శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. శ్రీగల భాగ్యశాలి కడఁజేరఁగ వత్తురు తారు దారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగము చేసి; రత్ననిలయుండని కాదె సమస్తవాహినుల్‌
సాగరుఁ జేరుటెల్ల ముని సన్నుత! మద్గురుమూర్తి! భాస్కరా!
1
ఉ. అంగన నమ్మరాదు తన యంకెకు రాని మహాబలాఢ్యు వే
భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు! వివేకియైన సా
రంగధరుం బదంబులు కరంబులు గోయఁగ జేసెఁ దొల్లి చి
త్రాంగి యనేకముల్‌ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా!
2
ఉ. అక్కరపాటు వచ్చు సమయంబునఁ జుట్టము లొక్కరొక్కరి
న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికిఁ జూడఁగ యుక్తమే సుమీ
యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లును బండ్లనోడలున్‌
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!
3
చ. అడిగినయట్టి యాచకుల యాశలెఱుంగక లోభవర్తియై
కడపిన ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వాని కె
య్యెడల; నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్‌
గుడువఁగ నీనిచోఁ గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా!
4
చ. అతిగుణహీన లోభికిఁ బదార్థము గల్గిన లేకయుండినన్‌
మితముగఁ గాని కల్మిగల మీఁదట నైన భుజింపఁడింపుగా
సతమని నమ్ము దేహమును సంపద; నేఱులు నిండి పాఱినన్‌
గతుకఁగ జూచుఁ గుక్క తన కట్టడ మీఱక యెందు భాస్కరా!
5
చ. అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండు కోరినన్‌
గదిసి పదార్థమిత్తురటు కానగ వేగమె కొట్టి తెండనన్‌
మొదటికి మోసమౌఁ; బొదుగు మూలముగోసినఁ బాలు గల్గునే
పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా!
6
చ. అనఘుని కైనఁ జేకుఱు ననర్హునిఁ గూడి చరించునంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువునైనఁ దప్పవు యదార్థము; తానది యెట్టులన్నచో
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా!
7
చ. అలఘుగుణ ప్రసిద్ధుఁడగు నట్టి ఘనుండొకఁ డిష్టుఁడై తనున్‌
వలచి యొకించు కేమిడినవానికి మిక్కిలి మేలుచేయుఁగా;
తెలిసి కుచేలుఁ డొక్క కొణిదెం డడుకుల్‌ దనకిచ్చినన్‌ మహా
ఫలదుఁడు కృష్ణుఁడత్యధిక భాగ్యములాతని కీఁడె? భాస్కరా!
8
చ. అవనివిభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె
ట్లవగుణు లైననేమి? పనులన్నియుఁ జేకుఱు వారిచేతనే;
ప్రవిమలనీతిశాలి యగు రాముని కార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే జలధి దాఁటి సురారులఁ ద్రుంచి భాస్కరా!
9
ఉ. ఆదరమింత లేక నరుఁడాత్మబలోన్నతి మంచివారికి\న్‌
భేదము చేయుటం దనదు పేర్మికిఁ గీడగు మూలమె; ట్లమ
ర్యాద హిరణ్యపూర్వకశిపన్‌ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )