శతకములు భాస్కర శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. పండితులైనవారు దిగువం దగనుండగ, నల్పుఁ డొక్కడు
ద్ధండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి యెగ్గగున్‌;
కొండొకకోతిఁ జెట్టు కొనకొమ్మల నుండగ, గ్రింద గండ భే
రుండ మదేభ సింహనికురంబములుండవె చేరి భాస్కరా!
61
ఉ. పట్టుగ నిక్కుచున్‌ మదముఁ బట్టి మహాత్ములఁ దూలనాడినం
బట్టిన కార్యముల్‌ చెడును బ్రాణమువోవు నిరర్థదోషముల్‌
పుట్టు, మహేశుఁ గాదని కుబుద్ధి నొనర్చిన యజ్ఞ తంత్రముల్‌
ముట్టక పోయి దక్షునికి మోసము వచ్చెఁగదయ్య భాస్కరా!
62
చ. పరహితమైన కార్య మతిభారము తోడిదియైనఁ బూను స
త్పురుషుఁడు లోకముల్పొగడఁ బూర్వమునందొక ఱాలవర్షమున్‌
గురియఁగ జొచ్చినన్‌ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై
గిరినొక కేల నెత్తెనట కృష్ణుఁడు ఛత్రము భాతి భాస్కరా!
63
చ. పలుచని హీనమానవుఁడు పాటిఁదలంపక నిష్ఠురోక్తులం
బలుకుచు నుండుఁగాని, మతి భాసురుఁడైన గుణప్రపూర్ణుఁడ
ప్పలుకులఁ బల్కఁబోవఁడు నిబద్ధిగ నెట్లన; వెల్తికుండఁ దా
దొలకుచునుండుఁ గాని మఱితొల్కునె నిండుఘటంబు భాస్కరా!
64
చ. పలుమఱు సజ్జనుండు ప్రియభాషలె పల్కుఁ గఠోరవాక్యముల్‌
బలుకఁడొకానొకప్పుడు నవి పల్కినన్‌ఁ గీడును గాదు నిక్కమే;
చలువకు వచ్చి మేఘుఁడొక జాడను దా వడగండ్ల రాల్చినన్‌
శిలలగు నోటు వేగిరమె శీతలనీరము గాక భాస్కరా!
65
ఉ. పాపపుఁ ద్రోవవాని కొకపట్టున మేను వికాసమొందినన్‌
లోపల దుర్గుణంబె ప్రబలుం గద! నమ్మగఁ గూడ దాతనిన్‌;
బాపటకాయకున్‌ నునుపు పైపయి గల్గినఁ గల్గుగాక యే
రూపున దానిలోఁగల విరుద్ధపుఁ జేదు నశించు భాస్కరా!
66
ఉ. పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట నెట్టిమానవుం
డైనను వాని నెవ్వరుఁ బ్రియంబునఁ బల్కరు పిల్వరెచ్చటం
దానది యెట్లొకో యనినఁ దథ్యము పుష్పమువాడి వాసనా
హీనత నొంది యున్న యెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా!
67
ఉ. పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్‌
దూరములైన వాని యెడ దొడ్డగఁ జూతురు బుద్ధిమంతు లె
ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ
ర్జూర ఫలంబులం ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా!
68
ఉ. ప్రల్లదనంబుచే నెఱుక పాటొక యింతయులేక యెచ్చటన్‌
బల్లిదుఁడైన సత్ప్రభు నబద్ధములాడినఁ గ్రుంగిపోదు; రె
ట్లల్ల సభాస్థలిం గుమతులై శిశుపాలుఁడు దంతవక్త్రుఁడుం
గల్లలు గృష్ణునుం బలికి కాదె హతంబగుటెల్ల భాస్కరా!
69
ఉ. ప్రేమను గూర్చి యల్పునకుఁ బెద్దతనంబును దొడ్డవానికిం
దా మతితుచ్ఛపుంబని నెదం బరికింపగ యీయరాదుగా
వామకరంబుతోడఁ గడువం గుడిచేత నపానమార్గముం
దోమఁగ వచ్చునే మిగులఁ దోఁచని చేఁతగు గాక భాస్కరా!
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - bhAskara shatakaM - mAravi veMkayya ( telugu andhra )