| శతకములు | గువ్వలచెన్న శతకము |
|
| క. |
వెలయాలు లజ్జచేఁజెడు నిలఁబాఱుఁడు చెడుదురాశ నెదసంతుష్టిన్ విలసిల్లి భూధరుఁడు చెడుఁ గులసతిచెడు లజ్జలేమి గువ్వలచెన్నా! |
101 |
| క. |
భువినొకఁడు చెడును మఱియొకఁ డవిరళముగ వృద్ధిఁబొందు నదివిధివశమౌ రవియుదయించును నొకదెసఁ గువలయపతి క్రుంకునొకెడ గువ్వలచెన్నా! |
102 |
| క. |
ఎవ్వరి కెయ్యదిచెప్పిన నెవ్వరువినరెయ్యదియును నెట్టెట్టినరుల్ మువ్వముగఁ జూచు చుండుము గువ్వలనఁ జరింత్రుముందు గువ్వలచెన్నా! |
103 |
| క. |
ఎప్పటికైనను మృత్యువు తప్పదని యెఱింగియుండి తగినచికిత్సం దప్పింప నెఱుఁగకత్తఱి గుప్పున నేడ్చెదరదేల? గువ్వలచెన్నా! |
104 |
| క. |
జరయును మృత్యువు మొదలుగ మరలఁగ రాకుండునట్టి మార్గంబేదో గురుతెఱుఁగఁ జేయుమని శ్రీ గురుగురుని భజియింపవలయు గువ్వలచెన్నా! |
105 |
| క. |
పరమార్థము నొక్కటెఱిఁగి నరుఁడు చరింపంగవలయు నలువురిలోఁ బా మరుఁడనఁగ దిరిగినను దన గురియొక్కటి విడువకుండ గువ్వలచెన్నా! |
106 |
| క. |
చతురాస్యుని సృష్టియు ఘటకృతివర్యుని భంగికాన నేకగతి సర స్వతిచర్య లట్లెయుండును గుతుకముతోఁ జూచుచుండు గువ్వలచెన్నా! |
107 |
| క. |
పాపము లంటఁగనీయక ప్రాపొసఁగి శరీరమొసఁగి పరమపదంబున్ జేపట్టియొసఁగి కృష్ణుఁడు గోపికలను గరుణఁగాచె గువ్వలచెన్నా! |
108 |
| క. |
మగవారి లక్ష్యపెట్టక తెగివీథుల నంగడులను దిమ్మరియెడి యా మగనాలు దుర్యశంబునకుఁ నగుదురగు న్విడువవలయు గువ్వలచెన్నా! |
109 |
| క. |
గుడివడును నూయిపూడును వడినీళ్లకుఁ జెరువుదెగును వనమిలఖిలమౌ చెడనిది పద్యముసుమ్మీ కుడియెడమలుచూడకన్న గువ్వలచెన్నా! |
110 |
| క. |
ఇప్పద్యము లన్నిఁటిలోఁ జెప్పిన నీతులను మదినిఁజేర్చి తెలిసినన్ దప్పక పదుగురిలోఁగడు గొప్పగ నీతిపరుఁడగును గువ్వలచెన్నా! |
111 |