వచన వ్యాసములు మునిపల్లె సుబ్రహ్మణ్యకవి
(కొన్ని కొత్త అంశాలు)
- బాలాంత్రపు రజనీకాంతరావు

అధ్యాత్మ రామాయణ కర్త
మునిపల్లె సుబ్రహ్మణ్యకవి
(కొన్ని కొత్త అంశాలు)

- బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - రెండవ భాగము నుండి)

నాలుగైదేళ్ళ క్రితం కుమారి ప్రమీలాదేవి (మచిలీపట్నం) హిందూ కళాశాల ఆంధ్రోపన్యాసకురాలు భారతీ కళాతరంగిణి అనే చిన్న పరిశోధనాత్మక గ్రంథంలో కొందరు వాగ్గేయకారుల చరిత్రల పరిశీలనాంశములను ప్రకటించారు. ఆ ప్రకరణాలలో ఒకటి సుబ్రహ్మణ్యకవి కృత అధ్యాత్మ రామాయణ విశిష్టత!

మా వాగ్గేయకార చరిత్ర ప్రథమ భాగంలో 14వ ప్రకరణం పూర్తిగా మునిపల్లె సుబ్రహ్మణ్యకవిని గురించి వ్రాసినది.

ప్రమీలాదేవి సుబ్రహ్మణ్యకవి కాలాన్ని గురించి చర్చిస్తూ ఆయనను గురించి 1951 (ఖర-భారతి)లో ‘దామెరవారి మీది పదములు’ అనే వ్యాసంలో శ్రీ తిమ్మావజ్ఝల వారు వ్రాసినట్లు “-బహుళాశ్వ చరిత్రకర్తయైన వెంగళభూపాలుని తండ్రికి కేసమాంబికయందు జన్మించిన కృష్ణభూపాలు డొకడున్నాడు, కాని అతడే సుబ్రహ్మణ్యకవికి శిష్యుడని నిర్ణయించడానికి కొన్ని చిక్కులున్నవని తెల్పిరి; ఆ చిక్కులంత ప్రబలమైనవి కావు. బహుళాశ్వచరిత్రకర్త 1500-1600 మధ్యకాలము వాడు. సుబ్రహ్మణ్యకవి శిష్యుడైన కృష్ణభూపాలుని 1780 ప్రాంతాలకు సరిపుచ్చుటకు గాను దామెరవారి వంశావళిలోని బహుళాశ్వ చరిత్రకర్తకు 25వ తరం వాడైన తిమ్మభూపతితోను అతని కుమారుడగు కుమార వేంకటప్పనాయునితోను కృష్ణభూపాలుని తాతతండ్రులను సరిపుచ్చజూచారు శ్రీ తిమ్మావజ్ఝలవారు - ఇది అంత సందర్భశుద్ధి కలది కాదు. కేసమాంబిక కుమారుడైన కృష్ణభూపతియే సుబ్రహ్మణ్యకవి శిష్యుడైనచో ఈ కవి (సుబ్రహ్మణ్యకవి) 16వ శతాబ్దము వాడు కావలెను. శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఆంధ్ర వాగ్గేయకార చరిత్రములో శ్రీ తిమ్మావజ్ఝలవారి ననుసరించి తాత్కాలికముగా శ్రీసుబ్రహ్మణ్యకవి కాలము 1780 ప్రాంతమని తెలిపినను ఆయన ప్రయోగించిన రాగములను బట్టి క్షేత్రయ్యకు పూర్వుడును అన్నమాచార్యులకు దగ్గరవాడును కాగలడేమో అనిపిస్తుందనిరి.” అని ప్రమీలాదేవి వ్రాశారు.

అప్పటి మా మాటలివి: “రామాయణ కీర్తనలు నూటనాలుగింటికీ 58 రాగాలు వాడబడ్డాయి. క్షేత్రయ నాటి మోహన ఈ కీర్తన రాగాలలో కనబడదు. అన్నమాచార్యులనాటి కర్ణాటసారంగ, మంగళకౌశిక, లలితపంచమ, గౌరి, కన్నడగౌళ వంటి ప్రాచీన రాగాలలో ఉన్నాయి యీ అధ్యాత్మ కీర్తనలు! ఇందువల్ల సుబ్రహ్మణ్యకవి క్షేత్రయకు ఇంకా దగ్గరవాడు మాత్రమే కాక కించిత్పూర్వుడు కాగలడా అని కూడ అనిపిస్తుంది.” అని అప్పుడు వ్రాశాము.

ఇప్పుడేమనిపిస్తుందంటే - క్షేత్రయ్యకు కించిత్పూర్వుడే కాక అన్నమాచార్యులకు కించిత్సమీపంలోని వాడేమో అంటే - 16వ శతాబ్దపు తొలి సగంలోని వాడేమో అని.

పై రాగాలలో గౌరిని తప్ప, క్షేత్రయ్య మిగిలిన వేటినీ వాడలేదు. క్షేత్రయ్యనాడే బహుశా ప్రచారంలోనికి వచ్చి ఉంటాయని ఇంతవరకూ విద్వాంసులనుకొనే ఉసేనీ, కాపీ, ఆనందభైరవీ సుబ్రహ్మణ్యకవి వాడారు. మాంజి, మారువ, సైంధవి, గుమ్మకాంభోజి, హిందూఘంటా ఇత్యాదిగా సుబ్బహ్మణ్యకవి వాడిన రాగాలు అతనిని 16వ శతాబ్దివాడనడానికి తోడ్పడతాయా? కాలంలో కంటె తిరుపతికి దగ్గరైన కాళహస్తి నివాసియైన సుబ్రహ్మణ్యకవి అన్నమయ్యకి దేశంలో ఎక్కువ సమీపస్థుడేమో అని కారణం చెప్పవచ్చు.

ప్రమీలాదేవి ఇంకా ఇలా వ్రాశారు: “ఆదిదంపతుల (ఉమామహేశుల) సంవాదరూపములో సాగిన అధ్యాత్మ రామాయణములో వేదాంతము మూర్తీభవించినది. సుబ్రహ్మణ్యకవి వేదాంత విద్వాంసుడే కాక అనుభవములో కూడా అఖండచిదనుభవములో కూడ, ఆత్మనిష్ఠగల యోగిగా అఖండచిదనుభవిగా కనిపిస్తాడు."" అని చెప్పి, -“ఇందులో క్షేత్రయ్య ఛాయలు కూడ కానరావు. మహాభక్తుడైన జయదేవుడు కూడా అందుకోలేని తాత్విక స్థితి ఇందులో గోచరిస్తుంది - అని తులతూచడం సమంజసం కాదనుకుంటాము.

క్షేత్రయ్యకు మువ్వగోపాలభక్తి మిషగా ఆ గోపీకృష్ణ భక్తిభిత్తికపైని, తానెరిగిన స్త్రీ పురుష ప్రణయప్రకృతి విలాసాలను నర్తకీలాస్యరమణీయములుగా చిత్రించాడు. జయదేవునకు రాధాకృష్ణ భక్తిభిత్తికపైని ప్రకృతిపురుషులైన రాధాకృష్ణుల ప్రణయవిలాసాలను సరసకోమల పదావళీగానమును పురుషోత్తముడైన జగన్నాథునెదుట ఆత్మప్రేయసీనర్తనకు నేపథ్యముగా నిబంధించాడు. మరి సుబ్రహ్మణ్యకవి సనాతన దంపతులైన ఉమామహేశుల సంభాషణలో ఆదర్శదంపతులైన సీతారాముల ఆధ్యాత్మికానుబంధమును తాను కూడా భరతశాస్త్రప్రయోగ ప్రయోజనానికే ఆఖ్యానాత్మక కీర్తనానిబద్ధం చేశాడు.

సుబ్రహ్మణ్యకవి ఆరంభములో కూర్చిన ‘నమశ్శివాయ తే’ అనే సంస్కృత కీర్తనపైని ప్రమీలాదేవి వ్యాఖ్య గమనించాలి.

“సంస్కృతభాష ఎంత ఉదాత్తముగా నడుస్తూ కవికి వాచోవిధేయముగా నున్నదో తెలుస్తూనే ఉన్నది. అప్రయత్నముగా యమకము, అనుప్రాసలు, అంత్యప్రాసలే కాక - ఆంధ్రభాషకు విశిష్టమైన ద్వితీయాక్షరప్రాస, ఆక్షరమైత్రిరూపమున యతి ప్రాసయతులు ఇందులో ప్రత్యక్షమైనవి.”

సంస్కృతములో ఇదేగాక మరి ఐదు కీర్తనలు ఒక చూర్ణికను కూడా చేర్చినాడు. అందులో ఒకటి సేతుబంధ సమయములో చేసిన అవస్తోత్రము. దానితో ‘తాంకిటతక తకిటరిమరిస’ అను జతులను చేర్చి ఆ స్తోత్రమునకు పరిపూర్ణత చేకూర్చినాడు.

ఆ కీర్తనలోనే కాక, అధ్యాత్మరామాయణ కీర్తనలలో అక్కడక్కడ మరికొన్నింటిలో కూడా అన్నమాచార్యులు ‘తిరొ తిరొ జవరాల’ అనే తన కీర్తనలో చేర్చినట్లు పాటాక్షరాలతో మాతుబంధమును కూర్చడము కూడా ఈ కవిని అన్నమాచార్యులకు చేరువగా చేర్చింది, పైని ప్రమీలాదేవి సూచించిన ‘పరిపూర్ణతకు’ అర్థం ప్రతి కీర్తనను నృత్యప్రయోగయోగ్యముగా చేసినారు అని అనుకొంటే బోధపడుతుంది. సంస్కృత పాఠ్యంలో కవికున్న సమర్థతకు విస్తరంగా వివరించి, పరిశోధకురాలు ‘వీరి ఆంధ్రభాషా పాండిత్యము దానికెంత మాత్రము తీసిపోదు. ... తద్భవ దేశ్య శబ్దాలతో ఉన్నా భాష నిర్దుష్టము.’ (ఆంధ్ర గేయరచయితలు సర్వసామాన్యంగా ప్రయోగించే వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు కానరావు.) ఇంత చెప్పిన తర్వాత బంగారు లేడి వర్ణన కీర్తనలో:

‘ఇంతీ చెంగల్వ బంతీ చెలువలమేల్
బంతీ గుణముల దొంతీ వినవే ||
పదియారువన్నియ బంగారువలె తనువు
పొదలమేనిపై వెండిపువ్వులవలె చుక్కలు
గుదిగొన మణిరుచుల కొమరారు కొమ్ములు
కొదమరత్నములనగా గొరిసెలు తనరగ
నుదుట నీలములవలె కన్గవయొప్ప మారీచుండు లేడియై
కదలి శేషగిరీశుడగు రాఘవుడున్న పంచవటి చేరెను || ఇంతీ ||

అని కీర్తనను పూర్తిగా ఉటంకిస్తూ పరిశోధకురాలు చేసిన వ్యాఖ్య, ఇతర సందర్భాలలో ఈ వ్యాసములో ఉదాహరించిన కీర్తనల భాషను కూడ గమనిస్తే ‘సుబ్రహ్మణ్యకవి పాఠ్యములో మార్గపద్ధతినే నిర్వహించాడని విదిత మౌతుంది.’

“అధ్యాత్మ రామాయణ గేయత్వము కూడ మార్గమే”-

ఈ పై వ్యాఖ్యలో ‘మార్గ పద్ధతి’ - ‘మార్గమే’ అనే మాటలకు పరిశోధకురాలైన ప్రమీలాదేవి ఉద్దేశించిన అర్థమేదో బోధపడదు.

గేయ కవితను వ్యాకరణ నిర్దుష్టంగా వ్రాస్తే అది మార్గపద్ధతా? తత్సమపదభూయిష్ఠంగా వ్రాస్తే మార్గమా? - బంగారు లేడి వర్ణనలోని అచ్చతెనుగుపలుకు నుడికారాలు మార్గమేనా? మార్గం అంటే గేయత్వం శాస్త్రీయరాగ తాళాలలో కూర్చిన కూర్పంతా మార్గమా?

సంగీత విద్వల్లోకపు దృష్టిలో మార్గసంగీత పద్ధతి బ్రహ్మభరతులతో ప్రారంభించి, మతంగ శార్ఙ్గదేవుల నాటినుంచి క్రమంగా ఏష్యం అయిపోయింది. అనేక దేశిరాగాలను, దేశిప్రబంధాలను, దేశిరూపకాలను - మార్గత్వానులక్షితములుగా చేసిన మతంగాది లక్షణకర్తలద్వారా భారతదేశంలోని ఆయా ప్రాంతాల దేశి సంగీతమే శాస్త్రీయ సంగీతరీతులుగా ఆయా ప్రాంతాలలో పరిణామం చెందింది. త్యాగరాజు సంగీతం మార్గ కాదు, దేశియే.

జయదేవుని గీతగోవిందం సాహిత్యం సంస్కృతం కనుక, మార్గసాహిత్యం. కాని దాని సంగీతం ఆయా ప్రాంతాల దేశి సంగీతమే. నారాయణ తీర్థుల కృష్ణలీలాతరంగిణి - తెలుగు దేశి (పాటల) ఛందస్సులలో సంస్కృతంలో రచితమైన మార్గసాహిత్యం. కాని సంగీతం అంతా దాక్షిణాత్యమైన లేదా ఆంధ్రీయమైన దేశి! సుబ్రహ్మణ్యకవి నాలుగైదు సంస్కృత కీర్తనలు వ్రాసినా మిగిలిన కీర్తనలలో పల్లవమృదుపాణి అని సంబోధనలలో సంస్కృత తత్సమ శబ్దాలను వాడినా - రాముని జననమూ, బంగారు లేడి మొదలైన సందర్భాలలో ఏ వాగ్గేయకారుడూ వాడి ఉండని దేశి పలుకుబళ్లను ముత్యాలహారాలలాగ పోహళించాడు. ఆయన కవితయూ దేశియే, సంగీతమూ పరమదేశి! జాయప సేనాని నృత్తరత్నావళిలో లక్షణం చెప్పినదంతా దేశి నృత్యపద్ధతులకే. సుబ్రహ్మణ్యకవి కీర్తనలు ఆ లక్షణాలకు ఆదర్శప్రాయమైన లక్ష్యాలు కాగలవు.

“తాళవిషయమున గూడ ఈ కవికి మార్గ విధానమందే అభిమానము కనబడుచున్నది. ఇతడు దేశితాళములను వాడక అట, రూపక, జంపె, త్రిపుట, ఆది తాళములను మాత్రమే వాడినాడు. ... ఆది తాళమను నామాంతరము గల చతురశ్రజాతి త్రిపుట తాళమును 58 కృతులకు ఉపయోగించిరి.”

ఈ పై వ్యాఖ్యలో మార్గతాళములు, దేశితాళములు అనే సంగీతశాస్త్ర విషయాలను గురించిన పరిశోధకురాలి అభిప్రాయాలు క్షోదక్షమములుగా కనబడవు!

తిమ్మభూపతి కుమారుడైన పెదవేంకటేంద్రుని కుమారుడైన కృష్ణునిపై సుబ్రహ్మణ్యకవియే రచించిన శబ్దం - (సలాం దరువు) చూచి ఉంటే, ఆయనకు భరతశాస్త్రం మీదా, నృత్తం మీదా ఉండే ఆస్థా, అధికారమూ పరిశోధకురాలికి స్పష్టంగా స్ఫురించేవి. ఆ శబ్దం కృష్ణశబ్దం అనే పేరుతో కూచిపూడివారు తాము ప్రదర్శించే ఉషాపరిణయం యక్షగానంలో అనిరుద్ధకుమారుని ప్రేమించిన ఉషచేత - అనిరుద్ధుని కృష్ణునితో అభిన్నుడిగా వ్యవహరిస్తూ అభినయింప జేస్తూంటారు.

‘సామి రారా, యదువంశకులాంబుధిచంద్ర’-అని ప్రారంభించిన యీ శబ్దంలో ‘దామెర తిమ్మేంద్రకుమారా పెద వేంకటేంద్రహమ్మీరా, భరతశాస్త్ర నిధి నీవేరా’ - ఇత్యాదిగా కొనసాగి - ‘దానరాధేయ సలాం’ అని ముగుస్తుంది. దామెరవారయిన తిమ్మభూప, వేంకటేంద్ర, కృష్ణభూపుల పేర్లు బాంధవ్యమూ ఆధారంగా వారి ఆస్థాన విద్వత్కవి కాలం - మరొకసారి క్షుణ్ణంగా పరిశోధించవలసి ఉంటుంది.


అధ్యాత్మ రామాయణ కీర్తనలు : మునిపల్లె సుబ్రహ్మణ్య కవి

మునిపల్లె సుబ్రహ్మణ్యకవి (క్రీ. శ. 1730 - 1780)
- బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - మొదటి భాగము నుండి)

రామాయణ కథాగానము - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి కృత అధ్యాత్మ రామాయణ విశిష్టత
- మంగళగిరి ప్రమీలాదేవి
(భారతీ కళాతరంగిణి (వ్యాస సంపుటి), 1982 నుండి)

అధ్యాత్మ రామాయణ కీర్తనల కర్త సుబ్రహ్మణ్యకవి జీవిత విశేషాలు
- ముక్తేవి శ్రీరంగాచార్యులు (భారతి, మే 1977 నుండి)

AndhraBharati AMdhra bhArati - యథావాక్కుల అన్నమయ్య - వేదము వేంకటకృష్ణశర్మ - ఆంధ్రభారతి - (శతకవాఙ్మయసర్వస్వమునుండి) ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) yathavakkula Annamayya - Vedamu Venkata Krihsna Sarma - AndhraBharati AMdhra bhArati ( telugu kAvyamulu andhra kAvyamulu)