శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నిన్నె దినంబులు గూడి యుండినన్‌
దొడ్డ గుణాఢ్యునందుఁ గల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే
ర్వడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుకగా కెఱుంగునే?
తెడ్డది కూరలోఁ గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!
21
ఉ. ఎప్పుడదృష్టతా మహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచు నుండుఁగాక యది యొప్పని రూపుమాయుఁగా
నిప్పున నంటియున్న యతి నిర్మలినాగ్ని గురుప్రకాశముల్‌
దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!
22
ఉ. ఏగతిఁ బాటుపడ్డఁ గలదే భువి నల్పునకు\న్‌ సమగ్రతా
భోగము భాగ్యరేఖగల పుణ్యునకుంబలె; భూరి సత్త్వసం
యోగ మదేభ కుంభయుగళోత్థిత మాంసము నక్కకూనకే
లాగు ఘటించు! సింహము దలంచినఁ జేకురు గాక భాస్కరా!
23
ఉ. ఏడ ననర్హుఁడుండు నటకేఁగు ననర్హుఁడు నర్హుఁడున్నచోఁ
జూడగఁ నొల్లడెట్లన; నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం
గూడిన పుంటిపై నిలువఁ గోరిన యట్టులు నిల్వ నేర్చునే
సూడిదఁ బెట్టు నెన్నుదుటి చొక్కపుఁ గస్తురి మీఁద భాస్కరా!
24
ఉ. ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్‌
జాలు, ననేక మార్గముల సన్నుతికెక్క నదెట్లొకో యనన్‌
రాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్‌
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీఁద భాస్కరా!
25
ఉ. ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైనఁ దాఁ
జక్క నొనర్పఁ; గౌరవులసంఖ్యులు పట్టిన ధేనుకోటలం
జిక్కఁగనీక తత్ప్రబల సేన ననేక శిలీముఖంబులన్‌
మొక్కపడంగఁ జేసి తుదముట్టఁడె యొక్కకిరీటి భాస్కరా!
26
ఉ. కట్టడ దప్పి తాము చెడు కార్యముఁ జేయుచు నుండిరేని దోఁ
బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురునితో నెడఁబాసి విభీషణాఖ్యుఁ డా
పట్టున రాముఁ జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!
27
ఉ. కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి యే గతం
బెట్టునొ పెట్టినయట్లనుభవింపక తీఱదు; కాళ్ళు మీఁదుగాఁ
గట్టుక వ్రేలుడంచుఁ దలక్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకుఁ జేసిన కర్మముగాక భాస్కరా!
28
ఉ. కట్టడ లేని కాలమున గాదు శుభం బొరులెంతవారు చే
పట్టిననైన మర్త్యునకు భాగ్యము రాదనుటెల్లఁ గల్లకా
దెట్టని పల్కినన్‌; దశరథేశ వసిష్ఠులు రామమూర్తికిన్‌
బట్టము కట్టఁ గోరి రది పాయక చేకుఱెనోటు భాస్కరా!
29
ఉ. కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం
దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న
చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా
బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా!
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )