శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంత విద్యవాఁ
డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు; మహేశుపట్టి వి
ద్యానిధి సర్వవిద్యలకు, దానె గురుండు వినాయకుండు దా
నేనుఁగు రీతి నుండియు నదేమిటి కాడఁడు పెండ్లి? భాస్కరా!
31
ఉ. కామిత వస్తుసంపదలు గల్గు ఫలం బొరు లాసపడ్డచో
నేమియుఁ బెట్టఁడేని సిరి యేటికి నిష్ఫలమున్నఁ బోయినన్‌
బ్రామికపడ్డ; లోకులకుఁ బండగ నే మది యెండి పోవఁగా
నేమి ఫలంబు చేఁదు విడదెన్నటికైన ముసిండి భాస్కరా!
32
ఉ. కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం
దూఱిన నెంతవారలకుఁ; దొల్లి పరీక్షితు శాపభీతుఁడై
వారిధి నొప్పు నుప్పరిగ పైఁ బదిలంబుగ దాఁగి యుండినం
గ్రూరభుజంగ దంతహతిఁ గూలడె లోకులెఱుంగ భాస్కరా!
33
చ. కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికుఁడొక్కఁడొక్కఁడే
కలిగెడుఁగాక పెందఱుచు గల్గగ నేరరు; చెట్టు చెట్టునన్‌
గలుగఁగ నేర్చునే? గొడుగు కామలు చూడఁగ నాడనాడ నిం
పలరఁగ నొక్కటొక్కటి నయంబునఁ జేకురుఁగాక భాస్కరా!
34
ఉ. క్రూర మనస్కులౌ పతులఁ గొల్చి వసించిన మంచివారికిన్‌
వారి గుణంబె పట్టి, చెడు వర్తన వాటిలు; మాధురీజలో
దారలు గౌతమీముఖమహానదు లంబుధిఁ గూడినంతనే
క్షారముఁ జెందవే మొదలి కట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా!
35
ఉ. గిట్టుట కేడఁ గట్టడ లిఖించిన నచ్చటఁ గాని యెండుచోఁ
బుట్టదు చావు; జానువుల పున్కల నూడిచి కాశిఁ జావఁగా
ల్గట్టిన శూద్రకున్‌ భ్రమలఁ గప్పుచుఁ దద్విధి గుఱ్ఱమౌచు నా
పట్టునఁ గొంచు మఱ్ఱికడఁ బ్రాణము దీసెగదయ్య! భాస్కరా!
36
చ. ఘనబలసత్త్వ మచ్చుపడఁ గల్గిన వానికి హాని లేనిచోఁ
దనదగు సత్త్వమే చెరచుఁ దన్ను; నదెట్లన నీరు మిక్కిలిన్‌
గినుక వసించినన్‌ జెఱువు కట్టకు సత్వము చాలకున్నచోఁ
గనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడకున్నె భాస్కరా!
37
చ. ఘనుఁడగు నట్టివాఁడు నిజకార్య సముద్ధరణార్థమై మహిం
బనివడి యల్పమానవునిఁ బ్రార్థనఁ జేయుట తప్పుగాదుగా;
యనఘతఁ గృష్ణజన్మమున నా వసుదేవుఁడు మీఁద టెత్తుగాఁ
గనుఁగొని గాలిగాని కడ కాళ్ళకు మ్రొక్కఁడె నాఁడు భాస్కరా!
38
చ. ఘనుఁడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతని లేమిఁ బాపఁగా
గనుగొన నొక్క సత్ప్రభువుఁగాక నరాధము లోపరెందరుం;
బెనుఁ జెఱువెండినట్టి తఱిఁ బెల్లున మేఘుఁడు గాక నీటితోఁ
దనుపఁ దుషారముల్‌ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!
39
ఉ. చంద్రకళావతంసు కృపచాలనినాఁడు మహాత్ముఁడైనఁ దా
సాంద్రవిభూతిఁ బాసి యొక జాతివిహీనునిఁ గొల్చియుంట యో
గీంద్ర నుతాంఘ్రి పద్మ మతిహీనత నొందుట కాదుగా; హరి
శ్చంద్రుఁడు వీరబాహుని నిజంబుగఁ గొల్వఁడె నాఁడు భాస్కరా!
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )