శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
చ. మదిఁ దను నాసపడ్డయెడ మంచిగుణోన్నతుఁడెట్టి హీనునిన్‌
వదలఁడు మేలుపట్టున నవశ్యము మున్నుగ నాదరించుఁగా;
త్రిదశ విమానమధ్యమునఁ దెచ్చి కృపామతి సారమేయమున్‌
మొదల నిడండె ధర్మజుఁడు మూఁగి సురావళి చూడ భాస్కరా!
81
ఉ. మాటల కోర్వజాలఁ డభిమానసమగ్రుఁడు ప్రాణహానియౌ
చోటులనైనఁ దానెదురు చూచుచునుండుఁ; గొలంకు లోపల
న్నీట మునింగినప్పు డతి నీచము లాడిన రాజరాజు పో
రాట మొనర్చి నేలఁబడఁడాయెనె భీముని చేత భాస్కరా!
82
ఉ. మానవనాథుఁ డాత్మరిపు మర్మ మెఱింగినవాని నేలినం
గాని జయింపలేఁ డరులఁ; గార్ముకదక్షుఁడు రామభద్రుఁ డా
దానవనాయకున్‌ గెలువఁ దా నెటులోపుఁ దదీయ నాభికా
పానసుధ న్విభీషణుఁడు తార్కొని చెప్పకయున్న భాస్కరా!
83
ఉ. మానవుఁ డాత్మకిష్టమగు మంచిప్రయోజన మాచరించుచోఁ
గానక యల్పుఁడొక్కఁ డది గాదని పల్కిన వాని పల్కుకై
మానగఁజూడఁడా పని సమంచిత భోజనవేళ నీఁగ కా
లూనిన వంటకంబు దినకుండఁగ నేర్పగునోటు భాస్కరా!
84
ఉ. మానిని చెప్పు నెట్లెఱుకమాలిన వాఁడటు చేసినన్‌ మహా
హాని ఘటించు నే ఘనునికైన నసంశయ ముర్విపైఁ గృపా
హీనతఁ బల్కినన్‌; దశరథేశ్వరుఁ డంగన మాటకై గుణాం
భోనిధి రాముఁ బాసి చనిపోవఁడె శోకముతోడ భాస్కరా!
85
చ. మునుపొనరించు పాతక మమోఘము జీవులకెల్లఁ బూని యా
వెనుకటి జన్మమం దనుభవింపక తీఱదు; రాఘవుండు వా
లిని బడనేసి తా మగుడ లీల యదూద్భవుఁడై కిరాతుచే
వినిశిత బాణపాతమున వీడ్కొనఁడే తన మేను భాస్కరా!
86
ఉ. రాకొమరుల్‌ రసజ్ఞునిఁ దిరంబుగ మన్నన నుంచినట్లు భూ
లోకమునందు మూఢుఁ దమ లోపలనుంపరు; నిక్కమే కదా!
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురుగాక పెంతురే
కాకము నెవ్వరైన శుభకారణ సన్మునిసేవ్య భాస్కరా!
87
ఉ. లోకములోన దుర్జనుల లోఁతు నెఱుంగక చేరరాదు సు
శ్లోకుఁడు చేరినం గవయఁజూతురు చేయుదు రెక్కసక్కెముల్‌
కోకిలఁ గన్నచోట గుమికూడి యసహ్యపుఁ గూతలార్చుచుం
గాకులు తన్నవే తఱిమి కాయము తల్లడమంద భాస్కరా!
88
ఉ. లోను దృఢంబుగాని పెనులోభిని నమ్మి యసాధ్యకార్యముల్‌
కానక పూనునే నతఁడు గ్రక్కునఁ గూలును; నోటిపుట్టిపై
మానవుఁ డెక్కిపోవ నొకమాటు బుటుక్కున ముంపకుండునే
తానొకలోఁతునం గెడసి దానిఁ దరింపఁగ లేక భాస్కరా!
89
ఉ. వంచన యింతలేక యెటువంటి మహాత్ముల నాశ్రయించినం
గొంచెమె కాని మేలు సమకూడ దదృష్టము లేనివారికిన్‌;
సంచితబుద్ధి బ్రహ్మ ననిశంబును వీఁపున మోచునట్టి రా
యంచకుఁ దమ్మితూండ్లు దిననాయెఁగదా ఫలమేమి భాస్కరా!
90
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )