని విపులీకరిస్తాను.

(1) కవి వాడిన వ్యాకరణ ప్రయోగాలు

వీటిని (ఎ) అనుకరణ (బి) పదప్రయోగాలు (సి) వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు (డి) విరుద్ధ అర్థ ప్రయోగాలు అని 4 విధాలుగా విభజించాను. వీటిలో తొలిగా పేర్కొన్న అనుకరణను తీసుకొందాం.

(ఎ) అనుకరణ: నన్నయభట్టు దేవయానివద్ద వాడినట్లుగా ఈ కవి సుందరకాండ రెండవ కీర్తనలో, నన్నయను అనుకరించి ‘దాని’ అను పదమును చరణమంతా ఇలా ప్రయోగించాడు: “దనుజాంగనల మధ్యముననున్నదాని శ్రీతరుణివలె నొప్పుదాని, దీనతయు జడగట్టిన కురులు నుపవాసముల గ్రు, స్సిన మేను మాసిన చీరె గలదాని తను గాన విభుడు రామికి నెం, తయు వగగన్గ ననుజడి గొను బాష్పకణములదాని రాముని నుడుపు, పడతిగనె గపిపతి ॥నలిన॥

ఈ కవి, తన రచనలో ప్రయోగించిన “ఇంతి, చెంగల్వబంతి, చెలువల మేల్‍బంతి, గుణముల దొంతి, వినీలవేణి, వినుతగుణశ్రేణి, కామితప్రదసత్కరుణాపాంగా, కామగర్వభంగా, గంగోత్తమాంగా” మొదలగు శబ్దాలంకారాలు 16వ శతాబ్దికి పూర్వం విరివిగా ప్రచారమంది రాయలు కాలంనాటికి తగ్గిపోయాయి. పోతన తన పద్యాలలో ఈ అలంకారం ఎక్కువగా వాడాడు. కాన ఈ అనుకరణ కాలం మనం గమనించవలశి ఉంది.

(బి) పద ప్రయోగాలు: శ్రీనాథుని కాలం లగాయితు పెద్దన మొదలగు పండితుల మధ్యకాలంలోని కవులు “కొను” అను ధాతువుకు బదులు “క” అను పదమును వాడారు. ఉదా: ఎత్తుకొని పోయెను, తన్నుకొని చచ్చెను, తలవంచుకొని అను పదములను ఎత్తు పోయెను, తన్ను చచ్చెను, తలవంచు అని వాడారు. ఈ కవి కూడా తన గ్రంథంలోని 77వ పేజీలో “సీతనెత్తు చనె”, 20వ పేజీలో “తన్ను చచ్చెను”, 97వ పేజీలో “తలవంచు” అనియు ప్రయోగించాడు. ఇలా కొను బదులు అను సంక్షిప్త రూపములను శ్రీనాథుడు తన హరవిలాసం (11.115)లో “అంటు” అనియు మడికి సింగన తన పద్మపురాణం (1.100)లో “కూడు” (3.72)లో “సంధించు” అనియు, రాయలు తన ఆముక్తమాల్యద (VI.84)లో “మోచుకేగుచోన్” అనియు ప్రయోగించుట గమనించగలము.

(సి) వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు:

(1) చిన్నయసూరి బాలవ్యాకరణము ననుసరించి, క్త్వార్థకమైన ఇత్తునకు సంధి లేదు. క్త్వార్థకము అంటే అసమాపక క్రియ. ఉదా: వచ్చి + ఇచ్చెను = వచ్చియిచ్చెను; తూచి + ఇచ్చెను = తూచియిచ్చెను; పంచి + అటు = పంచియటు అగును. ఈ వ్యాకరణ సూత్రమును అనుసరించక, కవి తన గ్రంథంలోని 50వ పేజీలో పంచి + అటు అను పదములకు క్త్వార్థేకార సంధిచేసి “పంచటు” అను పూర్వకాలం ప్రయోగం చేశాడు. ఇలా బమ్మెర పోతన తన భాగవతం (ఉత్తర X.723)లో “ కోసిచ్చె” అనియు, రాయలు ఆముక్తమాల్యదలో (VI.85)లో “చించిచ్చు”, కుమారధూర్జటి కృష్ణలీలావిలాసము (II.29)లో “అందిచ్చి ” అని వాడగా ఈ కవులకు ఇంకా పూర్వీకుడై, 14వ శతాబ్దికి చెందిన నాచన సోమన్న ఉత్తర హరివంశం (I.143)లో “అందిచ్చె” అనియు ప్రయోగించారు.

(2) చువర్ణముతోడ దుగ్ధకారంబు తకారంబగు అను సూత్రము ననుసరించి - “చూచుదుము”, “చేయుదును” అనవలెను గాని “చూతును”, “చేతును” అనరాదు. ఇలాగే “చేతురు”, “కోతురు " అసాధువులు. కాని కవి కాలంనాటి కవులగు కుమార ధూర్జటి కృష్ణరాయ విజయం (1.20)లో “సమంచిత గతినుతుల సేతు నెపుడు”, నందిమల్లయ్య, ఘంటసింగయ్యలు వరాహపురాణం 124(Ia)లో ‘జేతువు శక్తిన్’, అనంతామాత్యుని భోజరాజీయం (III.51)లో “చేతురే” లాంటి ప్రయోగాలు చేశారు. ఈ కవియు తన గ్రంథంలోని 37, 97 పేజీలలో ‘చేయుదును’ బదులు ‘చేతును’ అని ప్రయోగించాడు.

(డి) విరుద్ధ అర్థ ప్రయోగాలు: “సభ్యులు” బదులు విరుద్ధ అర్థమిచ్చే “సభికులు” అను పదము 114 పేజీలో ఈ కవి ప్రయోగించాడు. సభ్యుడు అనగా ధర్మజ్ఞుడు, సభయందు ఉండువాడు అని అర్థము. సభికుడు అనగా ధర్మజ్ఞుడు, త్రాగువాడు, జూదరి అని అర్థములు గలవు. ఈలాంటి విరుద్ధ అర్థ ప్రయోగాలు కూడా మనం గమనించవలసి ఉంటుంది. ఇంతవరకు కొన్ని వ్యాకరణ ప్రయోగాలు తెలియజేశాను. ఇక ఆనాటి మత, సంగీత ప్రయోగాలను కొన్నింటిని పరిశీలిద్దాం.

(2) హరిహరాద్వైత కాల ప్రభావము

13వ శతాబ్దిలో జన్మించిన తిక్కన లగాయితు 16వ శతాబ్ది రాయలు కాలంవరకు హరిహరాద్వైతము దేశమంతా ప్రబలంగా ఉంది. రాయలు వైష్ణవుడైనా అద్వైతాన్ని వ్యతిరేకించలేదు. ప్రజాభీష్టాన్ని పాలించి వాల్మీకి రామాయణం కాకుండా ఆనాడు ప్రబలంగా ఉన్న హరిహరాద్వైత ప్రతిపాదితమైన అధ్యాత్మ రామాయణాన్ని వరించి, ప్రముఖ కవులగు ఎళుతచ్చన్ మళయాళంలోనూ, సుబ్రహ్మణ్యకవి తెలుగులోనూ అనువదించారు. ఈ కవు లిరువుర గ్రంథాలు ఈనాటికీ ఆయా రాష్ట్రాలలో ప్రచారమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. మన సుబ్రహ్మణ్యకవి ఆనాటి సంప్రదాయాన్ని మన్నించి తన రామాయణాన్ని శివస్తుతితో ఆరంభించి తిరుపతి వెంకన్నకు కృతి యిచ్చి శివకేశవులకు ఇరువురకు మంగళం చెప్పి గ్రంథం ముగించాడు.

(3) సంగీత ప్రయోగాలు

నేడు ఎక్కువగా ప్రచారం లేని ప్రాచీన రాగాలు అయిన ఘంటా, రేగుప్తి, హిందూ ఘంటా, మంగళ కౌశిక, మారుస, గుమ్మకాంభోజి రాగాలను ఈ కవి తన గ్రంథంలో వాడాడు. వీటికి తోడు అన్నమాచార్యులు వాడిన కర్ణాటక సారంగ, గౌరీ లాంటి రాగాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో సంగీత విద్వాంసులకు అనుభవంలేని ద్విజావంతి, లలిత పంచమి అను అపురూపరాగాలను కూడా వాడాడు. ఈ రాగాలన్నీ అన్నమాచార్యుల కీర్తనలతో పాటు ప్రాచీన యక్షగానాలలో ఎక్కువగా వాడుకలో ఉండేవి.

కవి విరచిత గ్రంథంలోని ఇంతవరకు తెలియజేసిన ఆధారములతో ఈ కవి 15-16 శతాబ్దుల మధ్య వాడని నిర్ణయించి యున్నాను. ఈ కాలము తిమ్మావజ్ఝలవారిచే పేర్కొనబడిన బహులాశ్వ చరిత్ర గ్రంథకర్త, కృష్ణభూపాలుని కాలమునకు కూడా సరిపోగలదు.

జన్మస్థలము

ప్రాచీన కాలంలో ఇంటి పేర్లు గ్రామాల పేర్లుగా గాని లేక గ్రామాల పేర్లు ఇంటి పేర్లుగా గాని వ్యవహరింపబడేవి. గ్రామప్రజలందరూ కుల విచక్షణ లేకుండా ఆ నామమే తమ ఇంటి పేరుగా ధరించేవారు. అలాగే ఏ గ్రామంలోనైనా మునులు గాని సదాచార సంపన్నులు గాని నివసించియుంటే ఆ పేరే ఆ గ్రామానికి నామకరణం చేసేవారు.

సుబ్రహ్మణ్యకవి ఇంటి పేరు మునిపల్లె అని నిర్ణయం అయినందున ఆ పేరుతోపాటు ప్రాచీన కాలంలో అచ్చట మునులు నివశించిన ప్రాంతమేనా అని కూడా పరిశీలించి జన్మస్థలం నిర్ణయించాలి. ఈ పేరుగల గ్రామం నేటి గుంటూరు జిల్లాలో ఉంది. ఆ ప్రాంతం ప్రాచీన కాలంలో మునుల స్థావరమేనా అని పరిశీలిస్తే అందుకు కూడా తగిన ఆధారాలు కన్పిస్తున్నాయి.

చరిత్ర పరిశోధకులు పురాణ కాలంలోనూ, శాతవాహన రాజ్యపాలనకు పూర్వకాలంలోనూ, దండకారణ్యము దక్షిణ ప్రాంతమంతా వ్యాపించి యుండెడిదని ధ్రువపర్చారు. నేటి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు మూడున్నూ కలిసి ఒకే జిల్లా- కృష్ణాజిల్లాగా బ్రిటిష్ పాలన దినములలో కూడా వ్యవహరింపబడేది. పౌరాణిక కాలంలో ఈ కృష్ణాజిల్లా అరణ్య ప్రాంతమగుటయేగాక కృష్ణానదీ, కృష్ణా-సాగర ప్రాంతము కూడా అగుటచే పలువురు ఋషులకు ఆశ్రయం ఇచ్చింది. హంసలదీవిలో పరమహంసలు వెలుగొందగా, నేటి రేపల్లె తాలూకా మోరతోట ఆనాడు మునులతోటగా ప్రసిద్ధి గాంచింది. శ్రీకాకుళంలో అత్రి, చ్యవలూరులో చ్యవనుడు, అవనిగడ్డలో వశిష్ఠుడు, పెదముత్తేవిలో వ్యాసుడు, విజయవాడలో విజయుడు తమతమ ఆ శ్రమాలను నిర్మించుకొని ఈ సీమను దివి సీమగా రూపొందించారు. అందులోని భాగమే నేటి దివి తాలూకా. మన సుబ్రహ్మణ్యకవి జన్మించిన మునిపల్లె కూడా ఈ ప్రాంతానికి చెంది ఉన్నది. ఇచ్చట పైన పేర్కొన్న మునుల కోవకు చెందిన ఒక ప్రముఖ ముని తన పరివారంతో నివశించి యున్నందున మునిపల్లె అని ఆ పల్లెకు నామధేయం ఏర్పడింది. శాతవాహన చక్రవర్తులు ఈ ప్రాంతంలోని దండకారణ్యాన్ని ఛేదించి వాసయోగ్యంగా చేసినందున, కృష్ణానదియు, సముద్రమున్నూ తమ మార్గములను మార్చుకొని ప్రవహింపసాగాయి అని చరిత్ర పరిశోధకులు వెల్లడించారు. ఇందువల్ల శ్రీకాకుళంలోని ఆలయము రెండుమారులు నదీగర్భం కాగా, ప్రాచీన కాలంలో ప్రముఖ రేవుపట్టణంగా విరాజిల్లిన ‘కంటకసేల’ అను నేటి ఘంటసాల, నదికీ, సముద్రానికీ దూరంలో ఉండిపోయినదనియు వీరు వెల్లడించారు. నాటివలె, మన సుబ్రహ్మణ్యకవి జన్మించిన మునిపల్లె కూడా సముద్రానికిన్నీ, నదికిన్నీ క్రమేణా దూరం అయిపోయింది. ఈ వివరములన్నీ విపులంగా చరిత్రాధారంతో నేను వ్రాసిన “పెదముత్తేవి క్షేత్ర మహాత్మ్యం”లో వివరించాను.

నేటి గుంటూరు-పొన్నూరు ఆర్.టి.సి. బస్సు మార్గంలో నర్సారావుపేటకు 4 మైళ్ల దూరంలో ఈ మునిపల్లె గ్రామం ఉంది. ఈ ఇంటి పేరుగల బ్రాహ్మణ కుటుంబీకులు పలువురు ఇచ్చట ఉన్నారు. వీరంతా సుబ్రహ్మణ్యకవి వంశీకులము అని చెప్పుకొంటారు. ఈ కారణములన్నియు గమనించి ఈ కవి జన్మించిన స్థలం నర్సారావుపేట వద్ద గల మునిపల్లె అనియే నిర్ణయించవచ్చును. ఈ కవి ఈ జిల్లాలో జన్మించినా, చిత్తూరు జిల్లాలోని కాళహస్తి వెళ్లి, తన పాండిత్య ప్రకర్షణవల్ల అచ్చట సంస్థానాధీశుని మెప్పించి వారి వద్ద గురుస్థానాన్ని పొందారు గాని ఆ జిల్లాలో మాత్రం జన్మించలేదు.


అధ్యాత్మ రామాయణ కీర్తనలు : మునిపల్లె సుబ్రహ్మణ్య కవి

మునిపల్లె సుబ్రహ్మణ్యకవి (క్రీ. శ. 1730 - 1780)
- బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - మొదటి భాగము నుండి)

అధ్యాత్మ రామాయణ కర్త మునిపల్లె సుబ్రహ్మణ్యకవి (కొన్ని కొత్త అంశాలు)
- బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - రెండవ భాగము నుండి)

రామాయణ కథాగానము - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి కృత అధ్యాత్మ రామాయణ విశిష్టత
- మంగళగిరి ప్రమీలాదేవి
(భారతీ కళాతరంగిణి (వ్యాస సంపుటి), 1982 నుండి)

AndhraBharati AMdhra bhArati - యథావాక్కుల అన్నమయ్య - వేదము వేంకటకృష్ణశర్మ - ఆంధ్రభారతి - (శతకవాఙ్మయసర్వస్వమునుండి) ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) yathavakkula Annamayya - Vedamu Venkata Krihsna Sarma - AndhraBharati AMdhra bhArati ( telugu kAvyamulu andhra kAvyamulu)