భాష ఛందస్సు రగడలు

శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు

1

తెలుగు ఛందస్సులో నెన్నియో విధములైన పద్యము లున్నవి. అందులో వృత్తములు యమాతారాజభానసలగములపై నాధారపడినవి. జాతులు, ఉపజాతులు మాత్రాగణములచే, అంశగణములచే (సూర్యేంద్రచంద్ర గణములచే) నిర్మింపబడినవి.

అప్పుడప్పుడు పద్యముల నే విధముగ సంగీతబద్ధముగ నమర్చుట యనునది ఒక చర్చనీయాంశము. ఆదికవియైన నన్నయభట్టు వృత్తములైన శార్దూలమత్తేభ విక్రీడితములను, చంపకోత్పలమాలలను, జాత్యుపజాతులైన కంద, సీస, ఆటవెలది, తేటగీతులను ఎక్కువగా వాడుటకు కారణము అవి వినసొంపుగా నుండుటవలన యని కొందఱనెదరు. నన్నయ సంస్కృతాంధ్ర ఛందోరీతులను సరిసమానముగ నెన్నుకొని భారతాంధ్రీకరణమును గావించెను. దీనికి కారణము సంగీతము మాత్రము కాదని నా తలంపు.

తెలుగులో పాడుటకు వీలగు పద్యములు గలవా అను ప్రశ్న తత్క్షణమే ఉదయించును. ఏ పద్యమునైనను రాగయుక్తముగ పాడుటకు సాధ్యమే. రాగము పదముల విఱుపు, భావము, సన్నివేశములపై నాధారపడి యుండును. వృత్తములకన్న జాత్యుపజాతులకు తాళము యుక్తముగ నుండును.

లోకమున కొంద ఱదృష్టవంతులు. అదృష్టవంతు లందఱు మేధావులు, సౌందర్యవంతులు కారు. అట్లే సాహిత్యములో కూడ కొన్ని పద్యములు అదృష్టము చేసికొన్నవి. శార్దూలవిక్రీడితము చేసికొనిన అదృష్టము స్రగ్ధర చేసికొన లేదు. అంత మాత్రమున స్రగ్ధర అందమైన వృత్తము కాదా! కాకపోయిన నన్నెచోడుడు కుమారసంభవమును ఈ వృత్తముతో నెందులకు ప్రారంభించును?

దైవపూజకు అన్ని విధములైన పుష్పములు అంగీకృతమే. అటులనే అక్షరబ్రహ్మారాధనకు అన్ని పద్యములు నుపయుక్తమే. తెలుగులో సంగీతపరముగను, తాళయుక్తముగను నుండు పద్యములయందు రగడలు అత్యుత్తమములు. ఒక సంగీతకారుడు ఆదికవిగ నుండినయెడల రగడలు చాల ప్రసిద్ధికెక్కి యుండెడివి. తెలుగు సాహిత్యములో వెలుగు కిరణములను ప్రతిఫలించక మణిమంజూషలో మఱుగుపడిన నవరత్నములు నవవిధ రగడలు.

2

క్రీస్తుశకము తొమ్మిదవ శతాబ్దము నందలి అద్దంకి శాసనములోని తరువోజను (పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు బలగర్వ మొప్పగ బైలేచి సేన...) మొట్ట మొదటి తెలుగు పద్యముగ పరిగణించవచ్చును. కాని ఆఱవ శతాబ్దపు ఉత్తరార్ధములో ధనంజయుని కలమళ్ళ శాసనములో "ఎఱికల్‌ ముతురాజు ధనంజయులూ రేనాండేళన్‌ చిరుమూరీ" అను పాఠము చతుర్మాత్రాబద్ధమైన మధురగతి రగడగ భావించబడుచున్నది. అనగా ఆఱవ శతాబ్దములో రగడల బోలు పద్యములు తెలుగులో నున్నవని భావించ వీలగును.

కన్నడ లాక్షణికుడైన నాగవర్మ రగడలవలె నుండు పద్యములను ఛందోంబుధిలో క్రీస్తుశకము 990 ప్రాంతమున తెలిపెను. దీనిని అతడు రఘటాబంధ మని పిలిచెను. ఆ పద్యము-

కందము-

గణనియమ విపర్యాసదొ
ళెణెపదదొళ్‌ కూడి మాత్రె సమనాగె గుణా-
గ్రణి యమతదిందె తాళద
గణనె గొడంబట్టు దదువె రఘటాబంధం

(కన్నడ కందమునకు యతి నియమము లేదు.)

దీని అర్థము- గణనియమ విపర్యాసములతో, మాత్రాసమమైన నియమములతో తాళబద్ధమై యుండునది రఘటాబంధము. కొందఱు రఘట యనగా ర-గణములతో (పంచమాత్రలతో) కూడిన పద్యమని యందురు. కాని రగడలు పంచమాత్రలకు మాత్రమే పరిమితము కాదన్నది మనము గుర్తులో నుంచుకొనవలయును. కన్నడములో రగడలను రగళెగళు అని పిలుతురు. ల-ళలకు డ-కారమునకు నుండు అభేద కారణమున కన్నడ రగళె తెలుగులో రగడ యైనది.

3

సంస్కృతములో తాళబద్ధములై కొన్ని పద్యములు గలవు. ఇవి మాత్రలతో, గణములతో రాజిల్లును. వీనిని వైతాళీయము లందురు. ఈ వైతాళీయములు రగడలకు మూలమని కొందఱి భావన.

రగడ సంస్కృత, ప్రాకృత, దేశి ఛందస్సుల ప్రభావము వలన ఆవిర్భవించినదని నా ఉద్దేశ్యము. ప్రాకృత ఛందస్సుతో బాంధవ్యము జైన కవుల ద్వార వచ్చినదేమో. ద్రావిడ భాషా సాహిత్యమునకు జైన కవులు సలిపిన సేవ యపారము. కవిజనాశ్రయ కర్త కూడ జైను డని కొందఱి తలంపు. చతుర్మాత్రాబద్ధమైన రగడ కాధారము ప్రాకృత ఛందస్సులోని పజ్ఝటికా లేక పద్ధటిక. ప్రాకృతములో దీనికి పద్ధడిఆ అని పేరు. ఇందులో పాదమునకు నాల్గు చతుర్మాత్రలు, చివరి గణము జ- గణమో లేక నలమై ఉండవలయును. అంత్యప్రాస కూడ అవసరము. ఉదాహరణగా క్రింద ఒక పజ్ఝటికా -

పజ్ఝటికా: చ-చ-చ-చ, చివర జ లేక నల, యతి: 1.1, 3.1, ప్రాస: అంత్యప్రాస

గడగడ మను నా కరముల గనంగ
దడదడ మను హృది తాళము వినంగ
సడి యిడు నడుగులు సరసము లవంగ
వడి రా వడి రా వరద విమలాంగ

పంచమాత్రల రగడ ప్రాకృత ఛందమైన మదనావతారముపై ఆధారపడియుండునట్లు తోచుచున్నది. మదనావతారమును ప్రాకృతములో మయణాయవార మని యందురు. పదవ శతాబ్దములో సోమదేవుడు రచించిన సంస్కృత కావ్యమైన యశస్తిలకలో మదనావతారములు చాల గలవు.

మూడు మాత్రల రగడలను ఉత్సాహ రగడ లందురు. ఉత్సాహలో యేడు త్రిమాత్రలు (సూర్య గణములు), చివర ఒక గురువు. ఉత్సాహ యొక్క ఒక్కొక్క పాదము ఎనిమిది త్రిమాత్రలకు సమానము. అంత్య లఘువు లోపమును పాడుటలో సరి చేసికొన వచ్చును.

ఉత్సాహ: సూ-సూ-సూ-సూ-సూ-సూ-సూ-గురువు, యతి: 1.1, 5.1

తురగవల్గనరగడ: సూ-సూ-సూ-సూ-సూ-సూ-సూ-సూ, యతి: 1.1, 5.1, ప్రాస: అంత్యప్రాస

చలికి వణకె చేతు లిచట చలికి కాళ్ళు వణకెరా(మ)
చలికి వణకె పెదవు లిచట చలికి నోరు వణకెరా(మ)
చలికి వణకె నంగము లిట చలికి తనువు వణకెరా(మ)
చలియు యింట చలియు బయట చలికి జగతి వణకెరా(మ)

4

ఆదికవి నన్నయ భట్టు రగడలను గుఱించి తప్పక వినియుండును. కాని అవి బహుశా గ్రామీణములని భారతమువంటి కావ్యములో అట్టి పద్యములకు స్థానము లేదని తలచి యుండవచ్చును. కాని రగడల బోలు మాత్రాబద్ధమైన వృత్తములను నన్నయ భారతములో నైపుణితో వాడెను. క్రింద ఇచ్చిన ఉదాహరణలు ఈ విషయమును నిరూపించును. ఈ పద్యము లన్నియు రగడలకు నమూనాలు.

త్రిమాత్రలతోడి ఉత్సాహను నన్నయ ఉపయోగించెను.

ఉత్సాహ: ఏడు సూర్యగణములు, ఒక గురువు, యతి: 1.1, 5.1

రాజవంశరత్న రాజరాజదేవ నిత్యల-
క్ష్మీజయాభిరామ ధర్మమిత్ర మిత్రవిద్వదం
భోజవనపయోజమిత్ర భూరికీర్తికౌముదీ
రాజితత్రిలోక నిఖిలరాజలోకపూజితా

- ఆదిపర్వము, 1-400 (ఆశ్వాసాంతము)

చతుర్మాత్రలతో క్రింది రెండు పద్యములు

మానిని: భ-భ-భ-భ-భ-భ-భ-గురు, యతి: 1, 7, 13, 19

ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల

నిమ్మగు ఠావుల జొంపములం

బూచిన మంచి యశోకములన్‌ సుర-

పొన్నల బొన్నల గేదగులం

గాచి బెడంగుగ బండిన యా సహ-

కారములం గదళీ తతులం

జూచుచు వీనుల కింపెసగన్‌ విను-

చున్‌ శుకకోకిల సుస్వరముల్‌

- ఆదిపర్వము 4-20

నన్నయ మానినికి ఒక్క యతిని (1, 13) మాత్రమే వాడెను.

కవిరాజవిరాజితము: న-జ-జ-జ-జ-జ-జ-వ, యతి: 1, 8, 14, 20

చనిచని ముందట నాజ్య హవిర్ధృత

సౌరభధూమలతాతతులన్‌

బెనగిన మ్రాకుల కొమ్మలమీద న-

పేత లతాంతములైనను బా-

యని మధుపప్రకరంబుల జూచి జ-

నాధిపుడంత నెఱింగె దపో-

వనమది యల్లదె దివ్యమునీంద్రు ని-

వాసము దానగురంచనెదన్‌

- ఆదిపర్వము 4-21

నన్నయ కవిరాజవిరాజితమునకు కూడ ఒక్క యతినే (1, 14) పాటించెను.

ఈ పద్యములు దుష్యంతమహారాజు కణ్వాశ్రమము సమీపించునపుడు నుడివినవి. నన్నయ ఐదు మాత్రల పద్యములైన లయగ్రాహిని భారతములో నతి సొంపుగ వ్రాసెను.

లయగ్రాహి: భ-జ-స-న-భ-జ-స-న-భ-య, ప్రాసయతి: 1, 9, 17, 25

కమ్మని లతాంతములకుమ్మొనసి వచ్చు మధు-

పమ్ముల సుగీత నినదమ్ము లెసగెం జూ-

తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకు-

ళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా-

లమ్ములగు కోకిలకులమ్ముల రవమ్ము మధు-

రమ్మగుచు విన్చె ననిశమ్ము సుమనోభా-

రమ్ముల నశోక నికరమ్ములును జంపక చ-

యమ్ములును గింశుక వనమ్ములును నొప్పెన్‌


చందన తమాల తరులందు నగరుద్రుమము

లందు గదళీవనములందు లవలీ మా-

కంద తరుషండములయందు ననిమీల దర-

వింద సరసీవనములందు వనరాజీ-

కందళిత పుష్పమకరందరసముం దగులు-

చుం దనువు సౌరభము నొంది జన చిత్తా-

నందముగ బ్రోషితుల డెందములలందురగ

మందమలయానిల మమందగతి వీచెన్‌

- ఆదిపర్వము 5-138,139

ఇది వసంతఋతు వర్ణనము. కొన్ని పద్యముల తఱువాత పాండురాజు భార్యతో సంభోగించి శాపవశాత్తు మరణించును.

మిశ్రగతులతో కూడిన పద్యములు కూడ నన్నయకు తెలియును. మత్తకోకిల ప్రాకృతఛందములో కూడ నున్నది. దాని పేరు చరచరి. విబుధప్రియ దీనికి నామాంతరము. ఆది శంకరులకు కూడ ఈ వృత్తము చంద్రశేఖరాష్టకము ద్వార పరిచితమే.

మత్తకోకిల: ర-స-జ-జ-భ-ర, యతి: 1, 11

ఏను బాండు సుతుండ భీముడ నిద్ధతేజుడ ధర్మరా-
జానుజన్ముడ ద్రౌపదీహృదయప్రియం బొనరింపగా
బూని యిక్కమలాకరంబున బుష్పముల్‌ గొన వచ్చితిన్‌
వీని గొందు నవశ్యమున్‌ సురవీరు లడ్డము వచ్చినన్‌

అరణ్యపర్వము- 3-361.

(భీముడు సౌగంధికాపుష్పమును గొనివచ్చు సందర్భము.)

5

మాత్రాబద్ధమైన పద్యములు, పాటలు పాడుటకు అత్యుత్తమమైనవి. మూడు మాత్రల నడకను త్రిశ్రగతి యందురు. అదే విధముగా నాల్గు మాత్రల నడక చతురశ్రగతి యగును. ఐదు మాత్రల నడక ఖండగతి యనబడును. మూడు-నాల్గు మాత్రలతో మిశ్రితమైన నడక మిశ్రగతి యగును. త్రిశ్రగతికి రూపక తాళము, చతురశ్రగతికి ఏక తాళము, ఖండగతికి జంపె తాళము, మిశ్రగతికి త్రిపుట తాళము వాడుకలో నున్నవి. చతుర్మాత్రలకు అట తాళము, పంచమాత్రలకు ధ్రువ, మఠ్య తాళములు కూడ వాడబడినవి.

రగడలు ద్విపదలు. వీనికి ప్రాస మాత్రమే కాక అంత్యప్రాస కూడ అవసరము. తెలుగులో యతి తప్పక నుండవలెను. అనంతామాత్యుని ఛందోదర్పణములో తెలుగులో తొమ్మిది రకములైన రగడలు చెప్పబడినవి. వివరములు క్రింది పట్టికలో తెలుపుచున్నాను. ఇందులో రగడ పేరు, గణము తీఱు, సంఖ్య, గతి, యతి యొక్క గణము క్రమముగ విశదీకరించబడినవి.

హయప్రచార రగడ - త్రిమాత్రలు నాలుగు, త్రిశ్ర, 1.1, 3.1 తురగవల్గన రగడ - త్రిమాత్రలు ఎనిమిది, త్రిశ్ర, 1.1, 5.1 విజయమంగళ రగడ - త్రిమాత్రలు పదునాఱు, త్రిశ్ర, 1.1, 9.1

మధురగతి రగడ - చతుర్మాత్రలు నాలుగు, చతురస్ర, 1.1, 3.1 హరిగతి రగడ - చతుర్మాత్రలు ఎనిమిది, చతురస్ర, 1.1, 5.1

ద్విరదగతి రగడ - పంచమాత్రలు నాలుగు, ఖండ, 1.1, 3.1 విజయభద్ర రగడ - పంచమాత్రలు ఎనిమిది, ఖండ, 1.1, 5.1

హరిణగతి రగడ - త్రి చతు త్రి చతు, మిశ్ర, 1.1, 3.1 వృషభగతి రగడ - త్రి చతు త్రి చతు త్రి చతు త్రి చతు, మిశ్ర, 1.1, 5.1 హంసగతి రగడ - పం పం త్రి త్రి, మిశ్ర, 1.1, 3.1

కన్నడములో త్రిమాత్రల రగడను ఉత్సాహ రగళె యనియు, చతుర్మాత్రల రగడను మందానిల రగళె యనియు, పంచమాత్రల రగడను లలితగతి రగళె యనియు పిలిచెదరు. వృషభగతి రగడ కన్నడములో భామినీషట్పదిని బోలినది. కన్నడ కవులు రగడలతో కావ్యములనే రచించినారు. బహుశా వారికి సంగీతము బోలు పద్యములన్న ఇష్టమేమో.

ఇవి కాక ప్రాసరహితమైన రగడ మంజుల రగడ యను పేరుతో రాజిల్లుచున్నది. హంసగతి రగడ లాక్షణికులు చెప్పకున్నను త్రిపురాంతకోదాహరణములో ఉపయోగించ బడినది. ఆధునికులు ఆదరించు ముత్యాలసరము వృషభగతి రగడయొక్క ఒక ప్రతిరూపము అన్న సంగతి మఱువరాదు. తెలుగు లాక్షణికులు రగడలను జంతువుల గమనముల ననుసరించి నామకరణము చేసిరి.

యక్షగానములకు రగడలు ఆయువు మఱియు ఊపిరి. వీనిని రేకులు అనుట వాడుక. తాళమును ముందు పెట్టి పేరు పిలుచుట పరిపాటి, ఉదా. త్రిపుట రేకులు, జంపె రేకులు, ఇత్యాదులు. రేకు అను పదము చంద్రరేఖ నుండి వచ్చినదను ఊహ గలదు. అర్ధ రగడలకు అర్ధరేకులని పేరు. వీధినాటకములలో వచ్చు రగడలను దరువు లనెదరు. దరువు ధ్రువా శబ్దమునుండి పుట్టినదని భావన. రేకులు, దరువులు ఈ రెంటిని మార్చి మార్చి వ్యవహరింతురు.

రగడలను పుష్పాచయము, జలక్రీడ, యుద్ధ వర్ణన, నగర, క్షేత్ర వర్ణనలలో కవులు చాల చాకచక్యముతో వాడిరి. పెద్దననుండి పాపరాజు వఱకు రగడలను ప్రాస, అంత్యప్రాసలు మాత్రమే కాక యమక అనుప్రాసలతో కూడ వ్రాసిరి. యక్షగానములలో ఇవి ఒక ప్రత్యేక స్థానమును ఆక్రమించుకొనినవి. ఉదాహరణములను లఘు కావ్యములలో రగడలను కళికలుగా, అర్ధరగడలను ఉత్కళికలుగా కవులు పేర్కొనిరి. ఈ కావ్యములలో ఎనిమిది విభక్తులలోని ఎనిమిది వృత్తములతోబాటు కళికలనబడు ఎనిమిది రగడలు, ఉత్కళికలనబడు ఎనిమిది అర్ధరగడలు ఉండును.

6

త్రిశ్రగతికి చెందిన త్రిమాత్రల రగడలు మూడు. అవి హయప్రచార (నాల్గు గణములు), తురగవల్గన (ఎనిమిది గణములు) మఱియు విజయమంగళ (పదునాఱు గణములు). నేను దీనిని (3, 3, 3, 3) అని పిలువ దలచాను.

ఒక హిమపాతము పిదప నేను వ్రాసినది క్రిందిది.

హయప్రచార రగడ: 3, 3, 3, 3, యతి: 1.1, 3.1

తెల్లగ పడె తిన్నగ పడె
మెల్లగ పడె మృదువుగ పడె
చల్లగ పడె చక్కగ పడె
వెల్లగ హిమ వృష్టియు పడె

పింగళి సూరనామాత్యుని కళాపూర్ణోదయములో రెండవ ఆశ్వాసములో 159వ పద్యము. ఇది ఒక సంగ్రహ రామాయణము. ఇరువది ఎనిమిది పంక్తులు. సామాన్యముగా రగడలలో ఎక్కువ పంక్తులు ఉండును. దీనిని కడవకము అందురు.

తురగవల్గన రగడ: (3,3,3,3) (3,3,3,3), యతి: 1.1, 5.1

దశరథావనీశ విమలతర తపఃఫలావతార
నిశిత శర లఘు ప్రయోగ నిహత తాటకా విహార
కపట పటు సుబాహు దశన ఘటిత గాధిసూను యాగ
అపరిమేయ గౌతమాంగనాఘ దమన పద పరాగ
కోమలేక్షు దళన సదృశ ఘోర శంభు చాప భంగ
భూమిజా వివాహ విభవ పూర్ణ సమ్మదాంతరంగ
పరశురామ గర్వ పవన పాప పీన బాహు నాగ
గురు వచోఽనుపాల నాతి కుతుక విధుత రాజ్యభోగ
పాద భజన వితరణాతి ఫలిత గుహ సమస్త పుణ్య
పాదుకా ప్రదాన విహిత భరత సౌహృదానుగుణ్య
ఘన విరాధ మద వినాశ కలిత బహు విప న్నిరాస
వినుత పద నివేశ పూత వివిధ మౌని కుల నివాస
తత నిశాచరీ విరూపతా కృత ప్రియా వినోద
అతుల బల ఖరాది దనుజ హనన జనిత విబుధ మోద
హరిణ రూప ధారి దారు ణాసు రాసు హరణ బాణ
పరమ ఘోర బాహుబల కబంధ మర్దన ప్రవీణ
అమల శబరికా ఫలోపహార రుచి ఘనాభిముఖ్య
సమద వాలి దర్ప దమన సఫలితార్క తనయ సఖ్య
శరణ వరణ పర పరానుజ ప్రదీపిత ప్రసాద
అరుణితాక్షి కోణ విరచితాంబురాశి గర్వ సాద
పర్వతౌఘ రచిత సేతు బంధ సుతర సింధు కాండ
గర్వ పంక్తికంఠ కంఠ ఖండన ప్రచండ కాండ
సకల దివిజ నుత చరిత్ర సాధు భవ లతా లవిత్ర
సకరుణా తరంగ నేత్ర జానకీ మనోజ్ఞ గాత్ర
యతి జపార్హ పుణ్య నామ యతి వితీర్ణ భక్త కామ
సతత సిత యశోఽభిరామ సర్వలోక పూర్ణ ధామ
అహిత విదళ నాతి రౌద్ర యార్త పాలనా వినిద్ర
మహిత నిఖిల గుణ సముద్ర మమ్ము బ్రోవు రామభద్ర

నా వద్ద నున్న యక్షగానములలో త్రిశ్రగతి ఉన్న దరువులు గాని, రేకులు గాని లేవు. వేఱొక పుస్తకములో నుదహరించబడినది క్రింద ఇచ్చుచున్నాను.

కంకంటి పాపరాజు విష్ణుమాయావిలాసము నుండి-

తురగవల్గనము: (3,3,3,3) (3,3,3,3), యతి: 1.1, 5.1

జాఱు కొప్పు జూచి యొకడు జంకెనలకు బ్రమసి యొకడు
ఓర జూపు జూచి యొకడు తార తీరు జూచి యొకడు

తాళ్ళపాక పెదతిరుమలయ్య యొక్క శ్రీ వేంకటేశ్వర ఉదాహరణము నుండి-

షష్ఠీ విభక్తి తురగవల్గన రగడ కళిక-

మఱియు నెఱియు మంత్ర తంత్ర మర్మ ధర్మ కీలకునకు
చిఱుత యుఱుత భక్తి శక్తి జెలగి మెలగు పాలకునకు
సోమధామ నూత్న రత్న సుకర మకర కుండలునకు
సామభూమగానమాన సక్త భక్త మండలునకు
బంతి గొంతి తనుజు ననుజు బండి నుండు మాధవునకు
జంతయింతి గంద మంది చక్కనొక్కు భూధవునకు
రాజితాజి కుంభి కుంభ రక్తసిక్త భీకరునకు
భోజరాజ పుత్రి మైత్రి బొదలి మొదలు శ్రీకరునకు

ఉత్కళిక (కళికలో సగము)

భువనసువన ఫలము లలమి
జవనపవన బలము కలిమి
యెదలు పొదల మరగి తిరిగి
చదల తుదల కరిగి పెరిగి
పేపుమాపు మించి పొంచి
రూపు చూపి సంచరించు
యోగరాగ కీరమునకు
యాగభాగ సారమునకు

కళికలో ఎనిమిది పాదాంతములలో విభక్తి (ఇక్కడ షష్ఠీ విభక్తి) ఉండవలయును. ఉత్కళికలో చివరి రెండు పాదములలో మాత్రమే ఉండవలయును. కళిక ఎప్పుడు మఱియు, వెండియు ఇత్యాది పదములతో ఆరంభ మగును.

7

చతురశ్ర గతి యున్న పాటలను పద్యములను విననివారు లేరు అని చెప్పుటలో అతిశయోక్తి లేదు. ఈ గతికి ఏక తాళము సరిపోవును. క్రింద కొన్ని సంక్షిప్తమైన ఉదాహరణలను ఇచ్చుచున్నాను. ఈ గతిని నేను (4, 4, 4, 4) అని పిలువ దలచాను. నాల్గు చతుర్మాత్రలతో నుండు రగడ మధురగతి రగడ, ఎనిమిది చతుర్మాత్రలతో నుండునది హరిగతి రగడ. ఉపయోగించు గణములు- న-ల, భ, స, గ- గములు. జ-గణమును సామాన్యముగ నుపయోగించరు.

జ్ఞాని మాత్రమే కాక గొప్ప కవి కూడ యైన ఆది శంకరుల భజగోవిందస్తోత్రము నుండి-

దిన-యామిన్యౌ సాయంప్రాతః
శిశిర-వసంతౌ పునరాయాతః
కాలః క్రీడతి గత్యచ్ఛాయుః
తదపి న ముంచత్యాశావాయుః

మాత్రాబద్ధ కవిత్వపు మధుర సృష్టికర్త యైన జయదేవుని గీతగోవిందము నుండి వసంత ఋతు వర్ణన-

లలిత-లవంగ-లతా పరిశీలన

కోమల మలయ సమీరే

మధుకర-నికర కరంబిత కోకిల

కూజిత కుంజ కుటీరే

విహరతి హరి రిహ

సరస వసంతే నృత్యతి

యువతి-జనేన సమం సఖి

విరహి-జనస్య దురంతే

వల్లభాచార్యుల మధురాష్టకము మధురగతి రగడ లక్షణములతో శోభిల్లుచున్నది. సంస్కృతములో యతి లేదు.

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే రఖిలం మధురం

భద్రాచల రామదాసు యొక్క క్రింది కీర్తన గణయతివిరాజితమై యున్నది.

ఏ తీరున నను దయ జూచెదవో
ఇన వంశోత్తమ రామా
నా తరమా భవసాగర మీదగ
నళిన దళేక్షణ రామా

శ్రీ రఘునందన సీతారమణా
శ్రిత-జన-పోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను
కన్నది కానుపు రామా

అభినవకవితాసార్వభౌముడైన శ్రీరంగం శ్రీనివాస రావు మహాప్రస్థానము నుండి ఒక వజ్రపు తునక క్రిందిది. జ-గణమును శ్రీ శ్రీ చాకచక్యముగా నుపయోగించెను.

ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన
సోమరులారా చావండి
నెత్తురు మండే శక్తులు నిండే
సైనికులారా రారాండి

మల్లీశ్వరి చిత్రము నుండి దేవులపల్లి కృష్ణ శాస్త్రి పాట నుండి ఒక భాగము-

కొమ్మల గువ్వలు గుసగుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసు రనినా
అలలు కొలనులో గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా ....

క్రింద హిమపాతముపై వ్రాసిన రెండు మధురగతి రగడలు. రెండవ పద్యమునకు మణిగణనికరపు లక్షణములు కూడ గలవు.

మధురగతి రగడ: చ, చ, చ, చ, యతి: 1.1, 3.1

ఎక్కడ జూచిన హిమముల మ్రుగ్గులు
చక్కని మ్రుగ్గులు చల్లని మ్రుగ్గులు
చుక్కల మ్రుగ్గులు సొబగుల మ్రుగ్గులు
దిక్కుల దిక్కుల తెలి నును మ్రుగ్గులు

మణిగణనికరము: న-న-న-న-స, యతి: 1, 9

మనసున వినబడె మధురపు పదముల్‌
కనులకు గనబడె కరుగని ముదముల్‌
తనరెడు స్మితమయ ధవళ కుసుమముల్‌
మణిగణనికరమె మహి పయి హిమముల్‌

శేషము వేంకటపతి వ్రాసిన శశాంకవిజయము నందలి ద్వితీయాశ్వాసములోని 118వ పద్యము. ఇందులో యమకములను గమనించ ప్రార్థన.

మధురగతి రగడ: 4, 4, 4, , యతి: 1.1, 3.1

వెలసె వనాంతర వీధి వసంతము
కలిగె జగంబుల గనక వసంతము
జిలిబిలి యలరుల జిమ్మె లతాంతము
సొలవున మీఱె నశోక లతాంతము
మురువుగ బొన్నల మొగ్గలు పుట్టెను
సరసిజముల మధుసారము పుట్టెను
కరకరి గంతుడు కైదువు బట్టెను
విరహిణులకు మది వెత జూపట్టెను
భుగభుగమని సురపొన్నలు విచ్చెను
మగనికి జెలి కమ్మని మోవిచ్చెను
పొగడ మొగడలకు బుట్టెను దావులు
తగె విట సంకేతమ్ముల తావులు
భసల విసరములు బారులు తీరెను
మసలక పికముల మౌనము దీరెను
కనుగొనవే శృంగారపు వనములు
మన మలరించునె మన జవ్వనములు
పొలిచె మహీజంబులు సదళంబులు
తులకించెను గంతు నిషు దళంబులు
కననీయ నిదే కైకొను మరువము
వనితా యిచ్చితివా నిను మరువము
మెలతొరొ నావి సుమీ విరవాదులు
వలదే నాతో వలవని వాదులు
కలికీ యిచ్చట కంతును కైదువ
నలికీ నరుగగ నచ్చటికై దువ
తగ బూచెగదే స్థల నీ రజములు
దిగులొందించె బథిని నీరజములు
పువ్వులు గలవట పోదమె దవులకు
నవ్వుచు జవ్వని నను వెను దవులకు
ఇంతి యెక్కడివె యీ కోరకములు
చెంతను నుండిచ్చెద కోరకములు
కానుక తర మిక్కడి కేసరములు
నేనియ్యనటే నీకే సరములు
చెలి మును నే జూచితినే కొమ్మలు
బళి న్యాయము జెప్పరె యా కొమ్మలు
నాతి ప్రేంకణము నగె నీ పాటల
చేతి కబ్బె నిదె చేకొను పాటల
తోయజలోచన దొరకెను దవనము
వేయీడకు రావే మీద వనము
మోవి గంటినా ముద్దుల గులుకదె
మోవి గంటి నా ముద్దుల గులుకదె
విటపాళుల నీ వేనలి బెట్టుదు
విటపాళుల నీవే నలి బెట్టుదు
ననిచిన గోరంటను జెలి మెచ్చవు
ననిచిన గో రంటను జెలి మెచ్చవు
అని వనితామణు లాడగ బాడగ
ఘనమగు తమి మొగ్గలు గిలు పాడగ
నలు నగు నబలల నారామంబుల
నళికుల యుతముల నారామంబుల
పాటీర నగోపరి హరిచందన
వాటీ వేల్లిత వల్లీ స్పందన
పటిమ చెలంగుచు బాండ్య వధూటీ
చటులోపరి రత సంభ్రమ ధాటీ
విలులిత సురభిళ వేణీ చాలన
లలిత సుపరిమళ లహరీ ఖేలన
సరణిని బొదలుచు జల్లగ గదలుచు
విరులను గురియుచు విరహుల నొరయుచు
గమలము లంటుచు గలువల నొంటుచు
స్తిమితత గులుకుచు దేనెల చిలుకుచు
నలసత దూలుచు నళి తతి దోలుచు
మలసె నుదారము మలయ సమీరము

అహోబిల కవి రచించిన గరుడాచల యక్షగానము నుండి ఒక ప్రార్థన-

భావము లోపల దేవిని యమృతపు
తావిని మది సిరిదేవి నుతింతున్‌
అతులితముగ మునితతులను బ్రోచిన
చతురుని గౌరీపతిని భజింతున్‌
ఏణాక్షిని మృదుపాణిని పద్మజు
రాణిని చక్కని వాణి దలంతున్‌
పాయక నవమతి సేయక మునిబల
దాయకుడైన వినాయకు గొలుతున్‌
ప్రవిమల సద్గుణ భావోన్నతులను
గవులను యాదిమ కవుల నుతింతున్‌

మదురై కామరాజ విశ్వవిద్యాలయములో ఒకప్పుడు నా సహోద్యోగియైన ఆచార్య తిమ్మావజ్ఝల కోదండరామయ్య గారి అన్నమయ్య ఉదాహరణము నుండి చతుర్థీ విభక్తిలో వ్రాసిన కళిక మఱియు ఉత్కళికలు. ఒక రెండు చోటులలో గణభంగమైనది, ముద్రణ పొఱపాటేమో.

కళిక (హరిగతి రగడ)

మఱియును గర్ణాటక సంగీత స-

మాగమ శుభఘటికా సూచనుకై

తిరువేంకటపతి తిరుపదముల గతి

తెలిసితి నను వరమతి లోచనుకై

శ్రీయలమేల్మంగాసతి జనకత

జెలువగు వేంకటపతి శ్వశురునకై

పాయనియనురాగమున రాగమున

బాడెడు గాయక కవి గురువునకై

పెదతిరుమలకవి పేర గవిని గని

పేర్మి జెందు బంగారు కడుపుకై

సదమల కృతిచిత్రముల నాదకవి

జరపినట్టి రంగారు నిడుపుకై

కుల మెల్లను గవులును గాయకులను

గొప్ప జెప్పికొన నొప్పిన గురుకై

కలకాలము దన తనువు మనువు కృతి-

కన్య కలనమున జరపిన వరుకై

ఉత్కళిక (కళికలో సగము)

ఇల సిద్ధులు సాధ్యులు గుమి గూడగ
నల రంభాద్యప్సరసలు నాడగ
నారద తుంబురు నాదకళా భజ-
నారతు లెల్ల రనారతమును నిజ
నాదకళల నిడి నయమున గొలువగ
వేదసమాన కవిత్వమునను జగ
మెల్ల నుతింపగ బాడిన కృతికై
సల్లలితోక్తి విశారదమతికై

8

ఈ రోజు పంచమాత్రాబద్ధమైన రగడ వంటి పద్యములను, పాటలను, రగడలను, రేకులను, ఉదాహరణములను పరిచయము చేయుచున్నాను. సందేశము పూర్ణముగా చదివి ఆనందించెదరని భావించుచున్నాను.

మహాకవి కాళిదాసు యొక్క శ్యామలా దండకము అందరికి పరిచితమే. దండకములను యెన్నియో విధములుగా వ్రాయ వీలగును. కాని చాల దండకములలో ర-గణమో లేక త-గణమో వరుసగా వ్రాయుట పరిపాటి. ఈ ర- గణ, త-గణ దండకములు పంచమాత్రాబద్ధమైనవి. ఇవి సామాన్యముగా ఏకపాదులు. అనగా దండకమంతయు ఒకే పాదము. ఇందులో యమకములు, అనుప్రాసలు ఎక్కువగా నుండును. తెలుగులో మొట్టమొదటి దండకము నన్నయభట్టు భారతపు అరణ్యపర్వములో చదువ వీలగును. ఇది శ్రీకంఠ లోకేశ... (అరణ్య 1.324) పంచ మాత్రల పద్యములైన లయగ్రాహి వంటి పద్యములను కవులు ప్రత్యేక నైపుణ్యముతో వ్రాసిరి. పంచ మాత్రల గతి ఖండగతి, తాళము సామాన్యముగా ఝంపె (జంపె) తాళము. యక్షగానములలో వీనిని జంపెరేకు లందురు.

లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతము నుండి రెండు పద్యములు-

శశిశోభా: న-న-న-న-న-గగ, యతి: 1, 11

కర-కమల-దల-దలిత-లలితతర-వంశీ
కల-నినద-గల-దమృత-ఘన-సరసి దేవే
సహజ-రస-భర-భరిత-దర-హసిత-వీథీ
సతత-వహ-దధర-మణి-మధురిమణి లీయే (1.52)

(శశిశోభను త్వరితగతి లేక పాలాశదళమని కూడ యందురు)

(లలిత కరాంగుళీ దళద-

ళ న్మురళీ మధురస్వరామృతో

జ్వల సరసిన్‌ మనోజ్ఞ సహ-

జస్మిత కందళ చంద్ర చంద్రికా

వలదరుణాధరోష్ఠ మధు

వాసిత చారు ముఖాంబుజంబునన్‌

దొలగక నాదు మానస మ-

ధువ్రత మియ్యెడ లీన మయ్యెడిన్‌

- వెలగపూడి వెంగనామాత్యుని తెలుగు సేత)

స్రగ్విణీ: ర-ర-ర-ర, యతి: 1, 7

అంగనా మంగనా మంతరే మాధవో
మాధవం మాధవం చాఽంతరే నాంగనా
ఇత్థ మాకల్పితే మండలే మధ్యగః
సంజగౌ వేణునా దేవకీనందనః (2.37)


(ఇరుదెస దాను నిల్చి తన

కింతులు పార్శ్వముల వసింపగా

గరములు గంఠపాళి జెల-

గన్‌ బలభిన్మణి విద్రుమంబులన్‌

సర మొనరించినట్లు సర-

సస్థితి మండల మధ్యవర్తియై

మురళిరవంబునం జెలగు

మోహన మూర్తి మురారి గొల్చెదన్‌

- వెలగపూడి వెంగనామాత్యుని తెలుగు సేత)

జయదేవుని గీతగోవిందములోని నాకు అతి ప్రియమైన పందొమ్మిదవ అష్టపది నుండి-

త్వ మసి మమ భూషణం త్వ మసి మమ జీవనం
త్వ మసి మమ భవజలధి రత్నం
భవతు భవ తీహ మయి సతత మనురోధినీ
తత్ర మమ హృదయ మతి యత్నం

ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే
ముంచ మయి మాన మనిదానం
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి ముఖ కమల మధు పానం

తెలుగు కావ్యములు శ్రీకారముతో నారంభమై, మంగళమహాశ్రీతో నంతమగును. మంగళమహాశ్రీని చివరి పద్యముగా అమలులో తెచ్చినది నన్నెచోడ మహాకవి. క్రింది జోలపాట విశ్వనాథ సత్యనారాయణ వారి శ్రీరామాయణకల్పవృక్షము నుండి- అవతార ఖండము- 299

మంగళమహాశ్రీ: భ-జ-స-న-భ-జ-స-న-గగ, యతి: 1, 9, 17

పొత్తులను నందములు

బొత్తులిడినట్టి గొల-

పొత్తివలె నొత్తిగిలు జోజో

గుత్తులుగ బ్రాకిచని

కొత్తళము వ్రేలు సరి

క్రొత్తలగు ద్రాక్షవగు సామీ

చిత్తునకు సత్తునకు

జిత్తులగు బోకులగు

జిత్తు లమరించగల సామీ

ఒత్తిగిలి పండుకొను

ముత్తకలి యేడుపుల

నొత్తుగను నెత్తకుము జోజో

పంచమాత్రలతో శోభిల్లుచుండు నండూరి వారి ఒక యెంకి పాట-

కలలోన నా యెంకి కతలు సెపుతున్నాది
వులికులికి పడుకుంట వూకొట్టుతున్నాను
కతలోని మనసల్లె కాసింతలో మారి
కనికట్టు పనులతో కత నడుపుతున్నాది
రెక్కలతో పైకెగిరి సుక్కల్లె దిగుతాది
కొత్త పువ్వుల కులుకు కొత్త మెరుపుల తళుకు
తెలివి రానీయకే కల కరిగి పోతాది
ఒక్క నేనే నీకు పెక్కు నీవులు నాకు
లేపకే నా యెంకి లేపకే నిదర
ఈపాటి సుకము నే నింతవర కెరుగనే

క్రింది రెండు పద్యములు నావి.

ద్విరదగతి రగడ: పం, పం, పం, పం (1.1, 3.1)

ఎన్ని రూపమ్ములో యీ స్ఫటిక హిమములకు
నన్ని స్ఫటికములలో నంభస్సె హిమములకు
కన్నెలు రచించెడు సొగసులీను మ్రుగ్గులో
కన్నియ ప్రకృతి చూపు కడు సొగసు నిగ్గులో

(Sidebar: Ice crystals are indeed remarkable. Their morphology is hexagonal in shape. But they display a remarkable variety of different patterns, yet remaining basically hexagonal. They are all made up of water. There is a very good book entitled "Snow Crystals" by Bentley and Humphreys with more than 2000 individual photographs of snow crystals. Dover has published this. Some of the photographs look like our ముగ్గులు.)

గజరాజ: స-జ-భ-భ-స యతి: 1, 8

ద్విరదగతిరగడ: పం, పం, పం, పం (1.1, 3.1)

గజరాజు పిల్చె నిన్‌ గళ మెత్తి హరిహరీ
త్రిజగాన నీవె యీ ద్విరదంపు గతి హరీ
భుజియించ గోరె యీ బుసగొట్టు మొసలి నన్‌
భజియింతు గావుమా పరమాత్మ యమలినా

(గజరాజ వృత్తమునకు ద్విరదగతి రగడకు గల నామ సామ్యమును గమనించ ప్రార్థన.)

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి శృంగారశాకుంతలము నుండి యుద్ధ వర్ణన- మూడవ ఆశ్వాసములో 226వ పద్యము.

లలిత హృదయము తివిరి లంఘించు నరదములు
కులగిరుల నైన డీకొను మద ద్విరదములు
తెరలి యురువడి గాలి దెగబాఱు వాజులును
సురరాజు సరివచ్చు చుట్టంపు రాజులును
దివిజ గురుతోడ నుద్దికి వచ్చమాత్యులును
దవిలి సేవించు తాతల నాటి భృత్యులును
జాఱు గలుగక నిల్చు సంధి సౌజన్యులును
వేఱొకింతయు లేని విశ్వాస మాన్యులును
సమర సమ దుఃఖులగు సత్కృపాపాత్రులును
జెమట నెత్తురు గాగ సేవించు మిత్రులును
వేటాఱు తునుకలుగ వేయగల సాదులును
సూటి దప్పక యేయు చొక్కంపు జోదులును
కోరి గిరవులు వెట్టి కొలుచు జగతీపతులు
పోరులకు ముఖరులై పొలుచు సేనాపతులు
తొలు పోటు కయ్యమున దొడరు నాసీరులును
బలిమిమై జమునైన బఱచు భటవీరులును
కలహ విక్రమ కళాకలితులగు సాయకులు
నలఘు బలసంపన్నులగు లెంక నాయకులు
నసి చర్మ సంగర సహాయులగు పారకులు
నసమ శాత్రవ జయ సమర్థులగు దారకులు
కొండ లగ్గల సరకు గొనని పేరాయులును
దండి వన దుర్గ భేదకు లయిన కోయలును
మఱియు గణ ముఖ్యులగు మల్లరుల యొంటరులు
నెఱ బిరుదు శూరులును నెన కెనయు గెంటరులు
వీరాదిగా గల్గు వీర పరివారంబు
చారు రుచి నొప్పారు సమర శృంగారంబు
నల్ల జల్లెడలతో నడ కారడవి భంగి
బల్లి గట్లం గడల ప్రభల మ్రింగగ నింగి
పునికి సింగంబునకు బుట్టు వొందిన కరణి
బలుపు తెంపును గల్గు భటుల బింకపు సరణి
మొనసి గుబ్బల కేడెముల ఘంటికలు మ్రోయ
మొనలు ముందట సబళముల సాదనలు సేయ
సరిగె బిళ్ళల తాకు నశని ఘోషము దొరయ
దిరువులో నడిదముల్‌ ద్రిప్పి యొండొరు మొరయ
కోలతో విల్లు దెగగొని ఱిత్త పేరెములు
కాలు కొలదియు బఱచు కదన ప్రకారములు
పొడవెగురవైన నప్పుడ వచ్చు కుంతములు
తడయ కొరపుగ బట్టి తగ నిచ్చు పంతములు
వెలయు బొమిడికములును వెనుక పమ్ముల జోళ్ళు
నలమికొన నొకడు పదురై తోచు పడవాళ్ళు
మొనలు చక్కగ దీర్చి ముఖరులై నడపింప
ఘన వాద్య నాదముగ ఘన ఘంట పూరింప
మెండుకొని కడిమి భూమీజనంబుల చూడ్కి
నిండు సేనా సమితి నేల యీనిన మాడ్కి
నహితులకు గుండె లల్లాడంగ నంతంత
మహిత సైన్యము విడిసె మాలినీ నది పొంత

కందుకూరి రుద్రయ కవి యొక్క సుగ్రీవవిజయ యక్షగానము నుండి రెండు జంపె రేకులు-

భుజవినిర్జిత తాల బుధవిహంగ రసాల
రజనీచరాలీల రామ భూపాల
దివిజనార్చనలోల తేజోబలాలీల
రవివంశ సంశీల రామభూపాల
సమరాగ్ర జయశీల శత్రుజన వాతూల
రమణీయ గుణజాల రామభూపాల

అరిభయంకర రామ అమిత గుణ సంసీమ
కరుణాభిరామ శ్రీ కాకుత్స్థ రామ
రవి కులాంబుధి సోమ రాజకుల సుత్రామ
రవికోటిసమ ధామ రామాభిరామ

విశాఖపట్టణములో నివసించిన బుర్రా కమలా దేవి సామగానప్రియోదాహరణము నుండి -

సంబోధనా ప్రథమా విభక్తి ద్విరదగతి రగడ కళిక-

మఱియు భూపాలోక్త మంగళోదయ కాంతి
అఱుము సింహేంద్ర మధ్యమ విరాజిత కాంత
పాలితాబ్జ ముఖారి బ్రహ్మ మానస హారి
ప్రాలేయ వకుళాభరణ సురాగాధారి
రత్నాంగి కనకాంగి రమ్య శంఖ సితాంగి
ప్రత్నాయ విభవాంగి సర్వవిధా సరసాంగి
చేతోన్మితస్ఫీత శృంగార పరిపూత
గీతప్రియాఖ్యాత కృతివిభాసిత మాత

ఉత్కళిక (కళికలో సగము)-

వర సైంధవిన్‌ గొల్వ
ధర వనస్పతి నిల్వ
నడ స్వరావళి దెల్ప
విడి సభామణి దాల్ప
సరి ద్విజావతి రాగ
స్వరము నాగరి దేగ
కిరణావళుల రాణి
త్వరను రాగదె వాణి

పై ఉదాహరణము నాకు చాల ఇష్టము. ఇందులో రాగముల పేరులను గమనించ మనవి. వీలున్నప్పుడు ఇరువదిఎనిమిది పద్యములను సభకు పరిచయము చేసెదను.

9

మిశ్రగతికి చెందిన రెండు రగడలు హరిణగతి మఱియు వృషభగతి రగడలు.

హరిణగతికి మాత్రలు త్రి-చ-త్రి-చ.

వృషభగతికి త్రి-చ-త్రి-చ-త్రి-చ-త్రి-చ అనగా హరిణగతికి రెట్టింపు.

ఈ రగడలకు మూలము కన్నడములోని భామినీషట్పది. భామినీషట్పదికి గణములు త్రి-చ-త్రి-చ-త్రి- చ-త్రి-చ త్రి-చ-త్రి-చ-త్రి-చ-గ.

మొదటి మూడు పాదముల లక్షణములే చివరి మూడు పాదములకు కూడ.

వృత్తములలో మత్తకోకిల, ధ్రువకోకిల, కరిభృంహితము, తురగవల్గితములకు గణములు త్రి-చ- త్రి-చ-త్రి-చ-త్రి-గ.

మత్తకోకిలను చర్చరి అందురు. ఇది బహుశా ప్రాకృత ఛందస్సు నుండి వచ్చినట్లున్నది. త్రిమాత్ర, చతుర్మాత్రల కూడికను సప్తమాత్రాదళము అని కూడ అందురు. వృషభగతి రగడలోని ఎనిమిది దళములలో చివరిదానిని వదలినచో మనకు త్రిపుటరేకు లభించును.

రూపగోస్వామి యొక్క ముకుందముక్తావళి నుండి ఒక పద్యము-

చర్చరీ (మత్తకోకిల)-

పర్వ వర్తుల శార్వరీపతి గర్వ రీతి హరాననం
నందనందన మిందిరాకృత వందనం ధృత చందనం
సుందరీ రన్మందిరీకృత కంధరం ధృత మందరం
కుండల ద్యుతి మండల ప్లుత కంధరం భజ సుందరం

జయదేవుని గీతగోవిందము నుండి ఏడవ అష్టపది-

మా మియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన
సాపరాధతయా మయాఽపి న వారితాఽతి భయేన
(హరిహరి హతాదరతయా సా గతా కుపితేవ)

కిం కరిష్యతి కిం వదిష్యతి సా చిరం విరహేణ
కిం ధనేన జనేన కిం మమ జీవితేన గృహేణ

త్రి-చ-త్రి-చ నడక హరిణ-, వృషభ-గతి రగడల ప్రత్యేకత. ఈ గమనము మఱొక పేరుతో ఆధునిక కవుల ఆదరణపాత్రమైనది. పుల్లమ్మ ప్రఫుల్ల యైనటుల ఎద్దు నడక ముత్యాలసరము ఐనది.

గురజాడ అప్పారావు దేశభక్తి నుండి-

దేశమును ప్రేమించు మన్నా
మంచి యన్నది పెంచు మన్నా
వట్టి మాటలు కట్టి పెట్టోయ్‌
గట్టి మేల్‌ తల పెట్టవోయ్‌

కృష్ణ శాస్త్రి రచించిన మహాకవి (గురజాడ అప్పారావు)-

గుత్తునా యని జాతి ముత్యాల్‌
గుచ్చినాడే మేలి సరముల
ఇత్తునా యని తెలుగు దల్లికి
ఇచ్చినాడే భక్తితో

నవ వసంతము నవ్య వనరమ
మావి కొమ్మల గమ్మ చివురులు
పాట పాడెడి పరభృతంబును
ఎవ్వరాపుదురో

పొడుపుమల వయి రంగవల్లిక
మింటి నడుమ బ్రచండ తేజము
సంజ మబ్బుల పైని కెంపులు
చూడకుంటిరిగా

రంగవల్లిక మాయమయ్యెను
చండ తేజము మాసి పోయెను
సందె కెంపులు సాగిపోయెను
వెదకుచున్నారా

కారు చీకటి గ్రమ్మినప్పుడె
చదల మబ్బులు కప్పినప్పుడె
మిణుగు రైనను మెరయ నప్పుడె
వెదకుచున్నారా

చుక్కలన్నియు సొక్కి సోలెను
గిరులు కదలెను తిరుగ బాడెను
లోకమోహన మధుర గానా-
స్వాద మోదమున

యుగయుగంబులనుండి మ్రోగెడు
విశ్వగాన వియత్తరంగిణి
భంగముల నుప్పొంగు నాతని
గీత శీకరముల్‌

పాట పాడిన పరభృతంబును
మూగవోయిన ముద్దు కోయిల
జిన్ని పికములు చిఱుత పాటలు
బిలుచుచున్నవియా

హిమపాతము పిదప నేను వ్రాసిన హరిణగతి రగడ: త్రి-చ- త్రి-చ యతి (1.1, 3.1)

హిమము కురిసెడు ఋతువు యిప్పుడు
సుమము విరియదు చూడ నిప్పుడు
ద్యుమణి వేడియు దూర మిప్పుడు
ద్రుమములకు పెడ రూప మిప్పుడు

నంది తిమ్మన పారిజాతాపహరణము నుండి- 4.16

వృషభగతి రగడ-

కొమ్మ వేగిర మేటికే కొనగోర గోరట విరులు గిల్లుము
తమ్మిపువ్వులమీద జలములదార తారక యుండ జల్లుము
మృగవిలోచన మేను చుఱుకన మేలమే లత నిటులు వ్రేయగ
వగవ నేటికి జూడుమీ గొరువంకవంక బ్రియుండు డాయగ
నలుగ నేటికి ముడువుమీ చెలువార వారణయాన మొల్లలు
పొలతి సైపవు మాకు నీకయ పోలుబో లులివడినకల్లలు
పన్నిదంబిడ బ్రేంకనమునన బాడి పాడి దొఱంగి తెచ్చితి
పొన్నమొగ్గల గంటసరి పూబోడి పోడిమిగాగ గ్రుచ్చితి
వడుగ నేటికి దీని విరులు దురాశ రా శఫరీవిలోచన
జడ బరాగము నిండె దుడువు రసాలసాలమరందసేచన
జామరో సురపొన్నలకు నీచాయ జాయల బల్క నేటికి
భామ కోయకు వేగపడి పూబాళ బాళము గాదు నేటికి
మగువ పలుమఱు దిగిచి చూచుట మానుమా నులివడియె దండలు
మగిడి చను డిక నేల యీయెలమావి మావి హరించు దండలు
పలుకకుము తుచ్ఛములు పలుమఱు బాల బాలకి యన్న దిట్టితి
వలసగమనము జూపి చెలి నీ వంచ వంచన సేసి పట్టితి
తావి బుగులుగొనంగ దొడగె ఘృతాచి తాచితె యీ యశోకము
రావె తేనియ కంచు బలికెదు రంభ రంభలలో ననేకము
ననలు వేడిన మొఱగి తప్పుడు నాలి నాలికుచంబు ముట్టకు
మెనయు ప్రాణపదంబుగా దల తీవ తీవ తలంగ మెట్టకు
మంజుఘోష సువర్ణలత లనుమానమా నందనవనంబున
నంజ దిది యెలదేటి కన నే మఱచె మఱచెదమే మనంబున
నమృతమధురములైన ఫలరసమాని మానిని త్రుళ్ళె శుకములు
గుమురులగు లేమావిచిగురులు గోయ గోయని కూసె బికములు
గుమగుమని వాసనల గేదకికొమ్మ కొమ్మకు నందె దోటికి
రమణి గొజ్జగిపొదలు గడు దూరమ్ము రమ్ము చలమ్ము లేటికి

(ప్రతి పాదములోని ద్వితీయార్ధములో ఛేకానుప్రాసము గలదు.)

కందుకూరి రుద్రకవి సుగ్రీవవిజయ యక్షగానము నుండి ఒక త్రిపుటరేకు.

వృషభగతిరగడలో ఎనిమిది సప్తమాత్రాదళములు గలవు. అందులో చివరి సప్త మాత్రాదళమును వదలిన యెడల మనకు త్రిపుటరేకు లభించును.

(రామలక్ష్మణులు కిష్కింధను సమీపించుచుండగా వారిని జూచి సుగ్రీవుడు వారిని వాలి పంపెనేమో అని సందేహించగా, హనుమంతుడు తాను కనుగొని వచ్చెద నని సుగ్రీవునితో చెప్పు సందర్భము.)

కపికులోత్తమ నాకు జూడగ గపటవేషము గానరాదిది
విపులపుణ్యుల బాపమతు లని వెఱవనేలా
ఏల యిచటికి వచ్చిరొ వీరెవ్వరో యీ రూపవంతులు
చాల పరిశోధించి చూతము జడియవలదు
రాజవంశ్యులు రాజతేజులు రాజపురుషులు రాజవీర్యులు
రాజసంబున నిటకు నేమిట రాగతంబో
ఈ మనోహర రూపవైఖరు లిట్టి తేజము గలుగువారికి
భూమి నెటువలె దుష్టగుణములు వొడమునయ్యా
ఏను నచటికి బోయి వారల పూనికంతయు దెలిసి వచ్చెద
భానునందన వెఱవ నేటికి బంపు నన్ను
నేర్పునను జని వారి రాకయు నియతవృత్తియు నిజము గల్లయు
నేర్పరించెద నుండు మిచ్చట నినతనూజా

చిత్రకవి పెద్దన యొక్క హనుమోదాహరణము నుండి-

ప్రథమావిభక్తి కళిక (వృషభగతి రగడ)-

మఱియు దశరథరాజనందన మంజు పాద సరోజ భృంగము
కఱకుటసుర లనియెడు మద గజ ఘటల బొరిగొను కొదమ సింగము
బలిమి గరుడునితోడ నేరెడు బంటికై పెనగిన యుదారుడు
చెలగి యక్షుని బట్టి చట్టలు చీరివైచిన సమర శూరుడు
దాసులకు ముంగొంగు పసిడి విధమున వెలసిన యార్తిబంధుడు
వాసవాది సమస్త నిర్జర వర్ణితామిత సుగుణ సింధుడు
ఎగిరి జలనిధి దాటి లంకిణి నేపు మాపిన విక్రమోగ్రుడు
పగడముల జిగి దెగడు మొగమున బరగుచుండెడు శుభసమగ్రుడు

ఉత్కళిక (కళికలో సగము)-

ఎదురు నసురుల కడు జలంబున
చదియ గొట్టి భుజాబలంబున
బెరికి మందుల గట్టు గొబ్బున
మెఱసి తఱితో దెచ్చి యుబ్బున
కడిమి నని దశకంఠు డేసిన
బడిన లక్ష్మణు బ్రదుక జేసిన
వీర వానర సార్వభౌముడు
ధీరకైరవ పూర్ణసోముడు

10

తెలుగు ఛందస్సులో రగడలకు మాత్రమే అంత్యప్రాస నియతము, మిగిలిన పద్యములకు ఇది ఐచ్ఛికము. బహుశా ఈ నియమము వలన నేమో కవులు రగడలను ఎక్కువగా ఉపయోగించలేదు. భావ స్వాతంత్ర్యమునకు ఇది ఒక ఆనకట్ట అనుకున్నారేమో. ఏది ఏమైనా రగడల ఉపయోగము కొన్ని వర్ణనలకు మాత్రమే పరిమితమైనది. కాని యక్షగానములలో, ఉదాహరణకావ్యములలో మాత్రము రగడలు ఉన్నవి. ఆధునిక కవులు కూడ తమ పాటలలో, గేయములలో రగడల బోలు ఛందస్సును వాడినారు.

రగడలయొక్క ముఖ్యమైన నియమములు- (1) ఇవి ద్విపదలు. (2) ఆది మఱియు అంత్య ప్రాసలు అవసరము. (3) గణములకు తగ్గట్లు పదముల విఱుపు ఉండవలయును. ఇందులో చాలమంది కవులు అంత్య ప్రాసకు రెండు పాదములలో ఒకే పదమును ఉపయోగించిరి. (ద్విపదలలో రెండు పాదములలో ఒకే పదమును ఉపయోగించరాదు.) పదముల విఱుపును కూడ ఎల్లప్పుడు పాటించలేదు. యక్షగానములలో దీనిని చక్కగ నాచరించిరి.

హరిణ-, వృషభ- గతి రగడలు తప్ప మిగిలినవి ఒకే విధములైన మాత్రలతో (త్రి, చతుర్‌, పంచ మాత్రలతో) శోభిల్లుచుండును. మిశ్రగతితో నుండు రగడలైన హరిణ వృషభగతి రగడలలో ఒక దళమునకు ఏడు మాత్రలు ఉండును. హరిణగతిలో ఇట్టి సప్తమాత్రాదళములు పాదమునకు రెండు, వృషభగతిరగడలో ప్రతి పాదమునకు నాలుగు ఉండును. సామాన్యముగా ఒక దళములో ఇవి మూడు, నాల్గుగా విఱుగును. కాని కవులు ఈ విషయములో చాల స్వాతంత్ర్యమును తీసికొనినారు. యక్షగానములలో ఇవి సామాన్యముగా (3, 4).

ఈ రోజు మీకు ఏడు మాత్రలను ప్రతి పాదములో అమరించు విధమును చెప్పదలచుకొన్నాను. పదములను ఇట్లు అమరించిన చదువు విధము మారును. అన్ని గమనములు కూడ ఒక్కటే కావు. ఇట్టి రగడలను హరివిల్లు రగడలు అని పిలువ దలచాను. హరివిల్లులో ఏడు రంగు లుండునట్లు, ఈ రగడలో ఏడు మాత్ర లున్నవి గనుక.

హరివిల్లు రగడ- (3,4, 3,4)

హిమము కురిసెడు ఋతువు యిప్పుడు
సుమము విరియదు చూడ నిప్పుడు
ద్యుమణి వేడియు దూర మిప్పుడు
ద్రుమములకు పెడ రూప మిప్పుడు

(ఇది హరిణగతిరగడ. ఈ ఉదాహరణమును గడచిన సందేశములో తెలిపినాను.)

హరివిల్లు రగడ- (4,3, 4,3)

ఆకులు రాలె వ్యాకుల మాయె
మ్రాకులు పత్ర రహితము లాయె
నా కిట మనసు నలిగెను చాల
హా! కనబడునొ యామని హేల

(ఇది కూడ హరిణగతి రగడయే. కాని దీని గతిని పై పద్యముతో పోల్చిన, ఇందులోని భిన్నత్వమును గమనించవచ్చును.)

హరివిల్లు రగడ- (3,4, 4,3)

ఎడమ లేదిట నెల్లెడ హిమము
కుడియు దిశ లిట కొండయె హిమము
పడెను మెల్లగ స్ఫటికపు హిమము
తులకరించెను ధ్రువమున హిమము

ఇందులో ప్రతి పాదములో మొదటి దళమునకు, రెండవ దళమునకు గతి మారినది.

(Sidebar: At the north pole, there is only one direction, vij., south. Only at places away from the poles, four directions as we know exist.)

హరివిల్లు రగడ- (4,3, 3,4)

నల్లని మొయిలు నయన హృద్యము
తెల్లని హిమము దృష్టి చోద్యము
నల్లని హరికి నవము పద్యము
తెల్లని హృదికి తృప్తి తథ్యము

ఇందులో కూడ ప్రతి పాదములో మొదటి దళమునకు, రెండవ దళమునకు గతి మారినది.

సంగీతములో వైవిధ్యమును కలిగించుటకు దళమునందలి మాత్రల విఱుపు మనకు సహాయమునకు వచ్చును.

11

నిన్న సప్తమాత్రలను దళములలో విఱిచి వ్రాయు విధానమును మీకు తెలిపినాను. దీనికి హరివిల్లు రగడ అని పేరు పెట్టిన విషయము కూడ మీకు జ్ఞాపకము ఉంటుంది. ఈ హరివిల్లు రగడ యొక్క ఒక ప్రత్యేకత హరిణగతి, వృషభగతి రగడలు.

ఈ రోజు అష్టమాత్రాదళములతో వ్రాయు రగడలను మీకు తెలియజేయు చున్నాను. దీనికి చారుగతి రగడ అని నామకరణము చేసినాను. ఈ రగడలు లక్షణ గ్రంథములలో లేవు, ఇవి నా కల్పన.

చారుగతి రగడ- (3,5, 3,5)

భువన భువనములు పులకరించగా
కవిత నల్లరా కలల గాంచగా
భువన మోహనా మురళి పాడరా
నవతలోన హృది నాట్య మాడురా

చారుగతి రగడ- (5,3, 5,3)

ఎడదవ్వు రవికి హీనమయె వాడి
కుడివైపు రవికి కొఱయాయె వేడి
వడి లేని నదిని వడి దాటె లేడి
జడమాయె భూమి చలి గాలి గూడి

చారుగతి రగడ- (3,5, 5,3)

నల్ల మేఘములు నభములో తేలె
తెల్ల హిమమణులు దివినుండి రాలె
ఉల్ల మేలకో యుప్పొంగి తూలె
యెల్ల జగతి నా హిమరాశి యేలె

నందనందనా నను జూడ రమ్ము
డెంద మిత్తురా లెస్సగా కొమ్ము
ముందు జీవితము మోహనా యిమ్ము
సందె వేళలో సత్య మిది నమ్ము

చారుగతి రగడ- (5,3, 3,5)

సుందరము ఋతువు శుక్ల హిమ మయము
సుందరము నగము శుభ్ర హిమ మయము
సుందరము ప్రకృతి చూర్ణ హిమ మయము
సుందరము జగతి శోభనా మయము

12

ఈ రోజు మీకు సరసగతి రగడను గుఱించి తెలిపెదను. ప్రతి దళములో తొమ్మిది మాత్రలుండును దీనికి. క్రింద కొన్ని ఉదాహరణలు-

సరసగతి రగడ- (4,5, 4,5)

రాత్రియు దీర్ఘమయె రసమయ తారకల
ధాత్రియు నిదురించె తఱుగని కోరికల
క్షేత్రము గట్టిపడె చిర నీహారికల
చైత్రము వచ్చు నిక చలికాల మగు కల

సరసగతి రగడ- (5,4, 5,4)

నిదురించె గగనము నిదురించె భానువు
నిదురించె జగతియు నిదురించె ధేనువు
నిదురించె వీణయు నిదురించె వేణువు
నిదురించు మనసులో నీవు నా స్థాణువు

సరసగతి రగడ- (5,4, 4,5)

హిమములో- తెల్లగ నిచ్చట కురిసినవి
సుమములో- తెల్లగ సొబగుల విరిసినవి
అమలమై యందపు టంచులు మెఱసినవి
విమలమై వెల్లని వెలుగులు వెలసినవి

సరసగతి రగడ- (4,5, 5,4)

ఒక హిమమణి వలె మఱొకటి వేరుండదు
ఒక షడ్భుజి వలె మఱొకటి వేరుండదు
రకరకముల మంచి రత్న మిల నుండదు
వికసిత పుష్పమ్ము వేరొండు యుండదు

13

ఇంత వఱకు తెలిపిన రగడలలో ప్రతి పాదములో పూర్వార్ధములో మఱియు ఉత్తరార్ధములో మాత్రల సంఖ్య ఒక్కటే. ఈ రోజు దీనికి భిన్నమైన రగడలను మీకు పరిచయము చేయబోవుచున్నాను. ఇట్టి రగడ మొట్ట మొదట ఉదాహరణకావ్యములో వ్రాయబడినది. కవి దీనిని హంసగతి రగడ అని పిలిచెను. పాదములోని గణముల వరుస- పంచ, పంచ, త్రి, త్రి. అనగా పూర్వార్ధములో ఖండ గతి, ఉత్తరార్ధములో త్రిశ్రగతి.

చిత్రకవి పెద్దనయొక్క హనుమోదాహరణములో సప్తమీ విభక్తిలో కళికోత్కళికలు-

కళిక- (హంసగతి రగడ) పం, పం, త్రి, త్రి

మఱియు నుతికెక్కు శ్రీమంతు నందు
జరపక వరంబులిడు శాంతు నందు
భావ సేవిత రామభద్రు నందు
రావణ ముఖాసహ్య రౌద్రు నందు
ప్రకటితాచార సంపన్ను నందు
సకలహిత సాధు ప్రసన్ను నందు
స్వామి హితకార్య నిర్వాహు నందు
సామాది నయ సముత్సాహు నందు

ఉత్కళిక (కళికలో సగము)- పం, త్రి

పవన వేగంబు
వివిధ యోగంబు
ప్రచుర శౌర్యంబు
నచల ధైర్యంబు
చారు విస్ఫూర్తి
భూరి సత్కీర్తి
గల సుకృతి యందు
వెలయు వ్రతి యందు

ఇట్లే క్రింద మూడు, నాల్గు, ఐదు మాత్రలతో వ్రాయు విధానమును విశదీకరించుచున్నాను. నేను ఇట్టి రగడల నన్నిటిని సరసగతి రగడ అని పిలువ దలచాను.

చిత్రగతి రగడ- (3,3, 4,4)

చల్లనివగు స్ఫటిక కుసుమములు
తెల్లనివగు తీగలు హిమములు
ఫుల్లములగు ముక్తాఫలములు
వల్లకి హృది పాడెను పదములు

చిత్రగతి రగడ- (4,4, 3,3)

తళతళ లాడెను ధవళ హిమము
మిలమిల లాడుచు మెఱసె హిమము
భళిరా యిది యొక పాల కడలి
పలుగుల పలుకుల వఱలు కడలి

(సైడుబార్‌- పురాణాలలో పాల సముద్రము అను భావము బహుశా మంచు కుప్పలను చూడగా వచ్చినదేమో)

చిత్రగతి రగడ- (3,3, 5,5)

మ్రోడువారె భూజములు మొండిగా
వ్రాలిపోయె వనలతలు దండిగా
పాల వోలె పడె మంచు మెండుగా
నేల వెలిగె నిగనిగల నిండుగా

చిత్రగతి రగడ- (5,5, 3,3) హంసగతి రగడ-

శ్వేత వర్ణపు మంచి చీర దొడిగి
భూతలము నిద్రించె స్ఫూర్తి యుడిగి
శీతలకరుడు గగనసీమ వెలిగె
కూతలిడలేక యొక గువ్వ ములిగె

చిత్రగతి రగడ- (4,4, 5,5)

నే జీవనమున నిను జాల మెచ్చితిని
ఈ జగమున నీ కీ మనసు నిచ్చితిని
నే జేరగ నిను నిజముగా వచ్చితిని
పూజకు నే నొక పుష్పమును తెచ్చితిని

చిత్రగతి రగడ- (5,5, 4,4)

శీతలము పవన మది జివ్వున వీచెను
భూతలముపై హిమము ప్రోవుగ తోచెను
చేతనము లేని ధర చిక్కిలి జూచెను
ఆతురత నామనికి నవనియు వేచెను

14

నేను మీకు క్రింది రగడలను పరిచయము చేసినాను-

త్రిమాత్రలతో- హయప్రచార, తురగవల్గన, విజయమంగళ రగడలు.
చతుర్మాత్రలతో- మధురగతి, హరిగతి రగడలు.
పంచమాత్రలతో- ద్విరదగతి, విజయభద్ర రగడలు.
సప్తమాత్రలతో- హరిణగతి, వృషభగతి రగడలు.


సప్తమాత్రలను విపులీకరించి హరివిల్లు రగడను,
అష్టమాత్రలను విపులీకరించి చారుగతి రగడను,
నవమాత్రలను విపులీకరించి సరసగతి రగడను,
విభిన్నమైన పూర్వోత్తరార్ధపాదములతో చిత్రగతి రగడను మీకు సోదాహరణముగా
తెలియజేసినాను.

యక్షగానములలో రగడలను మాత్రమే కాక ద్విపదలను కూడ ఉపయోగించుట వాడుక. కొన్ని యక్షగానములలో పంచచామరములను కూడ వాడినారు. అమరికలో రగడలకు, ద్విపదలకు ఒక ముఖ్యమైన సామ్యము గలదు. అది ఏమనగా, ఈ రెంటికి రెండు పాదములే. ఒక ప్రత్యేక విధముగా వ్రాసినయెడల ద్విపదలు రగడలవలె తోచును. ద్విపదలకు ఆది ప్రాస మాత్రమే, అంత్యప్రాస లేదు. ఇంకొక ముఖ్యమైన నియమము- ద్విపదలలో మొదటి పాదములోని పదములను రెండవ పాదములో వాడరాదు. రగడలలో అంత్యప్రాసకై రెండు పాదములలో ఒకే పదమును వాడుట అరుదు కాదు.

ద్విపద- ఇం, ఇం, ఇం, సూ యతి (1.1, 3.1)

మధురగతి రగడ- చ, చ, చ, చ యతి (1.1, 3.1)

మనమున దలచితి మధురాంగుని గన
వనమున వెదకితి వనమాలిని గన
నను గని నెమలియు నవ్వేనుగ మఱి
కనులకు నాకిట కనరాడుగ హరి

పంచమాత్రల ఇంద్రగణములను ఉపయోగించినయెడల, ద్విపదను ద్విరదగతి రగడవలె రచించవచ్చును. చివరి రెండు మాత్రలను పాడుటలో సరిచేసికొనవచ్చును.

ద్విపద:

మాధవా శ్రీధరా మమతతో రమ్ము
యాదవా శ్రీకరా హరుసమ్ము నిమ్ము
బాధతో నిన్ను నే ప్రార్థింతు నెపుడు
మోద మివ్వంగ రా మోహనా యిపుడు

ద్విరదగతి రగడ: పం, పాం, పం, పం, యతి: 1.1, 3.1

మాధవా శ్రీధరా మమతతో రమ్ము హరి
యాదవా శ్రీకరా హరుసమ్ము నిమ్ము హరి
బాధతో నిన్ను నే ప్రార్థింతు నెపుడు హరి
మోద మివ్వంగ రా మోహనా యిపుడు హరి

పంచచామరపు గణములు- జ-ర-జ-ర-జ-గ. లయకై దీనిని ఎనిమిది లగములన వీలగును. ఇందులో మొదటి లఘువును తొలగించిన మనకు జాతులకు చెందిన ఉత్సాహము లభించును. ఉత్సాహకు ఒక లఘువును చివర చేర్చిన తురగవల్గన రగడ దొరకును. కావున తాళ రీత్యా, గతి రీత్యా, ఉత్సాహ, పంచచామరము, తురగవల్గన రగడలు దాదాపు ఒక్కటే.

ఇందులో మఱొక విశేషమును నేను ఈ మధ్య కనుగొన్నాను. పంచచామరము ఒక సంస్కృత వృత్తము. రావణుడు కైలాసము నెత్తుచు శివుని (జటాకటాహసంభ్రమ... సీతారామకళ్యాణము) ఈ వృత్తములో స్తోత్రము చేసెను. సంస్కృతములో దీనికి యతి తొమ్మిదవ అక్షరము. కాని తెలుగులో పదవ అక్షరము. దీనికి కారణము పంచచామరపు లయను ఉత్సాహ లయను అనుకరించి పాడుట వలన అని నా ఊహ.

పంచచామరము- జ-ర-జ-ర-జ-గ యతి (1, 10)

అహా నగమ్ము గప్పె మేఘ హార మెంతొ యందమై
అహా నభమ్ము నందు వెల్గె నర్క బింబ మందమై
అహా నదమ్ము పారె వేగ మబ్ధి జేర నందమై
అహా నయాన నా మనస్సు హర్ష మొందె నందమై

ఉత్సాహ- ఏడు సూర్యగణములు, ఒక గురువు, యతి (1.1, 5.1)

హా నగమ్ము గప్పె మేఘ హార మెంతొ యందమై
హా నభమ్ము నందు వెల్గె నర్క బింబ మందమై
హా నదమ్ము పారె వేగ మబ్ధి జేర నందమై
హా నయాన నా మనస్సు హర్ష మొందె నందమై

తురగవల్గనరగడ- ఎనిమిది త్రిమాత్రలు, యతి (1.1, 5.1)

హా నగమ్ము గప్పె మేఘ హార మెంతొ యందముగను
హా నభమ్ము నందు వెల్గె నర్క బింబ మందముగను
హా నదమ్ము పారె వేగ మబ్ధి జేర నందముగను
హా నయాన నా మనస్సు హర్ష మొందె నందముగను

రగడల నడక ప్రాచీనకవులకు చక్కగా తెలియుననుటకు, నేను పైన ఇచ్చిన కారణములు సరి యని నా భావము.

15

మూడు, నాల్గు, ఐదు మాత్రలతో విడిగాను, మిశ్రితముగాను క్రమముగా, గణిత రీత్యా వీలైన అన్ని విధములుగా మనకు లభించు రగడలను మీకు తెలియబరచాను. నేడు ఒక అతి నూత్నమైన రగడను మీకు సమర్పించుచున్నాను. ఇది ఆ చదువుల తల్లి పేరితో పిలువదలచాను. ఇందులో ప్రతి పాదమునకు నాల్గు గణములు, ప్రతి గణమునకు ఆఱు మాత్రలు. ఆఱు మాత్రలు మూడు మాత్రల రెట్టింపు అని భావించరాదు. ఆఱు మాత్రలను పదుమూడు విధములుగా వ్రాయ వీలగును. అవి- UUU UUII UIIU IIUU UIUI IUUI IUIU UIIII IUIII IIUII IIIUI IIIIU IIIIII అందులో ఎదురునడక గల మూటిని (IUUI IUIU IUIII) తీసివేసినయెడల మనకు పది షణ్మాత్రలు లభించును.

వాణిశ్రీ రగడ- నాల్గు షణ్మాత్రలు, యతి (1.1, 3.1)

తృష్ణలతో తపనలతో హృదియు మండె సంతతమ్ము
కృష్ణమేఘమా వేగము వృష్టిగాను కురియ రమ్ము
తృష్ణ తీఱు తపన తగ్గు హృదిని నిండు సంతసమ్ము
కృష్ణమోహనా వాణిశ్రీల శ్రుతుల గురియ రమ్ము

16

రగడ అను పదమును ఇంటర్‌నెట్‌లో వెదకినయెడల మీరు ఒక భక్ష్యవిశేషమును, దానిని చేయు విధానమును తెలిసికోగలరు. కవితామతికి ఆహారమైన రగడను గుఱించి నేను ఇన్నాళ్ళు మీకు తెలిపినాను. మీకు ఈ రగడ అను తినుబండారము రుచిగానున్నదని అనుకొంటాను.

శ్రీనాథుని చాటువులలో నొకటి -

సీసము-

కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి

రత్నాంబరంబు లే రాయ డిచ్చు

రంభ గూడె దెనుంగు రాయ రాహుత్తుండు

కస్తూరి కే రాజు బ్రస్తుతింతు

స్వర్గస్థుడయ్యె విస్సన మంత్రి మఱి హేమ

పాత్రాన్న మెవ్వాని పంక్తి గలదు

కైలాసగిరి బండె మైలారవిభు డేగె

దినవెచ్చ మే రాజు తీర్ప గలడు

తేటగీతి-

భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె
గలి యుగంబున నిక నుండ గష్ట మనుచు
దివిజ కవివరు గుండియల్‌ దిగ్గు రనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి

ఈ సీస పద్యములోని ఇంద్ర గణములన్నియు పంచమాత్రలు. అనగా ఖండగతి ఈ పద్యపు నడక. శ్రీనాథుని ఇతర సీసపద్యములలో కూడ పంచమాత్రల ఇంద్రగణములు హెచ్చు. అవి ప్రాసలు లేని ద్విరదగతిరగడలో అన్న భ్రాంతి కలిగించును. అదే విధముగా నాల్గు మాత్రల ఇంద్రగణములను ఉపయోగించిన మధురగతి రగడల నడక వచ్చును. తెలుగు కవులు రగడలను ఎక్కువగా తమ కావ్యములలో వాడకపోయినను, ఆ నడకను వాడినారన్నది తథ్యము.

ఆధునిక కవులలో గంగా రాజేశ్వర రావు గంగారామాయణము అను హనుమద్విజయమును రగడలలో రచించెను. ఇతడు ఆఱు మాత్రల, ఎనిమిది మాత్రల రగడలను కూడ ఉపయోగించెను. కాని ఇతడు ఆఱు మాత్రలను (2+4, 3+3, 2+2+2) అని వాడెను. కాని ఆఱు మాత్రలను 13 విధములుగా వ్రాయ వీలగునని నేను మీకు నిరూపించినాను. ఏడు మాత్రలను 21 విధములుగా, ఎనిమిది మాత్రలను 34 విధములుగా వ్రాయ వీలగును. కాని ఆఱు మాత్రలకన్న ఎక్కువ నా ఉద్దేశ్యములో అనవసరమని భావన.

క్రింద ఒక సీస పద్యమును, సీస పద్య లక్షణములే కలిగిన ఆటవెలదిని హనుమత్ప్రార్థనగా మీ ముందు పెట్టుచున్నాను. ఇందులో త్రిమాత్రల, చతుర్మాత్రల, పంచమాత్రల, సప్తమాత్రల నడకలు ఉన్నవి. ఇది వివిధ రగడ గర్భిత సీస పద్యము.

సీసము-

మనసున రాముని మఱవక దలతువు

దినరాత్రులు సిరి దీప్తిం గొలుతువు

వనమున జూచితి వనఘను స్వయముగ

ననఘాత్ముని హృది కత్యాదరముగ

అంజనా ప్రియ అభయ హనుమా యంజలుల్‌

గొని యార్తి వినుమా యకుంఠితాత్మ

భీమసేన హృదయ ప్రేమాంబుధి మరాళ

శ్రీమధ్వరాయ హృత్సీమ రాజ

ఆటవెలది-

భక్తి ఫలము నీవు శక్తి ఫలము నీవు
సత్యముగను నీవు సంతసమ్ము
ముక్తి ఫలము నీవు మోక్ష ముదము నీవు
నిత్యముగను నీవు నిజపు ప్రతిమ

మధురగతి రగడ-

మనసున రాముని మఱవక దలతువు
దినరాత్రులు సిరి దీప్తిం గొలుతువు
వనమున జూచితి వనఘను స్వయముగ
ననఘాత్ముని హృది కత్యాదరముగ

హరిణగతి రగడ-

అంజనా ప్రియ అభయ హనుమా
యంజలుల్‌ గొని యార్తి వినుమా

ద్విరదగతి రగడ-

భీమసేన హృదయ ప్రేమాంబుధి మరాళ
శ్రీమధ్వరాయ హృత్సీమ రాజ మరాళ

విజయమంగళ రగడ-

భక్తి ఫలము నీవు శక్తి ఫలము నీవు సత్యముగను
ముక్తి ఫలము నీవు మోక్ష ముదము నీవు నిత్యముగను

ఈ పదునాఱు సందేశములలో రగడల చరిత్రను, ఉత్పత్తిని, ఉదాహరణలను, నేను చేసిన పరిశోధనలను (హరివిల్లు, చారుగతి, సరసగతి, చిత్రగతి, వాణిశ్రీ రగడలను) మీ కనుల ముందు ఉంచినాను. మీరు అవగాహన చేసికొని ఆనందించినారని తలచెదను. అట్లైన, ఒక చిన్న సందేశమును పంపిన కృతజ్ఞుడిని.

నాకు సహాయమైన కొన్ని పుస్తకములు-
కృతజ్ఞతలు:

శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు తమ ఈ వ్యాసమును "ఆంధ్రభారతి"లో ఉంచుటకు అనుమతి ఇచ్చినందులకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.కొన్ని ప్రసిద్ధ రగడలను యిక్కడ చదువగలరు.

AndhraBharati AMdhra bhArati - bhASha - Chandassu - ragaDa - J. K. Mohana rao - tenugu andhra ( telugu andhra andhrabharati )