శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. ఆరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్న్‌
గౌరవమొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే
కూరదదెట్లు; హత్తుగడ గూడునె; చూడఁ బదాఱువన్నె బం
గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!
11
ఉ. ఈ క్షితినర్థకాంక్ష మదినెప్పుడు పాయక లోకులెల్ల సం
రక్షకుఁడైన సత్ప్రభుని రాకలు గోరుదు రెందుఁ; జంద్రికా
పేక్షఁ జెలంగి చంద్రుఁడుదయించు విధంబునకై చకోరపుం
బక్షులు చూడవే యెదు రపార ముదంబును బూని భాస్కరా!
12
ఉ. ఈ జగమందు దా మనుజుఁడెంత మహాత్మకుఁడైన దైవమా
తేజము తప్పఁ జూచు నెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా
రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁ గాయలాకులున్‌
భోజనమై తగన్వనికిఁ బోయి చరింపఁడె మున్ను భాస్కరా!
13
చ. ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్రవా
క్పరుషత జూపినన్‌ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం
బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతరపౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!
14
చ. ఉరుగుణవంతుఁడొడ్లు తనకొం డపకారము చేయునప్పుడుం
బరహితమే యొనర్చు నొకపట్టున నైనను గీడుఁ జేయగా నెఱు
గఁడు; నిక్కమేకద యదెట్లన? గవ్వముఁ బట్టి యంతయుం
దరువఁగఁ జొచ్చినం బెరుగుతాలిమి నీయదె వెన్న? భాస్కరా!
15
చ. ఉరుబలశాలి నంచుఁ దను నొల్లని యన్య [పతివ్రతాంగనా
సురతము గోరెనేని కడసుమ్మది భూతికిఁ బ్రాణహాని యౌ;
శిరములు గూల రాఘవునిచే దశకంఠుఁడు ద్రుంగిపోవఁడే
యెఱుఁగక సీత కాసపడి యిష్టుల భృత్యులఁ గూడి భాస్కరా!
16
ఉ. ఊరక వచ్చుఁ బాటు పడకుండిననైన ఫలం బదృష్ట మే
పారఁగఁ గల్గువానికిఁ బ్రయాసము నొందిన దేవదానవుల్‌
వారలటుండఁగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెఁ గాదె సృం
గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా!
17
ఉ. ఊరక సజ్జనుండొదిఁగి యుండిననైన దురాత్మకుండు ని
ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
చీరలు నూరుటంకములు చేసెడివైనను బెట్టె నుండఁగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా!
18
ఉ. ఎట్టుగఁ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్‌
పట్టుపడంగ నేరవు; నిబద్ధి సురావళిఁ గూడి రాక్షసుల్‌
గట్టు పెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మథించి రంతయున్‌
వెట్టియె గాక యేమనుభవించిరి వారమృతంబు భాస్కరా!
19
చ. ఎడపక దుర్జనుండొరుల కెంతయుఁ గీడొనరించుఁ గాని యే
యెడలను మేలు సేయఁడొక యించుకయైనను; జీడపుర్వు దాఁ
జెడఁ దిను నెంతెకాక పుడుసెండు జలంబిడి పెంప నేర్చునే
పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటినైన భాస్కరా!
20
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )