శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. వట్టుచుఁ దండ్రి యత్యధమ వర్తనుఁడైననుగాని వానికిం
బుట్టిన పుత్త్రకుండు తన పుణ్యవశంబున దొడ్డధన్యుఁడౌ;
నెట్టన మఱ్ఱివిత్తు మునుపెంతయుఁ గొంచెము దానఁబుట్టునా
చెట్టు మహోన్నతత్వమును జెందదె శాఖలనిండి భాస్కరా!
91
చ. వలనుగఁ గానలందుఁ బ్రతివర్షమునం బులి నాలుగైదు పి
ల్లలఁ గను దూడనొక్కటి నిలం గను ధేనువు రెండుమూఁడు నేఁ
డుల కటులైన బెబ్బులి కుటుంబము లల్పములాయె నాలమం
దలు గడువృద్ధిఁ జెందవె యధర్మము ధర్మముఁ దెల్ప భాస్కరా!
92
చ. వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయఁబడ్డచోఁ
గొలదియెఁ గాని యెక్కువలు గూడవు; తమ్ములపాకు లోపలం
గలసిన సున్నమించుకయ కాక మఱించుక యెక్కువైనచో
నలుగడఁ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుక పొక్కక యున్నె భాస్కరా!
93
ఉ. వానికి విద్యచేత సిరివచ్చె నటంచును విద్య నేర్వఁగాఁ
బూనినఁ బూనుఁగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం
బూనఁగ నెవ్వఁడోపు; సరిపో చెవి పెంచును గాకదృష్టతా
హీనుఁడు కర్ణభూషణము లెట్లు గడింపఁగనోపు? భాస్కరా!
94
ఉ. సంతత పుణ్యశాలి నొక జాడను సంపద వాసిపోయి తా
నంతటఁ బోక నెట్టుకొని యప్పటియట్ల వసించియుండు; మా
సాంతమునందుఁ జందురుని నన్నికళల్‌ పెడఁబాసి పోయినం
గాంతి వహింపఁడటోటు? తిరుగంబడి దేహమునిండ భాస్కరా!
95
చ. సకలజన ప్రియత్వము నిజంబుగఁ గల్గిన పుణ్యశాలి కొ
క్కొకయెడ నాపదైనఁ దడవుండదు వేగమె పాసిపోవుగా;
యకలుషమూర్తియైన యమృతాంశుఁడు రాహువు తన్ను మ్రింగినం
డకటక మాని యుండఁడె! దృఢస్థితి నెప్పటియట్ల భాస్కరా!
96
చ. సన్నుత కార్యదక్షుఁడొక చాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండక మేలొనరించు సత్త్వసం
పన్నుఁడు భీముఁడా ద్విజుల ప్రాణము కాఁవడె యేకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా!
97
చ. సరసగుణ ప్రపూర్ణునకు సన్నపు దుర్గుణ మొక్కవేళ యం
దొరసిన నిటు నీకుఁ దగునో యని చెప్పిన మాన నేర్చుగా
బురద యొకించుకంత తముఁ బొందిన వేళలఁ జిల్లవిత్తుపై
నొరసిన నిర్మలత్వమున నుండవె నీరములెల్ల భాస్కరా!
98
చ. సరసదయాగుణంబుగల జాణ మహిం గడు నొచ్చియుం
దఱచుగ వాని కాసపడి దాయఁగ వత్తురు లోకులెట్లనం
జెఱకురసంబు గానుఁగను జిప్పిలిపోయిన మీదఁ బిప్పియై
ధరఁ బడియున్నఁ జేరవె ముదంబునఁ జీమలు పెక్కు భాస్కరా!
99
ఉ. సారవివేకవర్తనల సన్నుతికెక్కిన వారిలోపలం
జేరినయంత మూఢులకుఁ జేపడ దానడ; యెట్టులన్నఁ గా
సారములోన హంసముల సంగతి నుండెడి కొంగపిట్ట కే
తీరునఁ గల్గ నేర్చును దదీయగతుల్‌ దలపోయ భాస్కరా!
100
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )