| శతకములు | గువ్వలచెన్న శతకము |
|
| క. |
శ్రీపార్థసారథీ! నేఁ బాపాత్ముఁడ నీదుపాలఁ బడినాఁడ ననుం గాపాడుమనుచు నాంతర కోపాదు లడంచి వేడు గువ్వలచెన్నా! |
1 |
| క. |
నరజన్మ మెత్తినందున సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద చ్చరణములు మఱవ కుండిన గురుఫలమగు జన్మమునకు గువ్వలచెన్నా! |
2 |
| క. |
ఎంతటి విద్యల నేర్చిన సంతసముగ వస్తుతతులు సంపాదింపన్ జింతించి చూడ నన్నియు గొంతుకఁ దడుపుకొను కొఱకె గువ్వలచెన్నా! |
3 |
| క. |
సారాసారము లెఱుఁగని బేరజులకు బుద్ధిఁజెప్పఁ బెద్దలవశమా? నీరెంత పోసి పెంచినఁ గూరగునా నేలవేము?గువ్వలచెన్నా! |
4 |
| క. |
అడుగునకు మడుఁగు లిడుచును జిడిముడిపా టింతలేన్క చెప్పినపనులన్ వడిఁజేసి నంతమాత్రాన కొడుకగునా లంజకొడుకు? గువ్వలచెన్నా! |
5 |
| క. |
ఈవియ్యని పదపద్యము గోవా? చదివించుకొనఁగఁ గుంభినిమీఁదన్ ఈవిచ్చిన పదపద్యము గోవా మఱిఁ జదువుకొనఁగ గువ్వలచెన్నా! |
6 |
| క. |
ఇరుగుపొరుగువా రందఱుఁ గరమబ్బురపడుచు నవ్వఁగా వేషములన్ మఱిమఱి మార్చిన దొరలకు గురువగునా? బ్రాహ్మణుండు గువ్వలచెన్నా! |
7 |
| క. |
అనుభవము లేని విభవము లనుభావ్యయ కానియాలు నార్యానుమతిన్ గనని స్వభావము ధర్మముఁ గొనని సిరియు వ్యర్థమెన్న గువ్వలచెన్నా! |
8 |
| క. |
పదుగురికి హితవు సంపత్ప్రదమును శాస్త్రోక్తమైన పద్ధతి నడువన్ జెదరదు సిరి హరిభక్తియుఁ గుదురునుగద మదిని నెన్న గువ్వలచెన్నా! |
9 |
| క. |
వెలకాంత లెంద ఱైననుఁ గులకాంతకు సాటి రారు కువలయమందున్ బలువిద్య లెన్ని నేర్చినఁ గులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా! |
10 |